మిత్రపక్షాలను బలపరుస్తున్న బీజేపీ : డా. పెంటపాటి పుల్లారావు

దేశ రాజకీయాల్లో ఒక కొత్త రేస్​ నడుస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్న ఇండియా లాంటి దేశాల్లో పార్లమెంట్​ ఎన్నికల్లో నెగ్గాలంటే  ప్రతి ఓటూ కీలకమే. చిన్న పార్టీలే కదా? అని తీసిపారేయడానికి లేదు.  చిన్న పార్టీలు ఆపత్కాలంలో గొప్ప బలాన్ని చేకూరుస్తాయని రాజకీయ పార్టీలు గుర్తించాయి. అందుకే జాతీయ రాజకీయ పార్టీలు మిత్రపక్షాలను, ప్రాంతీయ పార్టీలను కోరుకుంటున్నాయి. 2019 భారీ విజయం తర్వాత మిత్రపక్షాల ప్రాధాన్యతను బీజేపీ అంతగా పట్టించుకోలేదు. కానీ 2022 నుంచి, నిర్దిష్ట కులాలు, సామాజిక సమూహాలు ఉన్న సుదూర ప్రాంతాల్లో ఓట్లను గెలుచుకోవడానికి మిత్రపక్షాలు అవసరమని ఆ పార్టీ గుర్తించింది. తమిళనాడులో డీఎంకే, కేరళలో సీపీఎం, బీహార్‌‌లో నితీష్‌‌ కుమార్‌‌ తదితర10 నుంచి 15 పార్టీల విస్తారమైన సంకీర్ణ పార్టీలు ఎన్నికల్లో ఎలా గెలుస్తారో బీజేపీ చూసింది.

2024 ఎన్నికలకు అడుగులు

2019లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ 2024లో తప్పక గెలవాలని, లేదంటే అస్తిత్వ సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించింది. అందుకే పంజాబ్, ఢిల్లీ నుంచి కేజ్రీవాల్, బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, తెలంగాణ నుంచి కేసీఆర్​కాంగ్రెస్‌‌ను తరిమికొట్టినా.. వారితో స్నేహం చేయాలని కాంగ్రెస్ తన అహాన్ని పక్కకు పెట్టి నిర్ణయం తీసుకున్నది. కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌‌ పార్టీలకు చెందిన ఎంపీలు గత మూడు నెలల నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో చాలా వినయంగా నడుచుకున్నారు. రాహుల్​పై అనర్హత వేటు తర్వాత దాదాపు19 పార్టీలు ఒక్కటై గళమెత్తాయి. ఆ పరిస్థితిని చూసిన బీజేపీ.. దీనికి తక్షణ పరిష్కారం అవసరమని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించింది.

ఎందుకంటే బీజేపీకి అలాంటి అనుభవాలు గతంలో ఉన్నాయి. మిత్రపక్షాలు పూర్తిస్థాయిలో కలిసిరాకపోవడంతో వాజ్​పేయి నేతృత్వంలోని బీజేపీ 2004లో దెబ్బతిన్నది. నిజానికి అవకాశం ఉన్నా 2004లో వాజ్​పేయి అస్సాం ఏజీపీ, షిబు సోరెన్​జేఎంఎం, తమిళనాడు డీఎంకే, ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న పార్టీలు, హర్యానాలోని చౌతాలా పార్టీని మిత్రపక్షంగా చేర్చుకోలేదు. శక్తిమంతమైన మాజీ హోం మంత్రి బూటా సింగ్‌‌ను కూడా వద్దనుకుంది. మహారాష్ట్రలోని శివసేనను, అకాలీదళ్ తో కలిసి వెళ్లింది. అదే సమయంలో సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తన బద్ధ శత్రువు అయినప్పటికీ.. శరద్ పవార్, డీఎంకే, శిబు సోరెన్, రామ్ విలాస్ పాశ్వాన్‌‌లతో పొత్తు పెట్టుకుంది. ఫలితంగా 2004లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు భారీ విజయం సాధించాయి. అయితే ఏం చేసినా నడుస్తుందనే కాంగ్రెస్​ ధోరణిని ఆ పార్టీని 2014లో ఘోరంగా ఓడేలా చేసింది. 

మిత్రపక్షాలను బలపరుస్తూ..

మిత్రపక్షాల అవసరాన్ని గుర్తించిన బీజేపీ, వాటిని బలపరిచే దిశగా అడుగులు వేస్తున్నది. ఉత్తరప్రదేశ్‌‌లో చిన్న పార్టీలైన అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తును బలపరిచింది. కొత్త మిత్రపక్షం సుహెల్‌‌దేవ్ బీఎస్పీని పొందబోతోంది. నితీష్ కుమార్ బీజేపీ కూటమిని వదిలి లాలూ ప్రసాద్ యాదవ్‌‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆయన మిత్రులు జితన్​రామ్​మాంఝీ, వికాస్​షీల్​పార్టీ, కుష్వాహా పార్టీ, చిరాగ్​పాశ్వాన్​ల వంటి వారిని బీజేపీ తనవైపు తిప్పుకున్నది. తమిళనాడులోనూ బలమైన పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. కర్నాటకలో 2024 ఎన్నికల్లో దేవెగౌడతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో వైఎస్‌‌ జగన్‌‌ పార్టీతోనూ, టీడీపీతోనూ బీజేపీ స్నేహపూర్వకంగానే ఉన్నది. పంజాబ్‌‌లో అకాలీదళ్‌‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. హర్యానాలో ఆ పార్టీకి మిత్రపక్షాల కొరత లేదు. ఇప్పటికే షిండేకు చెందిన శివసేన, అజిత్ పవార్‌‌కు చెందిన ఎన్‌‌సీపీ ఉన్న మహారాష్ట్రలో బలపడేందుకు బీజేపీ తీవ్ర 
ప్రయత్నాలు చేస్తోంది. 

కాంగ్రెస్​ అతి సందడే బీజేపీని మేల్కొల్పిందా

2024లో నరేంద్ర మోదీ మరోసారి విజయం సాధిస్తారని బీజేపీ నమ్మకంగా ఉంది. కానీ రాహుల్ గాంధీ జోడో యాత్ర, కర్నాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత హఠాత్తుగా పరిణామాలు మారిపోయాయి.  కాంగ్రెస్ ప్రగల్భాలు పలకడం ప్రారంభించింది. రాహుల్ గాంధీని "భారతదేశానికి తదుపరి ప్రధాని" అని పిలవడం మొదలైంది. 2024 ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే ఓడిపోయిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి పిలవడం మాత్రమే మిగిలి ఉందని దాదాపుగా ప్రకటించినట్లుగానే పాట్నాలో కాంగ్రెస్ చాలా ప్రచారమైన ప్రతిపక్ష ఐక్య సమావేశాన్ని నిర్వహించింది. మిత్రపక్షాల కోసం తీవ్రమైన వేట ప్రారంభించిన బీజేపీని ఈ సైకోఫాంటిక్ డ్రామా నిద్రలేపింది. ప్రతిపక్ష స్తంభంగా భావించిన శరద్ పవార్ పతనం కావడం బీజేపీకి అలాంటి మొదటి విజయం. “మీ శత్రువులు తప్పులు చేస్తున్నప్పుడు అంతరాయం కలిగించవద్దు” అని ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ చెప్పిన మాటలను కాంగ్రెస్ మరిచిపోయింది. కాంగ్రెస్‌‌ స్వయం అభినందనల సందడి బీజేపీని నిద్రలేపింది. ఆశ్చర్యకరమైన విజయాల కోసం వ్యూహాత్మక మౌనం అవసరం.

 డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్