బ్లాక్‌‌బస్టర్‌‌ విక్టరీ .. 228 రన్స్‌‌తో పాక్‌‌పై ఇండియా రికార్డు విజయం

బ్లాక్‌‌బస్టర్‌‌ విక్టరీ .. 228 రన్స్‌‌తో పాక్‌‌పై ఇండియా రికార్డు విజయం
  • సెంచరీలతో చెలరేగిన విరాట్‌‌ కోహ్లీ, కేఎల్​ రాహుల్‌‌
  • ఐదు వికెట్లతో కుల్దీప్ మ్యాజిక్‌‌  
  • నేడు శ్రీలంకతో రోహిత్‌‌సేన ఢీ 

ఆసియాకప్‌‌లో ఇండియా-పాక్‌‌ వార్‌‌ వన్‌‌సైడ్‌‌ అయింది. వాన వల్ల రెండ్రోజుల పాటు ఆగుతూ సాగిన మెగా  మ్యాచ్‌‌లో టీమిండియా బ్లాక్‌‌బస్టర్‌‌ వికర్టీ కొట్టింది. క్రికెట్‌‌ కోహినూర్‌‌ విరాట్‌‌ కోహ్లీ, రీఎంట్రీ స్టార్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ సెంచరీలు, స్పిన్నర్​ కుల్దీప్‌‌ యాదవ్‌‌ ఐదు వికెట్లతో విజృంభించడంతో ఏకంగా 228 రన్స్‌‌తో దాయది పాకిస్తాన్‌‌ను చిత్తు చేసింది. చిరకాల ప్రత్యర్థిపై ఈ ఫార్మాట్‌‌లో అతి పెద్ద విజయం సాధించి నేడు శ్రీలంకతో  పోటీకి రెడీ అయింది. 

కొలంబో:   రికార్డుల రారాజు విరాట్‌‌ కోహ్లీ (94 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 నాటౌట్‌‌)  వన్డే కెరీర్‌‌లో 47వ వంద, రీఎంట్రీలో కేఎల్‌‌ రాహుల్‌‌ (106 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 111 నాటౌట్‌‌) సెంచరీకి  చైనామన్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌ (5/25)  స్పిన్‌‌ మ్యాజిక్‌‌ తోడవడంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌ను టీమిండియా చిత్తు చేసింది. ఆసియాకప్‌‌ సూపర్4లో రిజర్వ్‌‌డే, సోమవారం ముగిసిన మ్యాచ్‌‌లో రోహిత్‌‌సేన 228  రన్స్‌‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌‌నైట్‌‌ స్కోరు 147/2తో ఆట కొనసాగించిన ఇండియా 50 ఓవర్లలో 356/2 స్కోరు చేసింది. రోహిత్‌‌ (56), గిల్‌‌ (58) ఫిఫ్టీలు కొట్టారు. పాక్‌‌ బౌలర్లలో షహీన్‌‌, షాదాబ్​ చెరో వికెట్‌‌ తీశారు.  ఛేజింగ్‌‌లో  కుల్దీప్‌‌ దెబ్బకు పాకిస్తాన్‌‌ 32 ఓవర్లలో 128 రన్స్‌‌కే కుప్పకూలింది. ఓపెనర్‌‌ ఫఖర్‌‌ జమాన్‌‌ (27) టాప్‌‌ స్కోరర్‌‌.   కోహ్లీకి ప్లేయర్ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.  సూపర్‌‌4లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌‌లో శ్రీలంకతో ఇండియా పోటీ పడనుంది.

155 బాల్స్‌‌.. 209 రన్స్‌‌

తొలి రోజు ఆడిన 145 బాల్స్‌‌లో  రెండు వికెట్లు కోల్పోయి 147 రన్స్‌‌ చేసిన టీమిండియా రెండో  రోజు కోహ్లీ, రాహుల్‌‌ జోరుకు మరో 155 బాల్స్‌‌లో ఏకంగా 209 రన్స్‌‌ రాబట్టింది. వాన, ఔట్‌‌ఫీల్డ్‌‌ తడిగా ఉండటంతో రెండో రోజు కాస్త ఆలస్యంగా ఆట మొదలవగా.. ఓవర్‌‌నైట్‌‌ బ్యాటర్లు కోహ్లీ, కేఎల్‌‌ ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి చాన్స్‌‌ ఇవ్వలేదు. ఈ ఇద్దరి ముందు బలమైన పాక్​ బౌలింగ్​ దళం పూర్తిగా తేలిపోయింది. గాయం వల్ల పేసర్‌‌ హారిస్‌‌ రవూఫ్‌‌ రెండో రోజు ఆటకు దూరం అవ్వడం పాక్‌‌ను దెబ్బతీసింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన కేఎల్‌‌  బలమైన, చిరకాల ప్రత్యర్థిపై టాప్‌‌ క్లాస్‌‌ ఆటతో వరల్డ్‌‌ కప్‌‌నకు రెడీగా ఉ న్నానని  నిరూపించుకున్నాడు. తొలుత కోహ్లీ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ రాహుల్‌‌కు సపోర్ట్‌‌ ఇచ్చాడు. ఒక్కసారి కుదురుకున్నాక విరాట్‌‌ తన విశ్వరూపం చూపెట్టాడు. తనకు అచ్చొచ్చిన ప్రేమదాస స్టేడియంలో క్లాసిక్‌‌ షాట్లతో హోరెత్తించాడు. తన ట్రేడ్‌‌ మార్క్‌‌ డ్రైవ్స్‌‌తో పాటు ఫ్లిక్‌‌, పుల్‌‌ షాట్లతో అలరించాడు. కేఎల్‌‌ లెగ్‌‌ సైడ్‌‌ ముచ్చటైన షాట్లు కొట్టాడు. ఈ క్రమంలో అతను వంద బాల్స్‌‌లో సెంచరీ దాటగా.. ఫిఫ్టీ తర్వాత ఓ రేంజ్‌‌లో విజృంభించిన విరాట్‌‌ 84 బాల్స్‌‌లోనే సెంచరీ అందుకున్నాడు. ఫిఫ్టీ నుంచి సెంచరీకి కేవలం 29 బాల్స్‌‌ మాత్రమే తీసుకున్నాడు. ఈ ఇద్దరి దెబ్బకు 45 ఓవర్లకే స్కోరు 300 దాటింది. చివర్లో మరింత జోరు చూపెట్టిన విరాట్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆఖరి మూడు బాల్స్‌‌కు 4, 4, 6తో స్కోరు 350 దాటించాడు. 

కుల్దీప్‌‌ కమాల్‌‌.. పాక్‌‌ ఢమాల్‌‌

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో పాకిస్తాన్‌‌ ఏ దశలోనూ ఇండియాకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ముందుగా పేసర్లు పాక్​ టాపార్డర్‌‌ పని పడితే.. తర్వాత స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ మిడిల్‌‌, లోయర్‌‌ ఆర్డర్‌‌ నడ్డి విరిచాడు. పేస్‌‌ లీడర్‌‌ బుమ్రా ఐదో ఓవర్లోనే ఓపెనర్​ ఇమామ్‌‌ (9)ను ఔట్‌‌ చేసి తొలి దెబ్బకొట్టాడు. 11వ ఓవర్లో బౌలింగ్‌‌కు వచ్చిన హార్దిక్‌‌ పాండ్యా మ్యాజిక్‌‌ డెలివరీతో పాక్‌‌ కెప్టెన్‌‌ బాబర్‌‌ (10)ను క్లీన్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. ఆ ఓవర్‌‌ తర్వాత వర్షం వల్ల ఆటకు గంటన్నర పాటు బ్రేక్‌‌ పడింది. రీస్టార్ట్‌‌ అయిన తర్వాత తొలి ఓవర్లోనే శార్దూల్‌‌ ఠాకూర్‌‌  ఫోర్త్‌‌ స్టంప్‌‌ లైన్‌‌పైన వేసిన లెంగ్త్‌‌ బాల్‌‌కు రిజ్వాన్‌‌ (2) రాహుల్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో పాక్‌‌ 47/3తో డీలా పడింది. ఈ టైమ్‌‌లో అఘా సల్మాన్‌‌ (23), ఫఖర్‌‌ జమాన్‌‌  ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, 18వ ఓవర్లో కుల్దీప్‌‌ ఎంట్రీతో ఆట పూర్తిగా వన్‌‌సైడ్‌‌ అయ్యింది.  తన రెండో ఓవర్లోనే ఫ్లయిటెడ్‌‌ బాల్‌‌తో జమాన్‌‌ను క్లీన్‌‌ బౌల్డ్‌‌ చేశాడు.  అతని స్పిన్‌‌, వేరియేషన్లను అర్థం చేసుకోలేక పాక్‌‌ బ్యాటర్లు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు.  సల్మాన్‌‌ ఎల్బీ అవ్వగా,  షాదాబ్​ ఖాన్‌‌ (6) శార్దూల్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు.  ఇఫ్తికార్‌‌ (23)ను రిటర్న్‌‌ క్యాచ్‌‌తో పెవిలియన్‌‌ చేర్చిన కుల్దీప్‌‌.. ఫహీమ్‌‌ (4)ను క్లీన్‌‌ బౌల్డ్‌‌ చేసి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గాయాల కారణంగా నసీమ్‌‌, రవూఫ్‌‌ బ్యాటింగ్‌‌కు రాకపోవడంతో పాక్‌‌ పోరాటం ముగిసింది.

సంక్షిప్త స్కోరు

ఇండియా: 50 ఓవర్లలో 356/2 (కోహ్లీ 122*, రాహుల్‌‌ 111*, షాదాబ్ 1/71);  పాకిస్తాన్‌‌:  32 ఓవర్లలో 128 ఆలౌట్‌‌ (జమాన్‌‌ 27, కుల్దీప్‌‌ 5/25).

కోహ్లీ@ 13,000

ఇండియా సూపర్​ స్టార్​ కోహ్లీ వన్డేల్లో వేగంగా 13 వేల రన్స్​ చేసిన క్రికెటర్‌‌గా సచిన్‌‌ రికార్డును బ్రేక్‌‌ చేశాడు. సచిన్‌‌ 321 ఇన్నింగ్స్‌‌ల్లో ఈ మార్కు అందుకోగా.. కోహ్లీకి  267 ఇన్నింగ్స్‌‌లు మాత్రమే అవసరం అయ్యాయి. 

233 

ఈ మ్యాచ్‌‌లో  కోహ్లీ, రాహుల్‌‌ మూడో వికెట్‌‌కు జోడించిన రన్స్‌‌. ఆసియా కప్‌‌లో అత్యధికం. అలాగే పాక్‌‌పై ఇండియాకు ఏ వికెట్‌‌కైనా ఇదే హయ్యెస్ట్. 

228 వన్డేల్లో రన్స్​ పరంగా పాక్​పై ఇండియాకు ఇదే అతి పెద్ద విజయం. 2008లో మీర్పూర్​లో 140 రన్స్​ తేడాతో గెలిచిన రికార్డును బ్రేక్​ చేసింది.