వచ్చే మార్చి నాటికి నక్సలిజం అంతం: చత్తీస్​గఢ్​లో కేంద్రమంత్రి అమిత్​ షా

వచ్చే మార్చి నాటికి నక్సలిజం అంతం: చత్తీస్​గఢ్​లో కేంద్రమంత్రి అమిత్​ షా

దంతెవాడ: మావోయిస్టులు ఆయుధాలను విడిచి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమవుతుందని వ్యాఖ్యానించారు. చత్తీస్​గఢ్ ప్రభుత్వం శనివారం బస్తర్​లో నిర్వహించిన ‘బస్తర్​ పండుమ్​’ ఉత్సవాల్లో అమిత్​ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్తర్ ఏరియాలో ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకోవాలని మావోయిస్టులు చూస్తున్నారని, అది వాళ్లకు సాధ్యం కాదని అన్నారు. 

‘‘బస్తర్‌‌ అడవుల్లో తూటాలు, బాంబు పేలుళ్ల టైమ్​ ముగిసింది. 50 ఏండ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మోదీ సర్కార్​ కృత నిశ్చయంతో ఉంది. నక్సలైట్లు ఆయుధాలను వదిలి లొంగిపోవాలి. అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణగా ఉంటాయి” అని తెలిపారు.  

నక్సలైట్లు లేని బస్తర్​ను స్థానికులు కోరుకున్నప్పుడే డెవలప్​మెంట్​ సాధ్యమని, ఐదేండ్లలో ఈ ఏరియాను అభివృద్ధి చేయాలని తమ డబుల్​ ఇంజన్​ సర్కార్​ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నక్సల్​ విముక్త గ్రామాలకు రూ. కోటి చొప్పున నిధులు అందిస్తామన్నారు. గ్రామాల్లో మీటింగ్​లు పెట్టుకొని, నక్సలైట్లు లొంగిపోయేలా తీర్మానాలు చేయాలని బస్తర్​ వాసులకు అమిత్​ షా సూచించారు.