సూర్య సెంచరీ.. 106 రన్స్‌ తేడాతో ఇండియా గెలుపు

సూర్య సెంచరీ.. 106 రన్స్‌ తేడాతో ఇండియా గెలుపు
  •   సూర్య కుమార్ సెంచరీ   5 వికెట్లతో కుల్దీప్‌ మ్యాజిక్‌
  •  మూడో టీ20లో 106 రన్స్‌ తేడాతో ఇండియా గెలుపు  1–1తో సిరీస్‌ సమం

జొహన్నెస్‌‌బర్గ్: టీ20ల్లో తనకు తిరుగులేదని సూర్యకుమార్ యాదవ్ (56 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100) మరోసారి నిరూపించాడు. ఈ ఫార్మాట్‌‌లో సూర్య నాలుగో సెంచరీకి తోడు, బర్త్‌‌డే బాయ్ కుల్దీప్ యాదవ్ (5/17) కెరీర్‌‌‌‌ బెస్ట్ బౌలింగ్‌‌తో చెలరేగడంతో గురువారం జరిగిన మూడో, చివరి టీ20లో ఇండియా 106 రన్స్‌‌ తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాపై అతి పెద్ద విజయం సాధించింది. రెండో మ్యాచ్‌‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ సిరీస్‌‌ను 1–1తో పంచుకుంది. తొలుత ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 201/7 స్కోరు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (41 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) ఫిఫ్టీతో రాణించాడు.  సఫారీ బౌలర్లలో కేశవ్, లిజాద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా 13.5  ఓవర్లలో 95 రన్స్‌‌కే ఆలౌటై ఓడింది. మిల్లర్ (35 ), మార్‌‌‌‌క్రమ్‌‌(25) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ ఐదు,  జడేజా రెండు వికెట్లు పడగొట్టారు. సూర్యకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌‌లో తొలి మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.  

సూర్య, యశస్వి జోరు

సూర్యకుమార్, యశస్వి జైస్వాల్‌‌ అద్భుత ఆటతో ఇండియా భారీ స్కోరు చేసింది. తొలుత టాస్‌‌ ఓడిన జట్టుకు సరైన ఆరంభం దక్కలేదు. రెండు ఫోర్లతో ఊపు మీద కనిపించిన ఓపెనర్ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (8) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. మూడో ఓవర్లో గిల్‌‌తో పాటు తిలక్‌‌ (0)ను వరుస బాల్స్‌‌లో ఔట్‌‌ చేసిన కేశవ్‌‌ ఇండియాకు షాకిచ్చాడు. అప్పటికే మార్‌‌‌‌క్రమ్ బౌలింగ్‌‌ రెండు ఫోర్లు, సిక్స్‌‌తో టచ్‌‌లోకి వచ్చిన జైస్వాల్‌‌కు తోడైన కెప్టెన్‌‌ సూర్య ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు.  లిజాద్‌‌ వేసిన నాలుగో ఓవర్లో చెరో సిక్స్‌‌తో జోరు పెంచారు. కేశవ్‌‌ ఓవర్లో సూర్య 4, 6 రాబట్టగా, షంసీ బౌలింగ్‌‌లో జైస్వాల్ రెండు ఫోర్లు కొట్టడంతో  సగం ఓవర్లకు ఇండియా 87/2 నిలిచింది. మధ్యలో 16 బాల్స్‌‌లో ఒక్క బౌండ్రీ కొట్టని సూర్య.. కేశవ్‌‌ వేసిన 11వ ఓవర్లో ఎక్స్‌‌ట్రా కవర్‌‌‌‌ మీదుగా సిక్స్‌‌తో గేరు మార్చాడు. ఆ వెంటనే జైస్వాల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు వంద దాటించగా.. ఫెలుక్వాయో వేసిన 13వ ఓవర్లో సూర్య వరుసగా 6, 4, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో తను ఫిఫ్టీ దాటాడు. షంసీ బౌలింగ్‌‌లో సూర్య లాఫ్టెడ్ షాట్‌‌తో మరో సిక్స్ రాబట్టగా భారీ షాట్‌‌కు ట్రై చేసిన జైస్వాల్ హెండ్రిక్స్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో మూడో వికెట్‌‌కు 112 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ ముగిసింది. రింకూ సింగ్ (14) కాస్త తడబడినా సూర్య స్లాగ్‌‌ ఓవర్లలోనూ జోరు కొనసాగించాడు. బర్గర్‌‌‌‌ బౌలింగ్‌‌లో 4, 6, 4.. విలియమ్స్‌‌ ఓవర్లో 4, 4తో ముందుకెళ్లాడు. షంసీ బౌలింగ్‌‌లో సిక్స్‌‌తో టచ్‌‌లోకి వచ్చిన రింకూను 19వ ఓవర్లో బర్గర్‌‌‌‌ ఔట్ చేశాడు. ఇక, చివరి ఓవర్ తొలి బాల్‌‌కు డబుల్‌‌ తీసి సెంచరీ (55 బాల్స్‌‌లో) పూర్తి చేసుకున్న సూర్య తర్వాతి బాల్‌‌కే ఔటయ్యాడు. ఓ ఫోర్ కొట్టి జడేజా (4) రనౌటవగా.. జితేష్ (4) హిట్‌‌ వికెట్‌‌గా పెవిలియన్‌‌ చేరాడు. చివరి బాల్‌‌కు డబుల్‌‌తో సిరాజ్ (2 నాటౌట్‌‌) స్కోరు 200 దాటించాడు.

సౌతాఫ్రికా ఢమాల్

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌లో స్పిన్నర్లు కుల్దీప్, జడేజా దెబ్బకు సఫారీ టీమ్ కుప్పకూలింది. సిరాజ్‌‌ తొలి ఓవర్‌‌‌‌ను మెయిడెన్‌‌ చేయగా.. రెండో ఓవర్‌‌‌‌ మూడో బాల్‌‌కే ఓపెనర్ బ్రీడ్జ్‌‌కే (4)ను బౌల్డ్ చేసి ముకేశ్ బ్రేక్‌‌ ఇచ్చాడు.  గత మ్యాచ్‌‌లో దంచికొట్టిన మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌‌ (8)ను నాలుగో ఓవర్లో సిరాజ్‌‌ సూపర్‌‌‌‌ త్రోతో రనౌట్‌‌ చేశాడు.ఈ టైమ్‌‌లో కెప్టెన్‌‌ మార్‌‌‌‌క్రమ్ (25) మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో కౌంటర్ ఎటాక్ చేశాడు. కానీ, ఆరో ఓవర్లో క్లాసెన్ (5)ను అర్ష్​దీప్‌‌ పెవిలియన్‌‌ చేర్చగా.. మూడు బాల్స్‌‌ తర్వాత జడేజా.. మార్‌‌‌‌క్రమ్‌‌ను బోల్తా కొట్టించడంతో సఫారీ టీమ్‌‌ 42/4తో ఎదురీత మొదలు పెట్టింది. మిల్లర్‌‌‌‌  పోరాడే ప్రయత్నం చేసినా  వికెట్‌‌పై టర్నింగ్‌‌ను సద్వినియోగం చేసుకున్న స్పిన్నర్లు జడేజా, కుల్దీప్  బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కుల్దీప్ బౌలింగ్‌‌లో డొనోవాన్ (12), కేశవ్ (1) క్లీన్‌‌ బౌల్డ్ అవగా.. ఫెలుక్వాయో (0) జడ్డూకు రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇచ్చాడు. తన తర్వాతి ఓవర్లోనే బర్గర్ (1), లిజాద్ (0), మిల్లర్‌‌‌‌ను ఔట్‌‌ చేసిన కుల్దీప్ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌‌ను ముగించాడు.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 201/7 (సూర్య 100, జైస్వాల్ 60, కేశవ్ 2/26).
 సౌతాఫ్రికా: 13.5  ఓవర్లలో  95 ఆలౌట్ (మిల్లర్ 35 , మార్‌‌‌‌క్రమ్ 25, కుల్దీప్ 5/17).

సూర్యకు గాయం

ఈ మ్యాచ్‌లో సెంచరీతో దంచిన సూర్య ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. సిరాజ్‌ వేసిన మూడో ఓవర్లో హెండ్రిక్ కొట్టిన బాల్‌ను మిడాఫ్‌లో ఆపే ప్రయత్నంలో అతని ఎడమ కాలు మడమ ట్విస్ట్ అయింది. నొప్పితో విలవిల్లాడిన సూర్యను సపోర్ట్ స్టాఫ్‌ భుజాలపై ఎత్తుకొని బయటకు తీసుకెళ్లారు. వైస్ కెప్టెన్‌ జడేజా టీమ్‌ను నడిపించాడు.