- 3-2తో సిరీస్ నెగ్గిన విండీస్
- దంచికొట్టిన బ్రెండన్ కింగ్
- సూర్య మెరుపులు వృథా
లాడెర్‌హిల్ (అమెరికా): కరీబియన్ గడ్డపై రెండు సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. షార్ట్ ఫార్మాట్‌లో బోల్తా కొట్టింది. టార్గెట్ ఛేజింగ్‌లో బ్రెండన్ కింగ్ (55 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85 నాటౌట్), నికోలస్ పూరన్ (32 బాల్స్‌లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 47) చెలరేగడంతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఇండియాకు షాకిచ్చింది. దాంతో 3–2తో సిరీస్ సొంతం చేసుకుంది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 165/9 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (45 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), తిలక్ వర్మ (18 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. రొమారియో షెఫర్డ్ 4 వికెట్లు తీశాడు. తర్వాత విండీస్ 18 ఓవర్లలో 171/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. అర్ష్‌దీప్, తిలక్ చెరో వికెట్ తీశారు.
బ్రెండన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, పూరన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.
సూర్య జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాను కరీబియన్ పేసర్లు ముప్పుతిప్పలు పెట్టారు. మూడు ఓవర్లలోపే అకీల్ హుస్సేన్ (2/24) దెబ్బకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (5), శుభ్‌మన్ గిల్ (9) వెనక్కి వచ్చేశారు. 17/2 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన సూర్య, తిలక్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. సూర్య 4, 6తో టచ్‌లోకి రాగా, ఆరో ఓవర్‌లో తిలక్ 4, 6, 4, 4తో 19 రన్స్ దంచాడు. దీంతో పవర్‌ప్లేలో ఇండియా 51/2 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్‌లో భారీ సిక్స్ కొట్టిన తిలక్ 8వ ఓవర్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 49 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తర్వాత సూర్య, సంజూ శాంసన్ (13) బౌండ్రీలు కొట్టడంతో ఫస్ట్ టెన్‌లో ఇండియా స్కోరు 86/3కి పెరిగింది. 11వ ఓవర్‌లో పేలవ షాట్ ఆడి శాంసన్ ఔట్‌కాగా, కెప్టెన్ హార్దిక్ (14) క్రీజులోకి వచ్చాడు. ఈ ఇద్దరు సింగిల్సే తీయడంతో ఇన్నింగ్స్‌లో వేగం తగ్గింది. చివరకు రెండు భారీ సిక్సర్లతో సూర్య 38 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించినా తిరిగి ప్రారంభమైన తర్వాత షెఫర్డ్ స్ట్రోక్ ఇచ్చాడు 17వ ఓవర్‌లో సిక్స్ కొట్టిన హార్దిక్‌ను, తన తర్వాతి ఓవర్‌లో అర్ష్‌దీప్ (8), కుల్దీప్ (0)ను ఔట్ చేస్తే మధ్యలో హోల్డర్ (2/36).. సూర్య, అక్షర్ పటేల్ (13)ను వెనక్కి పంపడంతో ఇండియా కష్టంగా 160 మార్కు దాటింది.
కింగ్ ధనాధన్
వర్ష సూచన ఉండటంతో ఛేజింగ్‌ను విండీస్ వేగంగా ఆరంభించింది. 6, 4తో ఖాతా తెరిచిన మేయర్స్ (10)ను రెండో ఓవర్‌లోనే అర్ష్‌దీప్ (1/20) పెవిలియన్‌కు పంపాడు. కానీ బ్రెండన్ కింగ్, పూరన్ బ్యాట్ ఝుళిపించారు. మూడు సిక్సర్లతో పూరన్ టచ్‌లోకి వస్తే, నాలుగో ఓవర్‌లో కింగ్ 4, 6 దంచాడు. ఆరో ఓవర్‌లో మళ్లీ దీన్ని రిపీట్ చేయడంతో పవర్‌ప్లేలో విండీస్ 61/1 స్కోరు చేసింది. పవర్‌ప్లే ముగిసిన తర్వాత ఎక్కువగా సింగిల్స్ తీసిన ఈ జోడీ ఓవర్‌కు ఓ ఫోర్ ఉండేలా ఆడింది. నాలుగు ఓవర్లలో 35 రన్స్ రావడంతో ఫస్ట్ టెన్‌లో కరీబియన్లు 96/1 స్కోరు చేశారు. 11వ ఓవర్‌లో పూరన్ సిక్స్ కొడితే, 13వ ఓవర్‌లో కింగ్ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ దశలో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. తిరిగి ప్రారంభమైన తర్వాత 14వ ఓవర్‌లో తిలక్.. పూరన్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో రెండో వికెట్‌కు 107 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 16వ ఓవర్‌లో కింగ్ రెండు సిక్సర్లతో రెచ్చిపోగా, హోప్ (13 బాల్స్‌లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 22 నాటౌట్) క్యాచ్ ఔట్ నుంచి బయటపడ్డాడు. ఆ వెంటనే కింగ్ 4, 6, 6 బాదగా.. హోప్ సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు.