భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. రిజర్వ్​ డే కూడా పొంచి ఉన్న వాన ముప్పు

భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. రిజర్వ్​ డే కూడా పొంచి ఉన్న వాన ముప్పు

   24.1 ఓవర్లలో 147/2 చేసిన రోహిత్‌‌‌‌సేన
   అక్కడి నుంచి ఈ రోజు కొనసాగనున్న పోరు

 

కొలంబో: ఆసియా కప్‌‌‌‌లో ఇండియా–పాకిస్తాన్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను వాన వెంటాడుతోంది. ఇప్పటికే  గ్రూప్‌‌‌‌ దశ పోరు రద్దవగా సూపర్–4 రౌండ్‌‌‌‌లో భాగంగా ఆదివారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఇండో–పాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కూ వాన అడ్డొచ్చింది. దాంతో ఈ పోరు రిజర్వ్‌‌‌‌ డేకు వెళ్లింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన టీమిండియా వర్షంతో ఆట ఆగిన టైమ్‌‌‌‌కు 24.1 ఓవర్లలో 147/2 స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్‌‌‌‌ శర్మ (49 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56), శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (52 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లతో 58) ఫిఫ్టీలు కొట్టి ఔటవగా.. విరాట్‌‌‌‌ కోహ్లీ (8 బ్యాటింగ్‌‌‌‌), కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (17 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ మధ్యలోసాయంత్రం 5 గంటలకు మొదలైన వాన  దాదాపు 40 నిమిషాల పాటు కురిసింది. తర్వాత ఆగినా కవర్ల మధ్య నుంచి నీరు చేరి కొన్ని చోట్ల ఔట్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ చిత్తడిగా మారింది. గ్రౌండ్‌‌‌‌స్టాఫ్‌‌‌‌ చాలా కష్టపడి ఔట్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ను ఆటకు రెడీ చేశారు. మూడుసార్లు ఔట్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌‌‌‌ను 32 ఓవర్లకు కుదించి రాత్రి 9 గంటలకు ఆట ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, 8.30కు మరోసారి వర్షం మొదలైంది. దాంతో అంపైర్లు రిజర్వ్‌‌‌‌ను ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు  24.2 ఓవర్ల నుంచి మొత్తం 50 ఓవర్ల మ్యాచ్‌‌‌‌ నిర్వహిస్తారు. కానీ, ఈ రోజు కూడా వర్ష సూచన ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఓపెనర్ల మెరుపులు.. తర్వాత చినుకులు

పాక్‌‌‌‌తో గ్రూప్‌‌‌‌ దశ పోరులో నిరాశ పరిచిన టాపార్డర్‌‌‌‌ ఈ సారి మెప్పించింది. ఓపెనర్లు శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, రోహిత్‌‌‌‌ ధనాధన్‌‌‌‌ షాట్లతో అలరించారు. పాక్‌‌‌‌ పేస్‌‌‌‌ త్రయం షహీన్‌‌‌‌, నసీమ్‌‌‌‌ షా, రవూఫ్‌‌‌‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌‌‌‌కు 121 రన్స్‌‌‌‌ జోడించారు. షహీన్‌‌‌‌ వేసిన ఇన్నింగ్స్‌‌‌‌ ఆరో బాల్‌‌‌‌కే సిక్స్‌‌‌‌తో రోహిత్‌‌‌‌ ఖాతా తెరవగా.. అతని వరుస ఓవర్లోనే గిల్‌‌‌‌ ఆరు ఫోర్లతో జోరు చూపెట్టాడు. నసీమ్‌‌‌‌ వేసిన ఎనిమిదో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన అతను 37 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌ సెంచరీ దాటాడు. మధ్యలో కాసేపు నెమ్మదించిన రోహిత్‌‌‌‌ నసీమ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో వరుస బౌండ్రీలతో గేరు మార్చాడు. 13వ ఓవర్లో  బౌలింగ్​కు వచ్చిన స్పిన్నర్‌‌‌‌ షాదాబ్‌‌‌‌కు 6,6,4తో వెల్‌‌‌‌కం చెప్పాడు. అతని తర్వాతి ఓవర్లోనూ 6, 4తో 42 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ, డ్రింక్స్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ తర్వాత పాక్‌‌‌‌ వరుస ఓవర్లో ఈ ఇద్దరినీ ఔట్‌‌‌‌ చేసింది. తొలుత షాదాబ్‌‌‌‌ ఫ్లయిటేడ్‌‌‌‌ బాల్‌‌‌‌ను లాంగాఫ్‌‌‌‌ మీదుగా షాట్‌‌‌‌ ఆడిన రోహిత్‌‌‌‌... ఫహీమ్‌‌‌‌ పట్టిన రన్నింగ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌కు ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే షహీన్‌‌‌‌ వేసిన లెగ్‌‌‌‌ కట్టర్‌‌‌‌కు గిల్‌‌‌‌ షార్ట్‌‌‌‌ కవర్‌‌‌‌లో అఘా సల్మాన్‌‌‌‌కు చిక్కాడు. ఈ టైమ్​లో  కోహ్లీ, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, 25వ ఓవర్‌‌‌‌ తొలి బాల్‌‌‌‌ తర్వాత  ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం రావడంతో ప్లేయర్లు గ్రౌండ్‌‌‌‌ వీడారు. కాగా, శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ వెన్నునొప్పి కారణంగా ఈ మ్యాచ్‌‌‌‌కు దూరం అవ్వగా,  కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ అతని ప్లేస్‌‌‌‌లో టీమ్‌‌‌‌లోకి వచ్చాడు. 

ఖాళీగా స్టాండ్స్​

ఈ టోర్నీలో దాయాదుల పోరుకు అభిమానులు మొహం చాటేస్తున్నారు.  ఆదివారం అయినప్పటికీ స్టేడియంలోని స్టాండ్స్‌‌‌‌ అన్నీ ఖాళీగా కనిపించాయి. సూపర్‌‌‌‌4 రౌండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల టికెట్ల రేట్లు తగ్గించినా కూడా ఫ్యాన్స్‌‌‌‌ రాలేదు.