దుబాయ్: ఇండియా–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతుంటారు. అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోతుంది. ఇక వరల్డ్ కప్‌లో ఇండో–పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. అయితే, ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో జరిగే ఇండో–పాక్ మ్యాచ్‌ను స్టేడియంలో చూడాలని ఆశిస్తున్న ఫ్యాన్స్‌కు చుక్కలు కనిపించనున్నాయి. మ్యాచ్ కోసం ఇతర ప్రాంతాల నుంచి అహ్మదాబాద్ వెళ్లాలనుకునే వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి.
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసి ఒక రోజు ముందుకు జరిపారు. ముందుగా షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పుడే ఈ మ్యాచ్ టైమ్‌లో అహ్మదాబాద్‌లో హోటల్స్ రేట్లను పెంచేశారు. ఇప్పుడు రీషెడ్యూల్ కావడంతో ధరలు ఏకంగా 15 రెట్లు పెరిగాయి. సాధారణ హోటల్‌లో ఒక రోజు రూ. 4 వేలు ఉండాల్సిన చార్జ్‌ను ఏకంగా 60 వేలకు పెంచారు. స్టార్ హోటల్స్‌లో రెండు రాత్రులకు మూడున్నర లక్షలు చార్జ్ చేస్తున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వాళ్ల డేట్ చేంజ్ చేయడానికే 10 వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తం చెల్లించి హోటల్ రూమ్ బుక్ చేసుకుందామన్నా.. మ్యాచ్ టికెట్లు దొరుకుతాయో లేదో చెప్పలేని పరిస్థితి.
ఇండో–పాక్ మ్యాచ్ టికెట్లు సెప్టెంబర్ 3న అందుబాటులోకి రానున్నాయి. పైగా, ఆన్‌లైన్‌లో టికెట్లు కొన్నవాళ్లు మ్యాచ్‌కు ముందు సిటీలోని పలు కౌంటర్లలో ఫిజికల్ టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఒక రోజు ముందుగానే అహ్మదాబాద్ చేరుకోవాలి కాబట్టి ఖర్చు మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ వాపోతున్నారు. కాగా, వరల్డ్ కప్ టికెట్లకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఐసీసీ మంగళవారం ప్రారంభించింది. https://www.cricketworldcup.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి టికెట్ల సేల్ సమాచారం ఐసీసీ పంపించనుంది. ఈ నెల 25 నుంచి వేదికల వారీగా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. 25న నాన్–ఇండియా వామప్ మ్యాచ్‌లు, నాన్–ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల సేల్ స్టార్ట్ అవుతుంది.