వానదే విజయం.. ఫలితం తేలని ఇండో-పాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌

వానదే విజయం.. ఫలితం తేలని ఇండో-పాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌
  • ఇరుజట్లకు చెరో పాయింట్‌‌‌‌
  • రాణించిన ఇషాన్‌‌‌‌, హార్దిక్‌‌‌‌
  • చెలరేగిన పాక్‌‌‌‌ పేసర్లు
  •  రేపు నేపాల్​తో ఇండియా ఢీ

పల్లెకెలె: వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియా, పాకిస్తాన్‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో వాన దేవుడు విజయం సాధించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌‌‌‌ ముగిసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పాక్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ సాధ్యపడలేదు. దీంతో కటాఫ్‌‌‌‌ టైమ్‌‌‌‌ వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు ‘నో రిజల్ట్‌‌‌‌’ మ్యాచ్‌‌‌‌గా ప్రకటించారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్‌‌‌‌ కేటాయించారు. అంతకుముందు హార్దిక్‌‌‌‌ పాండ్యా (90 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 87), ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (81 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 82) రాణించడంతో ఇండియా 48.5 ఓవర్లలో 266 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది షాహీన్‌‌‌‌ ఆఫ్రిది 4/35, రవూఫ్‌‌‌‌, నసీమ్‌‌‌‌ షా చెరో మూడు వికెట్లు తీశారు. సోమవారం జరిగే రెండో మ్యాచ్‌‌‌‌లో ఇండియా.. నేపాల్‌‌‌‌తో తలపడుతుంది. కాగా, తమ తొలి మ్యాచ్​లో నేపాల్​పై నెగ్గిన పాక్​ సూపర్​4 రౌండ్​ చేరుకుంది.

ఆదుకున్న ఇషాన్‌‌‌‌, పాండ్యా 

టాస్​ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా ఇన్నింగ్స్​కు  వర్షం  రెండుసార్లు అంతరాయం కలిగించింది. స్టార్టింగ్​లో పాక్‌‌‌‌ పేసర్లు షాహీన్‌‌‌‌ ఆఫ్రిది, హారిస్‌‌‌‌ రవూఫ్‌‌‌‌ టాపార్డర్​ను దెబ్బకొట్టారు.  ఐదో ఓవర్లో వర్షం వల్ల  కాసేపు ఆట ఆడిన తర్వాత సూపర్‌‌‌‌ లైన్‌‌‌‌ అండ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ వేసిన ఆఫ్రిది తన వరుస ఓవర్లలో రోహిత్‌‌‌‌ (11), విరాట్‌‌‌‌ (4)ను ఔట్ చేశాడు. అద్భుతమైన హాఫ్‌‌‌‌ వ్యాలీతో హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ను, ఇన్‌‌‌‌సైడ్‌‌‌‌ కట్టర్‌‌‌‌తో కోహ్లీని ఔట్‌‌‌‌ చేశాడు. తర్వాత రవూఫ్‌‌‌‌ దెబ్బకు గిల్‌‌‌‌ (10), శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (14) పెవిలియన్‌‌‌‌కు వచ్చారు. దీంతో 14.1 ఓవర్లలో 66 రన్స్‌‌‌‌కే ఇండియా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇషాన్‌‌‌‌, హార్దిక్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ ఆడారు. ఆఫ్రిది ఎక్స్‌‌‌‌ట్రా బౌన్స్‌‌‌‌, నసీమ్‌‌‌‌ షా ఔట్‌‌‌‌సైడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ స్టంప్‌‌‌‌ బాల్స్‌‌‌‌తో ముప్పుతిప్పలు పెట్టినా ఎక్కడా తడబడలేదు. భారీ షాట్స్‌‌‌‌ ఆడే చాన్స్‌‌‌‌ లేకపోయినా ఇషాన్‌‌‌‌, పాండ్యా 52 బాల్స్‌‌‌‌లోనే తొలి 50 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ నెలకొల్పి ఇన్నింగ్స్‌‌‌‌ను గాడిలో పెట్టారు. ఇషాన్‌‌‌‌ అవకాశం వచ్చినప్పుడల్లా బాల్‌‌‌‌ను బౌండ్రీ దాటించాడు. మ్యాచ్ మధ్యలో పాక్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ బాబర్‌‌‌‌.. స్పిన్నర్లు షాదాబ్‌‌‌‌, నవాజ్‌‌‌‌, సల్మాన్‌‌‌‌ ఆగాతో లాంగ్‌‌‌‌ స్పెల్‌‌‌‌ చేయించడం ఇషాన్‌‌‌‌కు బాగా కలిసొచ్చింది. దీంతో 54 బాల్స్‌‌‌‌లోనే అతను హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌‌‌‌లో పాండ్యా తన స్టైల్‌‌‌‌కు భిన్నంగా ఆడి 62 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఇక ఐదో వికెట్‌‌‌‌కు 141 బాల్స్‌‌‌‌లో 138 రన్స్‌‌‌‌ జోడించాక.. ఇషాన్‌‌‌‌ కొట్టిన ఫుల్‌‌‌‌ షాట్‌‌‌‌ను ఇన్‌‌‌‌సైడ్‌‌‌‌ సర్కిల్‌‌‌‌లో బాబర్‌‌‌‌ ఈజీగా అందుకున్నాడు. ఇషాన్‌‌‌‌ ఔటైన తర్వాత పాండ్యా జోరందుకున్నాడు. నవాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో మిడ్‌‌‌‌ వికెట్‌‌‌‌ మీదుగా సిక్స్‌‌‌‌ బాదాడు. అయితే మళ్లీ బౌలింగ్‌‌‌‌కు దిగిన ఆఫ్రిది.. ఓ స్లో బాల్‌‌‌‌తో పాండ్యాను బోల్తా కొట్టించాడు. రవీంద్ర జడేజా (14), శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ (3), కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (4) ఫెయిలైనా చివర్లో బుమ్రా (16) బ్యాట్‌‌‌‌ అడ్డేయడంతో ఇండియా మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది. 

ఖాళీ స్టాండ్స్‌‌‌‌

ప్రపంచ వ్యాప్తంగా ఇండో–పాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఎక్కడ జరిగినా ఫ్యాన్స్‌‌‌‌తో స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. అయితే గతానికి భిన్నంగా ఈసారి పల్లెకెలె స్టేడియంలో చాలా స్టాండ్స్‌‌‌‌ (గ్రాస్‌‌‌‌ బ్యాంక్స్‌‌‌‌) ఖాళీగా దర్శనమిచ్చాయి. వచ్చిన ప్రేక్షకులు కూడా పెద్దగా సందడి చేయకుండా కేవలం ఫ్లాగ్స్‌‌‌‌ ఊపుతూ, చప్పట్లు కొడుతూ కనిపించారు. వికెట్లు పడినా, బౌండ్రీలు బాదినా భారీ స్పందన చూపలేదు. మ్యాచ్‌‌‌‌ టిక్కెట్లు కూడా పూర్తి స్థాయిలో అమ్ముడుపోలేదని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు కూడా క్యాండీ, కొలంబోలో టికెట్‌‌‌‌ కౌంటర్లు ఖాళీగా కనిపించాయి. దీంతో రూ. 6400 టికెట్‌‌‌‌ ధరను రూ. 1500లకు తగ్గించినా అమ్మకాలు కొరవడ్డాయి. హోటల్‌‌‌‌ యాజమానులు, టూర్‌‌‌‌ ఆపరేటర్లు కూడా నిరుత్సాహానికి గురయ్యారు. 

ఐదోసారి..

ఇండియా–పాకిస్తాన్‌‌ మధ్య ఇప్పటిదాకా 133 వన్డేలు జరగ్గా.. వాటిలో ఫలితం తేలని ఐదో మ్యాచ్​ ఇది. 1984లో పాక్‌‌లోని  సియాల్‌‌కోట్‌‌లో జరిగిన వన్డేలో  ఇండియా 40 ఓవర్లలో 210/3తో నిలిచిన టైమ్‌‌లో అప్పటి ఇండియా పీఎం ఇందిరాగాంధీ హత్య వార్త తెలిసి మ్యాచ్‌‌ను ఆపేశారు. 1989లో కరాచీలో  పాకిస్తాన్‌‌ 14.3 ఓవర్లలో 28/3తో ఉన్న దశలో పాక్‌‌ అభిమానులు అతి చేయడంతో మ్యాచ్‌‌ను రద్దు చేశారు. ఇక 1997లో ఆసియా కప్‌‌లో భాగంగా కొలంబోలో ఇండో–పాక్‌‌ మ్యాచ్‌‌ వర్షం వల్ల రద్దవగా.. రెండ్రోజుల తర్వాత ఫ్రెష్‌‌గా నిర్వహించారు. చివరగా అదే ఏడాది సెప్టెంబర్‌‌లో టొరాంటలో ఇండియా–పాక్‌‌ వన్డే మ్యాచ్‌‌ వర్షం వల్ల రద్దయింది.