
- సెమీస్ బెర్తుపై రోహిత్‌సేన గురి
- పాక్‌కు చావోరేవో
- మ. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్18, జియో హాట్‌స్టార్‌లో లైవ్
ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్ వస్తుందంటే అందరి దృష్టిని ఆకర్షించే మ్యాచ్ చిరకాల ప్రత్యర్థులు ఇండియా–పాకిస్తాన్ ఫైట్. ఏండ్లు గడుస్తున్నా.. ఆటగాళ్లు మారుతున్నా.. ఈ పోరు మాత్రం క్రికెట్ ప్రపంచానికి సిసలైన కిక్ ఇస్తూనే ఉంది. అలాంటి అనుభూతిని మరోసారి అందించేందుకు ఇరు జట్లూ రెడీ అయ్యాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అరబ్ గడ్డపై ఇండో–పాక్ బ్లాక్‌బస్టర్ ఫైట్ నేడే! మెగా టోర్నీలో వరుసగా రెండో విక్టరీతో సెమీఫైనల్ బెర్తును సొంతం చేసుకోవడంతో పాటు 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో ఓటమికి లెక్క సరి చేయాలని రోహిత్‌సేన టార్గెట్‌గా పెట్టుకుంది. ఇంకోవైపు న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాక్ సెమీస్ రేసులో నిలిచేందుకు ఇండియాతో చావోరేవో తేల్చుకోనుంది.
దుబాయ్ : బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో చాంపియన్స్ ట్రోఫీ వేటను ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్ బెర్తుపై గురి పెట్టింది. గ్రూప్–ఎలో భాగంగా ఆదివారం ఇక్కడి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మెగా మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇందులో గెలిస్తే రోహిత్‌సేన సెమీఫైనల్ చేరుకోనుంది. ఈ పోరులో ఓడితే మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలోని పాక్ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించనుంది. ఈ టోర్నీని ఇరు జట్లు పూర్తి భిన్నంగా ప్రారంభించాయి. ఇండియా ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి జోరు మీద ఉండగా..
తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో పాక్ 60 రన్స్ తేడాతో చిత్తయి ఆత్మరక్షణలో పడింది. దాంతో సెమీస్ రేసులో నిలవాలంటే ఇండియాపై పాక్ కచ్చితంగా నెగ్గాల్సిన అవసరం ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు చివరగా 2017 టోర్నీ ఫైనల్లో తలపడ్డాయి. నాడు లండన్‌లో టీమిండియాను ఓడించిన పాక్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆ విజయం స్ఫూర్తితో ఇప్పుడు కూడా రోహిత్‌సేనపై పైచేయి సాధించాలని రిజ్వాన్‌సేన ఆశిస్తోంది. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ తమ దేశం వచ్చేందుకు నిరాకరించిన ఇండియాకు తమ బలం చూపాలని అనుకుంటోంది. కానీ, అది అనుకున్నంత సులువు కాదని ఆ జట్టుకు కూడా తెలుసు.
కోహ్లీపైనే కాస్త కంగారు
ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత నేరుగా దుబాయ్ వచ్చిన రోహిత్‌సేన ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడింది. టోర్నీకి ముందు రోహిత్ ఫామ్, షమీ బౌలింగ్‌పై కాస్త ఆందోళన కలిగింది. కానీ, ఐసీసీ టోర్నీలు అనగానే రెచ్చిపోయే ఈ ఇద్దరూ బంగ్లాపై తమ బలం చూపెట్టారు. షమీ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. క్లిష్టమైన పిచ్‌పై రోహిత్ 41 రన్స్ చేసి శుభ్‌మన్ గిల్‌తో కలిసి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చి కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. వరుసగా రెండు వన్డేల్లో సెంచరీలు కొట్టిన గిల్ కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్లిద్దరూ పాక్‌పైనా పంజా విసరాలని అభిమానులు ఆశిస్తున్నారు. గత ఐదు వన్డేల్లో లెగ్ స్పిన్ బౌలింగ్‌కు ఔటైన కింగ్ కోహ్లీ ఆ బలహీనత వీడాల్సిన అవసరం ఉంది.
దుబాయ్‌లోని స్లో వికెట్లపై భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌తో ఇన్నింగ్స్ నిర్మించడం ముఖ్యం. ఈ విషయంలో ముందుండే కోహ్లీ తన మార్కు చూపెట్టాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. గత మ్యాచ్‌లో ఫెయిలైన శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఈసారి హిట్ అయితే జట్టు విజయం సులువు అవుతుంది. ఐసీసీ ఈవెంట్లలో పాక్‌పై మంచి రికార్డును హార్దిక్ పాండ్యా కొనసాగించాలని చూస్తున్నాడు. కొత్త బాల్‌తో షమీ, యంగ్ పేసర్ హర్షిత్ రాణా, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు మరోసారి కీలకం కానున్నారు.
తీవ్ర ఒత్తిడిలో రిజ్వాన్‌సేన
మూడు దశాబ్దాల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్.. నాలుగు రోజుల్లోనే టోర్నీ నుంచి నిష్ర్కమించే ప్రమాదం ముంగిట ఉంది. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో చిత్తవ్వడమే అందుకు కారణం. ఆ పోరులో పాక్ బ్యాట్, బాల్ రెండింటితో నిరాశపరిచింది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ స్లో బ్యాటింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు స్టార్ ఓపెనర్ ఫకర్ జమాన్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో పాక్ మరింత బలహీనంగా మారింది.
కివీస్‌పై మిడిలార్డర్ బ్యాటర్ ఖుష్దిల్ షా దూకుడైన ఆట ఒక్కటే ఆ జట్టుకు సానుకూలాంశం. కానీ, ఇండియాపై పైచేయి సాధించాలంటే తనొక్కడి ఆటే సరిపోదు. మిగతా బ్యాటర్లూ సమష్టిగా రాణించాలి. కివీస్‌పై ఫెయిలైనప్పటికీ ఇండియా అనగానే పేసర్ షాహీన్ ఆఫ్రిది రెచ్చిపోతాడు. అతనితో పాటు నసీమ్, రవూఫ్, స్పిన్నర్లు మెప్పిస్తేనే రోహిత్‌సేనకు పాక్ గట్టి పోటీ ఇవ్వగలదు.
పిచ్/వాతావరణం
దుబాయ్ పిచ్‌ల స్వభావం తరచూ మారుతుంటుంది. పొడి వికెట్లు స్పిన్నర్లకు మొగ్గు చూపుతాయి. ఆరంభంలో పేసర్లకు కూడా కాస్త సీమ్ మూవ్‌మెంట్, బౌన్స్ లభిస్తుంది. డే నేట్ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. ఆదివారం వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
ఇండియా : రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, కేఎల్ రాహుల్ (కీపర్), అక్షర్, పాండ్యా, జడేజా, షమీ, హర్షిత్, కుల్దీప్.
పాకిస్తాన్ : ఇమామ్- ఉల్ హక్, బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, రిజ్వాన్ (కెప్టెన్, కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ ఆఫ్రిది, నసీమ్ షా, రవూఫ్, అబ్రార్.