- ఫేవరెట్‌గా రోహిత్‌సేన
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరు రానే వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా గడ్డపై అతి పెద్ద క్రికెట్ వార్‌కు రంగం సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్‌కే హైలైట్‌గా నిలిచే అల్టిమేట్ ఫైట్‌కు ఇండియా, పాకిస్తాన్ రెడీ అయ్యాయి. న్యూయార్క్ వేదికగా దాయాది దేశాల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ నేడే. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఏడుసార్లు తలపడితే ఆరుసార్లు పాక్‌ను టీమిండియా ఉతికి ఆరేసింది. మరి, ఈ సూపర్ సండే పోరులోనూ అదరగొట్టి ఏడోసారి దాయాది పని పడుతుందా?
న్యూయార్క్ : సూపర్ ఓవర్లు.. సంచలన ఫలితాలతో ముందుకెళ్తున్న టీ20 వరల్డ్ కప్‌లో బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు వేళయింది. ఆదివారం జరిగే గ్రూప్–ఎ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐర్లాండ్‌ను చిత్తు చేసి జోరుమీదున్న రోహిత్‌సేన.. పసికూన యూఎస్‌ఏ చేతిలో ఓడి డీలా పడ్డ పాక్ పని కూడా పట్టాలని పట్టుదలగా ఉంది. అయితే, అనిశ్చితికి మారుపేరైన పాక్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. పైగా ఇక్కడి పిచ్ అనూహ్యంగా స్పందిస్తూ ఆటగాళ్లకు సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి తప్పిదానికి తావివ్వకుండా వరుసగా రెండో విజయం సాధించాలని ఇండియా టార్గెట్‌గా పెట్టుకుంది.
ఐర్లాండ్‌తో తొలి పోరులో పేసర్ల జోరు, కెప్టెన్ రోహిత్ సూపర్ బ్యాటింగ్‌తో ఇండియా ఈజీగానే నెగ్గినా కొన్ని ప్రతికూలతలు కనిపించాయి. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ మొదటిది. ఐర్లాండ్‌తో పోలిస్తే పాక్ బౌలింగ్ పదునుగా ఉంటుంది. పైగా క్లిష్టమైన పిచ్‌పై చిన్న పొరపాటు కూడా భారీ మూల్యానికి కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌తో కలిసి కోహ్లీ మంచి ఆరంభం ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత పోరులో నిరాశ పరిచిన సూర్య కుమార్ కూడా గాడిలో పడాలి.
రోహిత్, పంత్ తమ ఫామ్‌ను కొనసాగించడంతో పాటు తమ వరకూ వస్తే మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా బాధ్యతగా ఆడాలి. బౌలింగ్‌లో ఇండియాకు తిరుగులేదు. పేస్ లీడర్ బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్‌కు తోడు ఆల్‌రౌండర్ పాండ్యా కూడా ఫామ్‌లోకి రావడం ప్లస్ పాయింట్. పాక్‌పై మంచి రికార్డున్న చైనామన్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తే అక్షర్, జడేజాలో ఒకరు బెంచ్‌పైకి వెళ్తారు.
పాక్ ఏం చేస్తుందో
పాకిస్తాన్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. ఈ టోర్నీకి ముందు మిలటరీ ట్రెయినింగ్ తీసుకున్న ఆ టీమ్ తొలిపోరులోనే అనామక జట్టు అమెరికా చేతిలో బోల్తా కొట్టి అన్ని వైపుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. మరో ఓటమితో సూపర్–8 అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉండటంతో ఇండియాపై గెలుపు ఆ జట్టుకు అత్యంత కీలకం కానుంది. యూఎస్‌ఏతో మ్యాచ్‌లో ఓటమికి కెప్టెన్ బాబర్ బౌలర్లను నిందించాడు. కానీ, పాక్ బ్యాటర్లు కూడా పేలవంగా ఆడారు.
44 రన్స్ కోసం 43 బాల్స్ ఆడిన బాబర్ స్ట్రయిక్ రేట్ సైతం ఈ ఫార్మాట్‌కు ఏమాత్రం సరిపోదు. ఆల్‌రౌండర్ షాదాబ్ ఆకట్టుకున్నా ఓపెనర్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫకర్ జమాన్‌తో పాటు మిగతా బ్యాటర్లు సత్తా చాటితేనే ఇండియాకు పాక్ పోటీ ఇవ్వగలదు. ఈ మ్యాచ్‌లో షాహీన్, ఆమిర్, రవూఫ్, నసీమ్ షాతో కూడిన పేస్ బలంపైనే పాక్ భారీ అంచనాలు పెట్టుకుంది.
ఫోకస్ పిచ్‌పైనే
ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కంటే న్యూయార్క్ స్టేడియంలోని డ్రాప్-ఇన్ పిచ్‌పైనే ఫోకస్ ఉంది. అనూహ్యంగా స్పందిస్తున్న ఈ వికెట్లపై విమర్శలు వస్తున్నాయి. ఈ స్టేడియంలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు మాత్రమే 100 ప్లస్ స్కోరు వచ్చాయి. అనూహ్యమైన బౌన్స్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. ఈ టోర్నీ కోసం ఇండియా యూఎస్ వచ్చినప్పటి నుంచి న్యూయార్క్‌లోనే ఉండటం..
ఐర్లాండ్‌ను ఓడించి మంచి ఆరంభం దక్కించుకోవడం ప్లస్ పాయింట్ కానుంది. కానీ, నసావు స్టేడియం కండిషన్స్‌కు పాక్ ఇంకా అలవాటు పడలేదు. అమెరికా చేతిలో సూపర్ ఓవర్లో కంగుతిన్న తర్వాతి రోజే పాక్ న్యూయార్క్‌కు వచ్చింది. కఠినమైన ఇక్కడి పరిస్థితులకు అలవాటయ్యేందుకు తక్కువ సమయం ఉండటం దాయాది జట్టుకు ప్రతికూలాంశం కానుంది.
జట్లు (అంచనా)
ఇండియా : రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్ (కీపర్), సూర్యకుమార్, శివం దూబే, హార్దిక్, జడేజా, అక్షర్/కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్.
పాకిస్తాన్ : బాబర్ (కెప్టెన్), రిజ్వాన్ (కీపర్) ఉస్మాన్, ఫఖర్, ఆజం ఖాన్, ఇఫ్తికార్, షాదాబ్/సైమ్, షాహీన్, నసీమ్ షా, ఆమిర్, రవూఫ్