బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు
బషీర్ బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా జరగనున్న జనగణనలోనే కులగణన చేపట్టాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్చిరంజీవులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో త్వరలో ఢిల్లీలో జరిగే బీసీల సమర శంఖారావం వాల్ పోస్టర్ ను పలు బీసీ సంఘాల నేతలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ.. 11న ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ లో ఓబీసీల జాతీయ సదస్సు, 12న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పలు రాజకీయ పార్టీ నేతలు హాజరుకానున్నట్లు తెలిపారు. కులగణన చేపట్టాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉందని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని డిమాండ్చేస్తున్నారని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
సమావేశంలో సోషల్ జస్టిస్ పార్టీ నేతలు చామకూర రాజు, కె.వి.గౌడ్, శ్రీకాంత్, హిందూ బీసీ మహాసభ బత్తుల సిద్దేశ్వర్, రాష్ట్ర సంచారజాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ వంశరాజ్, బీసీ సమాజ్ నేత సంగెం సూర్యారావు, ఓబీసీ జేఏసీ చైర్మన్ అవ్వారు వేణు, తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, బలహీన వర్గాల సంఘం అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్, అంబేద్కర్ ఆజాద్ సంఘం అధ్యక్షుడు నరహరి కొంగర తదితరులు పాల్గొన్నారు.