మూడో వన్డేలో ఇండియా గ్రాండ్‌‌ విక్టరీ

మూడో వన్డేలో ఇండియా గ్రాండ్‌‌ విక్టరీ
  •      78 రన్స్‌‌ తేడాతో ఓడిన సౌతాఫ్రికా 
  •     2–1తో సిరీస్‌‌ టీమిండియా సొంతం

పార్ల్‌‌‌‌ (సౌతాఫ్రికా): ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొట్టిన ఇండియా.. సఫారీ గడ్డపై రెండోసారి వన్డే సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌‌‌‌లో సంజూ శాంసన్‌‌‌‌ (114 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 108), తిలక్‌‌‌‌ వర్మ (77 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 52), రింకూ సింగ్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 38) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో టీమిండియా 78 రన్స్‌‌‌‌ తేడాతో ప్రొటీస్‌‌‌‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్‌‌‌‌ గెలిచి సౌతాఫ్రికా ఫీల్డింగ్‌‌‌‌ ఎంచుకోగా, బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 296/8 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో సౌతాఫ్రికా 45.5  ఓవర్లలో 218 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. టోనీ డి జోర్జి (81) పోరాడినా మిగతా వారి నుంచి సహకారం అందలేదు. అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ 4 వికెట్లు తీశాడు.  శాంసన్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’, అర్ష్​దీప్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌’ అవార్డులు లభించాయి. 

తిలక్‌‌‌‌ అండతో..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు ఆరంభంలో సఫారీ బౌలర్ల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. రుతురాజ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో అరంగేట్రం చేసిన రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ (22), సాయి సుదర్శన్‌‌‌‌ (10) మంచి ఆరంభాన్నివ్వలేదు. 49 రన్స్‌‌‌‌కే ఈ ఇద్దరూ ఔటయ్యారు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన సంజూ శాంసన్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (21) ఇన్నింగ్స్‌‌‌‌ను గాడిలో పెట్టే బాధ్యతను తీసుకున్నారు. అయితే సంజూ డిఫెన్స్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో రన్‌‌‌‌రేట్ మందగించింది. దీన్ని పెంచే ప్రయత్నంలో 19వ ఓవర్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ ఔటయ్యాడు. మూడో వికెట్‌‌‌‌కు 52 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగియడంతో పాటు ఇండియా 101/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన తిలక్‌‌‌‌ వర్మ నెమ్మదిగా ఆడినా సంజూకు అండగా నిలిచాడు. 39 బాల్స్‌‌‌‌ తర్వాత తొలి బౌండ్రీ కొట్టాడు. రెండో ఎండ్‌‌‌‌లో శాంసన్‌‌‌‌ కూడా అదే తరహాలో ఆడటంతో ఇన్నింగ్స్‌‌‌‌ నెమ్మదిగా సాగింది. 66 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన శాంసన్.. లిజాద్‌‌‌‌ విలియమ్స్‌‌‌‌ (1/71), బర్గర్‌‌‌‌ (2/64), హెండ్రిక్స్‌‌‌‌ (3/63) బౌలింగ్‌‌‌‌లో మూడు భారీ సిక్సర్లు బాదాడు. మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌ కొట్టిన తిలక్‌‌‌‌ 75 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. అయితే 41వ ఓవర్‌‌‌‌లో కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ (1/37) టర్నింగ్‌‌‌‌ బాల్‌‌‌‌కు ఔట్‌‌‌‌ కావడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 116 రన్స్‌‌‌‌ కీలక భాగస్వామ్యం ముగిసింది. 110 బాల్స్‌‌‌‌లో తొలి సెంచరీ పూర్తి చేసిన శాంసన్‌‌‌‌ను 46వ ఓవర్‌‌‌‌లో విలియమ్స్‌‌‌‌ దెబ్బకొట్టాడు. చివర్లో రింకూ సింగ్ దంచికొట్టాడు. అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (1), సుందర్‌‌‌‌ (14), అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (7 నాటౌట్‌‌‌‌), అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (1 నాటౌట్‌‌‌‌) ఫెయిలయ్యారు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 50 ఓవర్లలో 296/8 (సంజూ శాంసన్‌‌‌‌ 108, తిలక్‌‌‌‌ వర్మ 52, బ్యూరాన్‌‌‌‌ హెండ్రిక్స్‌‌‌‌ 3/63, బర్గర్‌‌‌‌ 2/64). సౌతాఫ్రికా: 45.5 ఓవర్లలో 218 ఆలౌట్‌‌‌‌ (జోర్జి 81, మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ 36, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ 4/30).

జోర్జి ఒక్కడే.. 

టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో సౌతాఫ్రికాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్‌‌‌‌ రీజా హెండ్రిక్స్‌‌‌‌ (19) ఫెయిలైనా, టోనీ డి జోర్జి పోరాడాడు. పవర్‌‌‌‌ ప్లేను ఉపయోగించుకుని భారీ షాట్లకు తెరలేపాడు. తొలి వికెట్‌‌‌‌కు 59 రన్స్‌‌‌‌ జోడించి హెండ్రిక్స్‌‌‌‌ ఔట్‌‌‌‌ కాగా, ఆ వెంటనే వచ్చిన డుసెన్‌‌‌‌ (2) నిరాశపర్చాడు. 76/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌‌‌‌ను మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (36)తో కలిసి జోర్జి ఆదుకున్నాడు. మూడో వికెట్‌‌‌‌కు 65 రన్స్‌‌‌‌ జత చేయడంతో ప్రొటీస్‌‌‌‌ 141/3తో నిలిచింది. అయితే 54 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేసిన జోర్జిని 30వ ఓవర్‌‌‌‌లో అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌కు పంపడంతో సఫారీ ఇన్నింగ్స్‌‌‌‌కు పెద్ద ఝలక్‌‌‌‌ తగిలింది. 161/4 స్కోరు నుంచి వేగంగా వికెట్లు కోల్పోయింది. మిల్లర్‌‌‌‌ (10), క్లాసెన్‌‌‌‌ (21) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా ఇండియా బౌలర్లు చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. 33వ ఓవర్‌‌‌‌లో క్లాసెన్‌‌‌‌ను, తర్వాతి ఓవర్‌‌‌‌లో వియాన్‌‌‌‌ ముల్డర్‌‌‌‌ (1)ను ఔట్‌‌‌‌ చేయడంతో స్కోరు 186/6గా మారింది. 38వ ఓవర్‌‌‌‌లో మిల్లర్‌‌‌‌ ఔట్‌‌‌‌తో ప్రొటీస్‌‌‌‌ ఛేదనలో వెనకబడింది. స్వల్ప వ్యవధిలో కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ (14), లిజాద్‌‌‌‌ విలియమ్స్‌‌‌‌ (2), బ్యూరాన్‌‌‌‌ హెండ్రిక్స్‌‌‌‌ (18) పెవిలియన్‌‌‌‌కు చేరారు.