- శ్రీలంకతో ఇండియా అమీతుమీ
కొలంబో: 2019లో వన్డే వరల్డ్ కప్‌లో ఓటమి.. 2022లో టీ20 వరల్డ్ కప్‌లో వైఫల్యం.. 2019, 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో పరాజయం.. 2022 ఆసియా కప్‌లో నిరాశ..! ఇలా గత ఐదేళ్లలో ఐదు మెగా ఈవెంట్లు ఆడితే ఇండియా ఒక్క ట్రోఫీ కూడా నెగ్గలేకపోయింది. ఇప్పుడు ఐదేళ్ల ‘ట్రోఫీ’ కరువును తీర్చుకునే అద్భుత అవకాశం టీమిండియా ముందుకొచ్చింది. ఇప్పటికే ఏడుసార్లు ఆసియా కప్ నెగ్గిన చరిత్రను గుర్తు చేసుకుంటూ.. మరోసారి టైటిల్ ఫైట్‌కు రోహిత్‌సేన సిద్ధమైంది. ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్ పోరులో శ్రీలంకతో అమీతుమీకి సిద్ధమైంది. వచ్చే నెలలోనే వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుండటంతో ఈ మ్యాచ్‌పై ఇండియా ప్రత్యేక దృష్టి పెటింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో లంకేయులు మరో కప్పు నెగ్గాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌కూ వాన ముప్పు ఉంది. అయితే సోమవారం రిజర్వ్ డే ఉంది. కాగా, 2018లో ఇండియా చివరిసారి ఆసియా కప్‌ను గెలుచుకుంది.
అందరూ వచ్చిన్రు..
ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇండియా ఫుల్ టీమ్‌ను బరిలోకి దించుతున్నది. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్–4 లాస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 59కే 4 వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టనుంది. గత మ్యాచ్‌లో డకౌటైన కెప్టెన్ రోహిత్‌తో పాటు సెంచరీ హీరో గిల్, విరాట్ కోహ్లీ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. మిడిలార్డర్‌లో రాహుల్, ఇషాన్ బాధ్యత తీసుకోవాల్సి ఉంది. గత పోరులో ఫెయిలైన తిలక్ వర్మకు చాన్స్ కష్టమే. ఆల్‌రౌండర్లుగా హార్దిక్, జడేజాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మిడిల్ ఓవర్స్‌లో ఈ ఇద్దరి బౌలింగ్ కూడా చాలా కీలకం కానుంది. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న బుమ్రా, సిరాజ్ తిరిగి రానున్నారు. జోరుమీదున్న స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలకం కానున్నాడు. కానీ, గత మ్యాచ్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ఫైనల్‌కు దూరమయ్యాడు. దీంతో ఉన్న ఫలంగా వాషింగ్టన్ సుందర్‌ను లంకకు పిలిపించి జట్టులో చేర్చారు. స్పిన్ వికెట్ కావడంతో శార్దూల్ ప్లేస్‌లో తను తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read:-- Asian Games 2023: చైనా పర్యటనకు అంతా సిద్ధం.. భారత జట్లలో స్వల్ప మార్పులు
తీక్షణ లేకుండానే..
లంక కూడా ఈ మ్యాచ్‌కు రెడీ అయింది. కానీ, గాయంతో స్టార్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ దూరమవడం లోటుగా కనిపిస్తున్నది. ఇది మినహా మిగతా అంశాల్లోనూ లంక మెరుగ్గానే ఉంది. పాక్‌ను కొట్టి ఫైనల్ రావడంతో ప్లేయర్లు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. బ్యాటింగ్‌లో కుశాల్ పెరీరా, సమరవిక్రమ, నిశాంకపై ఎక్కువ భారం ఉంది. మిడిలార్డర్‌లో అసలంకపైనే ఆధారపడటం ప్రతికూలాంశం. ఆల్‌రౌండర్‌గా దునిత్ వెల్లాలగె ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నాడు. తీక్షణ ప్లేస్‌లో హేమంతను తీసుకోవడం సరైందిగా భావిస్తున్నారు, కాసున్, పతిరణ, షనక అంచనాలు అందుకుంటే ఇండియాకు కష్టాలు తప్పవు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లంకకు వరుసగా 15వ విజయం అవుతుంది.