Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డులు.. భారత్‪పై పాకిస్తాన్ ఆధిపత్యం

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డులు.. భారత్‪పై పాకిస్తాన్ ఆధిపత్యం

చాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో అసలు సిసలు పోరుకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా  చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రోహిత్ సేన సెమీస్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే, ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి.

అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇరు జట్ల మధ్య మునుపటి రికార్డులు ఎలా ఉన్నాయనేది చూద్దాం.. మ్యాచ్‌లు ఎక్కడెక్కడ జరిగాయి..? ఎవరిది పైచేయి..? వంటి వివరాలు తెలుసుకుందాం..

ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ ఐదు సార్లు తలపడగా డిఫెండింగ్ ఛాంపియన్లు మూడింటిలో, టీమిండియా రెండింటటిలో విజయం సాధించాయి.

బర్మింగ్‌హామ్‌.. 3 వికెట్ల తేడాతో పాక్ విజయం

సెప్టెంబర్ 19, 2004న ఎడ్జ్‌బాస్టన్‌(బర్మింగ్‌హామ్‌) వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంజమామ్ సారథ్యంలోని పాక్.. 3 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. అప్పటి టీమిండియా కెప్టెన్.. సౌరవ్ గంగూలీ. మొదట భారత జట్టు 49.5 ఓవర్లలో 200 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ 49.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. 

సెంచూరియన్‌..  54 పరుగుల తేడాతోపాక్ గెలుపు

2009 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెప్టెంబర్ 26న సెంచూరియన్‌లో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 54 పరుగుల తేడాతో భారత్‌ను మట్టికరిపించింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న యూనిస్ ఖాన్ నేతృత్వంలోని పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 302/9 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో గంభీర్ (57), ద్రవిడ్ (76) అర్ధ సెంచరీలు చేసినప్పటికీ, టీమిండియా గెలవలేకపోయింది. 44.5 ఓవర్లలో 248 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

Also Read :- వాట్ ఏ క్యాచ్ క్యారీ

బర్మింగ్‌హామ్‌.. దాయాది చిత్తు 

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై టీమిండియాకు ఇదే తొలి విజయం. జూన్ 15, 2013న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో దాయాది జట్టును చిత్తు చేసింది. మొదట పాకిస్తాన్ 39.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 19.1 ఓవర్లలోనే చేధించింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.

బర్మింగ్‌హామ్‌.. 124 పరుగుల తేడాతో భారీ విజయం

2017,  జూన్ 4 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ బి మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. రోహిత్ శర్మ(91), విరాట్ కోహ్లీ (81), శిఖర్ ధావన్ (68), యువరాజ్ సింగ్ (53) రాణించడంతో భారత్ 48 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఛేదనలో పాకిస్తాన్‌ 33.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. 

ఓవల్‌ ఫైనల్ పోరు.. పాకిస్తాన్ గెలుపు

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్.. 180 పరుగుల తేడాతో  భారత్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్(114) సెంచరీ చేశాడు. ఛేదనలో టీమిండియా 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌట్ అయ్యింది.