- బౌలర్లకు కఠిన పరీక్ష
- అశ్విన్ ప్లేస్‌లో జడేజాకు చాన్స్
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
కేప్ టౌన్: తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా సఫారీ గడ్డపై మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. బుధవారం నుంచి జరిగే ఆఖరిదైన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0–1తో వెనకబడ్డ రోహిత్‌సేన ఎలాగైనా ఈ సిరీస్‌ను డ్రా చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్లనూ మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇండియా 14 పాయింట్ల (38.89 పీసీటీ)తో ఆరో స్థానంలో కొనసాగుతున్నది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే రోహిత్.. సౌతాఫ్రికాలో సిరీస్‌ను డ్రా చేసిన కెప్టెన్‌గా ధోనీ(2017–18) రికార్డు సమం చేస్తాడు. కొద్దిగా గ్రాస్‌తో కూడిన న్యూలాండ్స్ కొత్త పిచ్ బ్యాటింగ్, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది.
బౌలింగ్‌లో మార్పులు
తొలి టెస్ట్ పరాజయంలో బ్యాటర్లు, బౌలర్ల పాత్ర సమానంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ మినహా మిగతా వారందరూ ఫెయిలయ్యారు. టాపార్డర్‌లో యంగ్‌స్టర్స్ యశస్వి జైస్వాల్, గిల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ వైఫల్యం టీమ్‌ను వెంటాడుతోంది. పేపర్ మీద బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నా ఫీల్డ్‌లో సఫారీ పేసర్ల ఎక్స్‌ట్రా బౌన్స్, సీమ్ మూవ్‌మెంట్ ముందు వీళ్లు తేలిపోతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫెయిల్యూర్ కూడా ఇబ్బందికరంగా మారింది. సెంచూరియన్‌లో రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోవడం కూడా అతని కెప్టెన్సీకి మచ్చగా మారింది. ఈ నేపథ్యలో ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌లో ఇండియా అట్టర్‌ప్లాఫ్ అయ్యింది. పేసర్లు బుమ్రా, సిరాజ్, శార్దూల్, ప్రసిధ్ పూర్తిగా నిరాశపర్చారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో ముకేశ్, అవేశ్ కు చాన్స్ ఇస్తారేమో చూడాలి. గాయం కారణంగా తొలి టెస్ట్‌కు దూరమైన జడేజా ఫుల్ ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. తను అశ్విన్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. పిచ్‌ను బట్టి ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలనుకుంటే జడేజాతో పాటు అశ్విన్ కూడా తుది జట్టులో ఉంటాడు.
ఎల్గర్ ఆఖరాట..
కెరీర్ చివరి టెస్ట్ ఆడుతున్న డీన్ ఎల్గర్ సిరీస్ విజయంతో వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు. బవూమకు గాయం అవ్వడంతో ఈ మ్యాచ్‌లో సఫారీ టీమ్‌కు అతనే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి టెస్ట్‌లో చెలరేగిన అతను ఈ మ్యాచ్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్నాడు. మార్‌క్రమ్, డి జోర్జి, పీటర్సన్, బెడింగ్‌హమ్‌తో కూడిన సఫారీ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. వీళ్లను కట్టడి చేయాలంటే బుమ్రా, సిరాజ్ కొత్త బాల్‌తో అద్భుతం చేయాల్సిందే. బౌలింగ్‌లో రబాడ, బర్గర్, జాన్సెన్‌కు తోడుగా ఎంగిడి వచ్చాడు. వీళ్లను దీటుగా ఎదుర్కొవాలంటే ఇండియా టాపార్డర్ శక్తికి మించి పోరాడాలి.