న్యూఢిల్లీ: ఆసియా కప్ జరుగుతుందా? లేదా? అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. టోర్నీకి సంబంధించిన డేట్లను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గురువారం ప్రకటించింది. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. అయితే మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలోనే ఏసీసీ రిలీజ్ చేయనుంది. మొత్తం 13 మ్యాచ్‌ల్లో నాలుగు పాకిస్తాన్‌లో, తొమ్మిది శ్రీలంకలో ఆడనున్నారు. వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని హైబ్రిడ్ మోడల్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో పాక్, లంకలో నిర్వహిస్తున్నాం. మ్యాచ్‌లకు సంబంధించిన డేట్లను త్వరలోనే రిలీజ్ చేస్తాం. నాన్ ఇండియా మ్యాచ్‌లకు మాత్రమే పాక్ ఆతిథ్యమిస్తుంది. మిగతా మ్యాచ్‌లు లంకలో జరుగుతాయి. ఒకవేళ ఇండియా, పాక్ ఫైనల్‌కు వెళ్లినా ఆ మ్యాచ్ కూడా లంకలోనే ఉంటుంది’ అని ఏసీసీ పేర్కొంది. ఈసారి వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని 50 ఓవర్ల ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన టోర్నీలో శ్రీలంక విన్నర్‌గా నిలిచింది.
ఒకే గ్రూప్‌లో ఇండియా, పాక్
ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఒక గ్రూప్‌లో ఇండియా, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండగా, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మరో గ్రూప్‌లో ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన జట్లు సూపర్–4కు అర్హత సాధిస్తాయి. సూపర్–4లో టాప్–2లో నిలిచిన టీమ్స్ ఫైనల్‌కు క్వాలిఫై అవుతాయి. సెప్టెంబర్ 17న టైటిల్ ఫైట్ జరుగుతుంది. పాక్‌లో జరిగే నాలుగు మ్యాచ్‌లకు లాహోర్ ఆతిథ్యమివ్వనుంది. లంకలో జరిగే 9 మ్యాచ్‌లు క్యాండీ, పల్లెకెలెలో జరగనున్నాయి. మొత్తానికి మరోసారి ఇండో–పాక్ పోరు చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.
ఐసీసీ జోక్యంతో..
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ రాజకీయ కారణాలతో టీమిండియాను పాక్‌కు పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. తటస్థ వేదికలో ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తిరస్కరించడంతో టోర్నీ నిర్వహణ సందిగ్దంలో పడింది. ఆసియా కప్‌లో ఆడేందుకు టీమిండియా రాకపోతే వన్డే వరల్డ్‌కప్ కోసం తాము కూడా ఇండియాకు రాలేమని పీసీబీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇండో–పాక్ పోరు లేకపోతే వరల్డ్‌కప్ కళ తప్పుతుందని భావించిన ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్‌క్లే, సీఈవో జెఫ్ అల్లార్డిక్ రంగంలోకి దిగారు. ఓవైపు ఎలాంటి షరతులు లేకుండా వరల్డ్‌కప్‌లో ఆడేలా పాక్‌ను ఒప్పించడంతో పాటు హైబ్రిడ్ మోడల్‌కు బీసీసీఐ ఆమోదం తెలిపేలా పావులు కదిపారు. ఓవరాల్‌గా బీసీసీఐ, పీసీబీకి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపెట్టిన ఐసీసీ.. అక్టోబర్ 15న వరల్డ్ లార్జెస్ట్ స్టేడియంలో జరిగే ఇండో–పాక్ వరల్డ్‌కప్ పోరుకు లైన్ క్లియర్ చేసింది. ఇప్పుడు ఆసియా కప్ డేట్లు రావడంతో వీలైనంత త్వరలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను కూడా రిలీజ్ చేయనుంది. ‘15 ఏళ్ల తర్వాత పాక్‌లో ఇండియా టీమ్ ఆడటాన్ని చూడాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. పాక్‌లో ఆడాలన్నా, ఇండియాలో ఆడాలన్నా మా రెండు బోర్డులకు గవర్నమెంట్ క్లియరెన్స్ కావాలి. హోస్టింగ్ రైట్స్ మా వద్దే ఉన్నా. న్యూట్రల్ వెన్యూగా శ్రీలంకను తీసుకున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా టోర్నీ సజావుగా జరుగుతుంది’ అని పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ వ్యాఖ్యానించారు.