- మ.2 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్
కోల్‌కతా: సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్‌లో అంచనాలను అందుకుంటూ వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా.. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి అనూహ్యంగా చెలరేగిపోతున్న సౌతాఫ్రికా మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్న ఇరు జట్ల మధ్య ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం జరిగే ఈ పోరు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. టోర్నీలో అజేయంగా ఉన్న రోహిత్సేనసఫారీల పని కూడా పడితే 16 పాయింట్లకు చేరుకుంటుంది. నెదర్లాండ్స్‌తో చివరి మ్యాచ్ రిజల్ట్‌తో పని లేకుండా టాప్ ప్లేస్‌తో నాకౌట్‌కు వెళ్లనుంది. మరోవైపు వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన జోరులో ఉన్న సౌతాఫ్రికా సైతం ఇండియాను ఓడించి టాప్ ప్లేస్‌కు రావాలని చూస్తోంది.
సఫారీ బ్యాటర్లు x ఇండియా పేసర్లు
ఈ మ్యాచ్‌లో పవర్ హిట్టర్లు, గేమ్ ఛేంజర్లతో కూడిన సౌతాఫ్రికా బ్యాటర్లకు బలమైన ఇండియా ‘పేస్ గుర్రాల’కు మధ్య పోటీ ఉండనుంది. ఈ టోర్నీలో సఫారీలు బ్యాటింగ్‌లో దుమ్మురేపుతోంది. తమ తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకపై వరల్డ్‌కప్ హయ్యెస్ట్ స్కోరు (428/5) చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐదు మ్యాచ్‌ల్లోనూ 300 ప్లస్ స్కోర్లు రాబట్టింది. నాలుగు సెంచరీలు సహా 545 రన్స్‌తో ఓపెనర్ డికాక్ ఆ టీమ్ బ్యాటింగ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. మార్‌క్రమ్, డసెన్, మిడిలార్డర్‌లో చెలరేగిపోతున్న క్లాసెన్ నుంచి అతనికి మంచి సపోర్ట్ లభిస్తోంది. అయితే, సఫారీలు ఛేజింగ్‌లో తడబడుతున్నారు. పసికూన నెద్లర్లాండ్స్‌పై 245 రన్స్ ఛేజ్ చేయలేక ఓడి..పాకిస్తాన్‌పై 271 రన్స్ ఛేజింగ్‌లో అతి కష్టంగా గెలిచారు. అయితే సౌతాఫ్రికాకు భిన్నంగా ఇండియా ఛేజింగ్‌తో పాటు స్కోర్లను డిఫెండ్ చేసుకోవడంలో సక్సెస్ అవుతోంది. అందుకు ప్రధాన కారణం ఇండియా బౌలర్లే. ముఖ్యంగా షమీ రాకతో హోమ్‌టీమ్ పేస్ బలం రెట్టింపైంది. ఆల్‌రౌండర్ పాండ్యా గాయపడిన కారణంగా తుదిజట్టులో మార్పుతో బరిలోకి దిగిన షమీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనే రెండు ఐదు వికెట్ల స్పెల్స్ సహా 14 వికెట్లతో ఔరా అనిపించాడు. ఈ పోరులోనూ తను కీలకం కానున్నాడు. పేస్ లీడర్ బుమ్రా జోష్‌లో ఉండగా... లంకపై అదరగొట్టిన సిరాజ్ సైతం జోరందుకోవడంతో ఇండియా పేస్ మరింత పదునెక్కింది. మిడిల్ ఓవర్లలో కుల్దీప్, జడేజా స్పిన్ మ్యాజిక్‌ను చూపెడుతున్నారు. స్పిన్ బౌలింగ్‌లో చెలరేగే క్లాసెన్‌కు ఈ ఇద్దరికి మధ్య ఫైట్ కూడా ఆసక్తికరం కానుంది.
బర్త్‌డే బాయ్ కోహ్లీపై ఫోకస్
ఆదివారం విరాట్ కోహ్లీ 35వ బర్త్‌డే కావడంతో ఈ మ్యాచ్‌లో అందరి ఫోకస్ అతనిపైనే ఉండనుంది. ఈ సందర్భంగా స్టేడియంలోని మెజారిటీ ఫ్యాన్స్ కోహ్లీ ఫేస్‌మాస్కులు ధరించడంతో పాటు అతని బర్త్‌డేను స్పెషల్‌గా మార్చేందుకు క్యాబ్ పలు ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి వన్డేల్లో సచిన్ 49 సెంచరీల రికార్డును సమం చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆస్ట్రేలియా (85), న్యూజిలాండ్ (95), శ్రీలంక (88)పై సెంచరీలను కొద్దిలో చేజార్చుకున్న కోహ్లీ ఈ పోరులో సచిన్ రికార్డును సమం చేస్తే తన బర్త్‌డేకు అంతకుమించిన బహుమతి ఉండబోదు. గత మ్యాచ్‌లో ఫెయిలైన కెప్టెన్ రోహిత్ తనకు అచ్చొచ్చిన ఈడెన్‌లో అదరగొట్టాలని ఆశిస్తున్నాడు. గిల్, శ్రేయస్, సూర్యకుమార్ ఫామ్ కొనసాగిస్తే టీమ్‌కు తిరుగుండదు. అయితే, జోరుమీదున్న సఫారీ పేసర్లు మార్కో జాన్సెన్, కొయెట్జీ, స్పిన్నర్ కేశవ్ మహారాజ్ విషయంలో జాగ్రత్త అవసరం. 2011 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఆ టోర్నీలో ఒక్క సౌతాఫ్రికా చేతిలోనే ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఏమాత్రం అలసత్వం చూపెట్టకుండా వరుసగా ఎనిమిదో విక్టరీ సాధిస్తే సెమీస్‌కు ముందు టీమిండియా కాన్ఫిడెన్స్ మరింత పెరగనుంది.
తుది జట్లు (అంచనా):
ఇండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్ , రాహుల్ (కీపర్), సూర్యకుమార్ , జడేజా, కుల్దీప్ , షమీ, బుమ్రా , సిరాజ్.
సౌతాఫ్రికా: డికాక్ (కీపర్), బవూమ (కెప్టెన్), డసెన్, మార్‌క్రమ్, మిల్లర్, క్లాసెన్, జాన్సెన్, రబాడ, మహారాజ్, ఎంగిడి, షంసి/కొయెట్జీ.
పిచ్/వాతావరణం
ఈ మ్యాచ్ కు ఈడెన్ గార్డెన్స్‌లో స్పోర్టింగ్ వికెట్ సిద్ధంగా ఉంది. బ్యాటర్లకు కాస్త అనుకూలించొచ్చు. ఆదివారం మధ్యాహ్నం 32 డిగ్రీల ఎండ ఉండనుంది. రాత్రిపూట ఉష్ణోగ్రత 23 డిగ్రీలకు పడిపోయి రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపే అవకాశం ఉంది.