- 43 రన్స్ తేడాతో ఓడిన శ్రీలంక
- మెరిసిన సూర్య, పంత్, గిల్
- నేడే రెండో మ్యాచ్.. రా. 7 నుంచి
పల్లెకెలె : ఇండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తమ ప్రయాణాన్ని విజయంతో ఆరంభించారు. శ్రీలంక టూర్‌లో ఇండియా శుభారంభం చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (26 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 58) ఫిఫ్టీకి తోడు రిషబ్ పంత్ (33 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 49), యశస్వి జైస్వాల్ (21 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), శుభ్‌మన్ గిల్ (16 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) మెరుపులతో శనివారం జరిగిన తొలి టీ20లో ఇండియా 43 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సాధించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 213/7 భారీ స్కోరు చేసింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు గిల్, యశస్వి భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు 74 రన్స్ జోడించి మంచి పునాది వేయగా.. కెప్టెన్ సూర్య, కీపర్ పంత్ మిడిల్ ఓవర్లలో ఆతిథ్య బౌలింగ్‌ను ఉతికేశారు. మూడో వికెట్‌కు 76 రన్స్ జోడించి జట్టుకు భారీ స్కోరు అందించారు. లంక బౌలర్లలో మతీష పతిరణ నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో లంక 19.2 ఓవర్లలో 170 రన్స్‌కే ఆలౌటై ఓడింది. ఓపెనర్లు పాథుమ్ నిశాంక (48 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79), కుశాల్ మెండిస్
(27 బాల్స్‌లో 7 ఫోర్లు,1 సిక్స్‌తో ) మెరుపు బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 84 రన్స్ జోడించి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. మెండిస్ ఔటైనా.. కుశాల్ పెరీరా (20)తో నిశాంక రెండో వికెట్‌కు 56 రన్స్ జోడించడంతో ఓ దశలో 14 ఓవర్లకు 140/1తో నిలిచిన లంక మ్యాచ్ నెగ్గేలా కనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లో నిశాంకను బౌల్డ్ చేసిన అక్షర్ పటేల్ ఇండియాకు కీలక బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి మన బౌలర్లు వరుసపెట్టి వికెట్లు పడగొట్టి లంకను ఆలౌట్ చేశారు. కెప్టెన్ చరిత్ అసలంక (0), దసున్ షనక (0) సున్నా చుట్టగా.. కామిందు మెండిస్ (12), హసరంగ (2), తీక్షణ (2) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇండియా బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు, అర్ష్‌దీప్, అక్షర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరుగుతుంది.
సంక్షిప్త స్కోర్లు.
ఇండియా : 20 ఓవర్లలో 213/7 (సూర్యకుమార్ 58, పంత్ 49, పతిరణ 4/40).
శ్రీలంక : 19.2 ఓవర్లలో 170 ఆలౌట్ (నిశాంక 79, కుశాల్ మెండిస్ 45, రియాన్ 3/5, అర్ష్‌దీప్ 2/24).