మనకు కామన్వెల్త్​ గేమ్స్ వద్దా?

మనకు కామన్వెల్త్​ గేమ్స్ వద్దా?

కామన్వెల్త్​ కంట్రీస్​ అంటే ఒకప్పుడు తెల్లోళ్లు పాలించిన దేశాలని అర్థం. వలస పాలన ముగిశాక ఆ దేశాలన్నీ ఒక గ్రూపులా ఏర్పడ్డాయి. సంబంధాలను కొనసాగించటానికి రెండేళ్లకోసారి కూర్చొని మాట్లాడుకుంటాయి. నాలుగేళ్లకోసారి కలిసి ఆట్లాడుకుంటాయి. అవే కామన్వెల్త్​ గేమ్స్.​ అయితే మన దేశం ఇక ఆ ఆటలకు గుడ్​ బై చెప్పాలని ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్ నరీందర్​ బాత్రా ఈమధ్య అన్నారు. ఆయన ఇలా ఫైర్​ కావటానికి కారణమేంటి?. ఈ గొడవ ఇప్పుడే తెరపైకి వచ్చిందా? లేక, గతంలోనూ ఉందా?.

కామన్వెల్త్​ దేశాల కూటమి పట్ల మనోళ్లు అసంతృప్తి వ్యక్తం చేయటం ఇదే తొలిసారి కాదు. గతంలో అమితవ ఘోష్​ అనే రైటర్ ఆ గ్రూపు తీరును వేలెత్తి చూపారు. రీసెంట్​గా ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్ నరీందర్​ బాత్రా ఒక్కసారిగా బరస్ట్​ కావటం చర్చకు దారి తీసింది. కామన్వెల్త్​ గేమ్స్​ నుంచి మన దేశం పూర్తిగా బయటికి వచ్చేయాలని​ ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పటం సంచలనం సృష్టించింది.

గుర్తింపు లేకేనా!

బాత్రా కోపం వెనక బలమైన కారణమే ఉంటుందని అనలిస్టులు అంటున్నారు.​ కామన్వెల్త్​ అసోసియేషన్​లో​ ఇండియాకి గుర్తింపు లేకపోవటం వల్లే ఆయన మండిపడ్డారని చెబుతున్నారు. ‘పాపులేషన్​ పరంగా​ మన దేశమే పెద్ద మెంబర్. దానికి తగ్గట్లు వాళ్లు గౌరవం ఇవ్వట్లేదు. గేమ్స్ నిర్వహణకు​ 13 కమిటీలు ఉన్నా ఒక్కదాంట్లోకీ మనోళ్లను తీసుకోలేదు. ఎగ్జిక్యూటివ్​ బోర్డ్​లోనూ ఇండియన్స్​ లేరు. అలాంటప్పుడు ఆ సిస్టమ్​లో ఉండటం అవసరమా?’ అని బాత్రా అడగటంలో న్యాయం ఉందని సమర్థిస్తున్నారు. బర్మింగ్​హామ్​లో జరిగే​ గేమ్స్​ నుంచి షూటింగ్​​ని తప్పించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడూ ఆయన ఇలాగే బోల్డ్​గా మాట్లాడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

ఆటగాళ్ల అభ్యంతరం!

బాత్రా కామెంట్స్​ను పలువురు అథ్లెట్లు తప్పుపట్టారు. స్థాయి విషయంలో ఈ​ ఈవెంట్స్​ చెప్పుకోదగ్గవి కావని ఆయన అనటం కొందరు చాంపియన్లను నొప్పించింది. దీంతో వాళ్లు బాత్రా వ్యాఖ్యలను ఖండించారు. ‘కామన్వెల్త్​ గేమ్స్​లో ఇండియా 70 నుంచి 100 మెడల్స్​ సాధిస్తోంది. ఒలింపిక్స్​లో ఒకటీ రెండు వద్దే ఆగిపోతోంది. దీన్నిబట్టి ఏ ఆటల లెవలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు’ అని బాత్రా అనటంపై సత్యన్‌, విజేందర్‌, కశ్యప్‌, కృష్ణ పూనియా, సతీశ్‌ శివలింగం వంటివారు అభ్యంతరం తెలిపారు.

చారిత్రక తప్పిదమా!!

1929లో లాహోర్​లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో ‘మన దేశం​ సంపూర్ణ స్వరాజ్యం (కంప్లీట్​ ఫ్రీడం) సాధించాలి’ అనే తీర్మానాన్ని ఆమోదించారు. ఇంగ్లిషోళ్ల పాలన నుంచి ఇండియా ఇండిపెండెన్స్​ పొందాక కామన్వెల్త్​ కూటమిలో చేరకూడదని నిర్ణయం తీసుకున్నారు. 1930లో జరిగిన తొలి  రౌండ్​ టేబుల్​ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం ప్రాతిపదికన చర్చలు జరపటానికి బ్రిటిష్​ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో ఆ మీటింగ్​కి​ కాంగ్రెస్​ వెళ్లలేదు. కానీ తర్వాత ఆ తీర్మానంపై రాజీపడక తప్పలేదు. 1947లో తెల్లోళ్ల నుంచి స్వాతంత్ర్యం పొందిన మన దేశం రెండేళ్ల తర్వాత కామన్వెల్త్​ దేశాల గ్రూపు నాయకత్వ బాధ్యతను బ్రిటన్​కి కట్టబెట్టే ఒప్పందానికి ఒప్పుకుంది.

అమితవ ఘోష్ ఎపిసోడ్

జ్ఞాన్​పీఠ్​ అవార్డు వచ్చిన తొలి ఇంగ్లిష్​   ​ రైటర్  అమితవ ఘోష్​ 2001లో కామన్వెల్త్​ అలయెన్స్​పై అసంతృప్తిని ఓపెన్​గానే వెళ్లగక్కారు. తాను రాసిన ‘ది గ్లాస్​ ప్యాలెస్​’ నవలను కామన్వెల్త్​ రైటర్స్​ ప్రైజ్​ సెలక్షన్స్​కి పంపటానికి ఆయన ఒప్పుకోలేదు. ‘కామన్వెల్త్​’ అనేదే ఒక ‘ప్రాబ్లమేటిక్​ వర్డ్​’ అని అమితవ ఘోష్​ అప్పట్లోనే మొహమాటం లేకుండా చెప్పేశారు. కామన్వెల్త్​ గ్రూపుని ఆయన బ్రిటిష్​ వలస పాలనకు వారసత్వంగా వర్ణించారు.