IND vs PAK: ఇండియా- పాక్ మ్యాచ్‌లో తెరపైకి కొత్త వివాదం.. బంతిని చేత్తో అడ్డుకున్న కోహ్లీ

IND vs PAK: ఇండియా- పాక్  మ్యాచ్‌లో తెరపైకి కొత్త వివాదం.. బంతిని చేత్తో అడ్డుకున్న కోహ్లీ

–ఛాంపియన్స్ ట్రోఫీ(2025)లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ(100*) విజయంలో కీలకపాత్ర పోషించాడు. గత కొంత కాలంగా ఫామ్‌ లేమితో తంటాలు పడుతున్న కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో చూడ చక్కని కవర్‌డ్రైవ్ షాట్లతో అలరించాడు. 111 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇదంతా బాగానే ఉన్నా.. దాయాది పాక్ అభిమానులు విరాట్‌పై కొత్త ఆరోపణలు మోపుతున్నారు. మైదానంలో భారత స్టార్ 'అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్డ్'కు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. అది నిజమని చెప్పే ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..?

బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ బంతిని ఎక్స్‌ట్రా-కవర్ వైపుగా ఆడిన కోహ్లీ సింగిల్ కోసం ప్రయత్నించాడు. త్రో వచ్చే సమయానికి పరుగు కూడా పూర్తి చేశాడు. కానీ ఏదో కారణం చేత నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు వస్తున్న బంతిని చేత్తో ఆపే ప్రయత్నం చేశాడు. త్రోను బ్యాకప్ చేయడానికి వెనుక ఫీల్డర్ ఎవరూ లేరు. షార్ట్ కవర్‌లో బాబర్ ఆజాం ఉన్నా.. కాస్త దూరంగా ఉన్నాడు. ఇదే వివాదాస్పదమవుతోంది.

అప్పీల్ చేసుంటే.. కోహ్లీ ఔటయ్యే వాడనేది పాక్ అభిమానుల వాదన. తమ జట్టు ఆటగాళ్లు జాలి చూపించినందున విరాట్ సెంచరీ చేయగలిగాడని సెటైర్లు వేస్తున్నారు. 

ఆ సమయంలో కామెంటేటర్ గా ఉన్న మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం కోహ్లీ చర్యలను ఖండించారు. బంతిని చేతితో ఆపే ప్రయత్నం అనవరసమని అన్నారు. పాకిస్తానీలు అప్పీల్ చేస్తే, థర్డ్ అంపైర్ సమీక్షించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్డ్ అంటే ఏంటి..? ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి..?

క్రికెట్ చ‌ట్టాల‌ను రూపొందించే ఎంసీసీ చ‌ట్టాల్లో అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ అనే నిబంధ‌న ఉంది. 37.4 నిబంధ‌న ప్ర‌కారం..  మ్యాచ్ జరుగ్తున్నప్పుడు ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాట‌ర్ బంతిని అడ్డుకోరాదు. బ్యాటర్ ఏదేని సందర్భంలో ఉద్దేశ‌పూర్వంగా త‌న వికెట్ కాపాడుకోవ‌డానికి బంతిని చేతితో అడ్డుకున్న‌ట్ల‌యితే దాన్ని అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్‌గా ప‌రిగ‌ణిస్తూ బ్యాట‌ర్‌ను ఔట్‌గా ప్ర‌క‌టిస్తారు.

ALSO READ : ఛాంపియన్స్ ట్రోఫీలో విదేశీయులను కిడ్నాప్ చేసే కుట్ర.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పాక్ ఆటగాళ్లు అప్పీల్ చేసి ఉంటే, కోహ్లీ 41 పరుగులకే వెనుదిరిగేవాడు. అప్పీల్ చేయకపోవడం వారి తప్పిదం. కోహ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు.. సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.