అమిత్​షాపై కెనడా ఆరోపణలు.. భారత్​ సీరియస్​

అమిత్​షాపై కెనడా ఆరోపణలు.. భారత్​ సీరియస్​
  • అమిత్​ షాపై కామెంట్లకు భారత్​ ఖండన​
  • ఆ దేశ  హైకమిషన్​ ప్రతినిధికి సమన్లు జారీ
  • సైబర్​ ముప్పు ఉందన్న ఆరోపణలపైనా కేంద్రం సీరియస్

ఒట్టావా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షాపై కెనడా చేసిన ఆరోపణలను భారత్​ తిప్పికొట్టింది. అవి అసంబద్ధ, నిరాధార ఆరోపణలని తేల్చి చెప్పింది. దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నా లెక్కచేయకుండా కెనడా చేస్తున్న నిరాధార ఆరోపణలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కెనడా డిప్యూటీ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ఖలిస్థానీ సానుభూతిపరులపై దాడులకు అమిత్​ షా కారణమని, ఆయన అనుమతితోనే భారత ఏజెంట్లు దాడులు చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలను తాజాగా భారత్​ తీవ్రంగా ఖండించింది.  ఈ మేరకు కెనడా హై కమిషన్​ ప్రతినిధిని పిలిపించి ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆరోపణలను నిరసిస్తూ ఒక నోట్​ను ఆ అధికారికి అందజేసింది. కాగా, ఈ విషయంపై అమెరికా స్పందిస్తూ.. మోరిసన్ వ్యాఖ్యలు ఆందోళనకరమని పేర్కొన్నది. ఈ ఆరోపణలపై కెనడా ప్రభుత్వంతో చర్చిస్తున్నామని స్టేట్​ డిపార్ట్​మెంట్​ అధికార
 ప్రతినిధి మాథ్యూ మిల్లర్​ వెల్లడించారు.

దౌత్య సంబంధాలపై ప్రభావం: రణధీర్​ జైశ్వాల్​

డేవిడ్ మోరిసన్ చేసిన ఆరోపణలను భారత్​ తీవ్రంగా ఖండించిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్‌‌‌‌ వెల్లడించారు. ఈ  వ్యవహారంలో కెనడా హై కమిషన్​ ప్రతినిధినికి సమన్లు జారీ చేసినట్టు చెప్పారు.  ‘‘గత నెల 29న అట్టావాలో జరిగిన పబ్లిక్ సేఫ్టీ అండ్​ నేషనల్​ సెక్యూరిటీ స్టాండింగ్​ కమిటీ ఎదుట కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై కెనడా డిప్యూటీ మంత్రి డేవిడ్​ మోరిసన్​ అసంబద్ధ, నిరాధార ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను మేం తిప్పికొట్టాం. ఇలాంటి వ్యాఖ్యలు దౌత్యపరమైన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి”  అని పేర్కొన్నారు. 

భారత్​పై కావాలనే దుష్ప్రచారం: ఎంఈఏ

భారత్​నుంచి సైబర్​ ముప్పు ఉందంటూ కెనడా తన అధికారిక పత్రంలో నిరాధార ఆరోపణలు చేసిందని భారత​ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. భారత్​కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల అభిప్రాయాలను మార్చేందుకు కెనడా యత్నిస్తున్నట్టు ఆ దేశ అధికారులే బహిరంగంగా ఒప్పుకున్నారని తెలిపింది. అంతర్జాతీయంగా భారత్​పై దాడి చేసి, దుష్ప్రచారం చేయడం కెనడా మరో వ్యూహమని పేర్కొన్నది. ఇదిలా ఉండగా.. కెనడాలోని కొందరు భారత్​ కాన్సులర్​ అఫీషియల్స్​ఆడియో, వీడియో నిఘాలో ఉన్నట్టు ఆ దేశ సర్కారు సమాచారం ఇచ్చిందని, వారి కమ్యూనికేషన్​ను కూడా అడ్డగించారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్‌‌‌‌ అన్నారు. ఈ చర్యలు దౌత్య, కాన్సులర్​ ఒప్పందాలను ఉల్లంఘించినట్టు తాము భావిస్తున్నామని, దీనిపై కెనడాకు నిరసన కూడా తెలియజేసినట్టు చెప్పారు. కెనడా ప్రభుత్వం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నదని మండిపడ్డారు.