- రాహుల్, ఇషాన్ మధ్య పోటీ
- మ్యాచ్‌కు వర్షం ముప్పు
- మ. 3 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
కొలంబో: ఆసియా కప్‌లో ఇండో–పాక్ తొలి పోరులో మిస్సయిన హై ఓల్టేజ్ సమరానికి మళ్లీ టైమొచ్చింది. సూపర్–4లో భాగంగా ఆదివారం ఇరుజట్లు మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్ల బ్యాటర్లు, బౌలర్లు ఆయుధాలు సిద్ధం చేసుకుంటుండగా తొలి మ్యాచ్‌ను వెంటాడిన వర్షం మళ్లీ తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగితే.. గెలిచేదెవరు? ఓడేది ఎవరు? హీరోగా నిలిచేదెవరు? అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫ్యాన్స్ సైతం ఈ పోరు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బలమైన దాయాది జట్టు పని పట్టి సూపర్4 రౌండ్‌ను విజయంతో ఆరంభించాలని రోహిత్‌సేన కోరుకుంటోంది. తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన పాక్ ఇందులోనూ నెగ్గి ఫైనల్ చేరాలని ఆశిస్తోంది. ఒకవేళ ఆటకు వర్షం అడ్డు పడితే రిజర్వ్ డే ( సోమవారం)ను ఉపయోగిస్తారు.
ఇషాన్ X రాహుల్
గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్‌పై ఈ మ్యాచ్‌లో అందరి ఫోకస్ ఉండనుంది. తన రాకతో తుది జట్టు కూడా మారనుంది. మిడిలార్డర్‌లో ప్లేస్ కోసం ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పాక్‌తో తొలి మ్యాచ్‌లో ఇషాన్ ఆకట్టుకున్నాడు. అతన్నే కొనసాగిస్తే బాగుంటుందని అందరూ ఆశిస్తున్నా.. ఎక్స్‌పీరియెన్స్ కారణంగా రాహుల్ తుది జట్టులోకి వచ్చే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరూ ఓపెనింగ్, మిడిలార్డర్‌లో ఆడే సత్తా ఉండటం, వికెట్ కీపర్లు కావడంతో ఎవర్ని తీసుకోవాలనే దానిపై మేనేజ్‌మెంట్‌కు తలనొప్పి మొదలైంది.
అయితే గాయం వల్ల మార్చి నుంచి ఆటకు దూరంగా ఉండటం రాహుల్‌కు మైనస్ కాగా, ఇషాన్ లెఫ్ట్ హ్యాండర్ కావడం బలాన్నిచ్చే అంశం. కానీ మూడేళ్లుగా రాహుల్ పెర్ఫామెన్స్ నిలకడగా ఉంది. శుక్రవారం నెట్స్‌లో కేఎల్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడంతో రీ ఎంట్రీ కచ్చితమనే సంకేతాలు వస్తున్నాయి. ఓపెనింగ్‌లో రోహిత్, గిల్‌తో పాటు కోహ్లీ, శ్రేయస్ అయ్యర్.. పాక్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటే భారీ స్కోరును ఆశించొచ్చు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్, జడేజా సత్తా చాటాలి. రెండో స్పిన్నర్‌గా కుల్దీప్, పేసర్లలో శార్దూల్, బుమ్రా, సిరాజ్ పాక్‌ను కట్టడి చేస్తే విజయం కాస్త సులువవుతోంది.
బౌలింగే ఆయుధం..
ఈ మ్యాచ్‌లోనూ పాకిస్తాన్ ఎక్కువగా బౌలింగ్‌నే నమ్ముకుంది. స్టార్ పేస్ త్రయం షాహీన్, నసీమ్, రవూఫ్ చెలరేగితే ఇండియా టాపార్డర్‌కు కష్టాలు తప్పవు. కెప్టెన్ రోహిత్, కోహ్లీ వీళ్లను ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. మ్యాచ్ మిడిల్‌లో షాదాబ్ ఖాన్, అఘా సల్మాన్ రన్స్ కట్టడి చేయడంలో బాగా సక్సెస్ అవుతున్నారు. కొత్తగా వచ్చిన ఫహీమ్ అష్రఫ్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. మొత్తానికి ఇండియా భారీ టార్గెట్ నిర్దేశించాలన్నా, ఛేదించాలన్నా పాక్ బౌలింగ్‌ను చితక్కొట్టాల్సిందే. ఇక పాక్ బ్యాటింగ్‌లో ఇమామ్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అత్యంత కీలకం. వీళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా భారీ స్కోరును ఆశించొచ్చు.
మరో మూడు వికెట్లు
తీస్తే జడేజా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరుతాడు. కుంబ్లే, హర్భజన్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్ అవుతాడు.