నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీతో సూపర్​ పవర్గా మారుతాం

విశ్లేషణ : ప్రస్తుత విద్యావ్యవస్థ దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చే విధంగాలేదని భావించిన కేంద్ర ప్రభుత్వం, ఒక నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించాలని సంకల్పించింది.  దీనికిగాను నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ (ఎన్​ఈపీ)ని దేశ విద్యా విధానంలో ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. రాష్ట్రాలు సంపూర్ణంగా సహకరించి ఈ విధానం కనుక అమలైతే జ్ఞానరంగంలో భారత్​ గ్లోబల్​ సూపర్​ పవర్​గా రూపాంతరం చెందే అవకాశం ఎంతో ఉంది. ప్రపంచ దేశాల్లో ఇండియా అగ్రగామిగా నిలిచి మళ్లీ భారత్​ ‘విశ్వగురు’ అనిపించుకుంటుంది.

కేంద్ర మానవ వనరుల శాఖ జనవరి 2015 నుండే వివిధ స్టేక్ హోల్డర్స్, ప్రజలు, సంస్థలు, ప్రముఖ వ్యక్తులు, పలువురు విద్యావేత్తల నుండి అభిప్రాయాలు సేకరించి టీ‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్ సుబ్రమణ్యన్ నేతృత్వంలోని కమిటీ మే 2016 లో ఒక రిపోర్ట్ తయారుచేసి ఎం‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీకి అందించింది. ఎం‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తుదిడ్రాఫ్ట్​ను డా.  కస్తూరి రంగన్​ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీకి  అప్పగించింది. ఎన్ఈపీ  డిసెంబర్ 2018 లో డ్రాఫ్ట్ ను ఎం‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీ సమర్పించగా కేంద్ర క్యాబినెట్ జులై 29, 2020 నాడు ఆమోదించింది. 21 వ శతాబ్దపు ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా, నాలుగవ పారిశ్రామిక విప్లవ డిమాండ్లకు తగ్గట్టుగా జ్ఞాన రంగంలో భారత దేశాన్ని గ్లోబల్ సూపర్ పవర్‌‌‌‌‌‌‌‌గా రూపాంతరం చెందించడమే ఈ పాలసీ విజన్. మాస్, ఈక్విటీ, క్వాలిటీ, అఫర్డబిలిటీ, అకౌంటబిలిటీలు ఈ పాలసీ ఫౌండేషనల్ పిల్లర్స్.

భవిష్యత్తులో  ప్రపంచగతిని మార్చే రంగాలేవి? 
ఎన్ఈపీ-2020 ప్రస్తుత విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని సూచించింది. దానిప్రకారం, పాఠశాల విద్యలో అంగన్వాడీ సెంటర్లను చేర్చడంతో పాటుగా దేశవ్యాప్తంగా 5+3+3+4 విధానాన్ని ఫాలో కావాలని సిఫార్సుచేసింది. రాబోయే కాలంలో బిగ్ డాటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వంటి రంగాలు ప్రపంచాన్ని మార్చగలవని, అందుకనుగుణంగా ఆయా రంగాల్లో స్కిల్డ్ లేబర్‌‌‌‌‌‌‌‌ను తయారుచేసే ఉద్దేశ్యంతో  ఉన్నతవిద్యలో కూడా భారీ సంస్కరణలు చేయాలని నివేదించింది. అంతేకాకుండా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల వాతావరణం, ఫుడ్, ఎనర్జీ, వాటర్, సానిటేషన్ వంటి రంగాల్లో కూడా నిపుణులకు మంచి డిమాండ్ రాబోతుందని అంచనావేస్తూ, ఈ గొప్ప అవకాశాన్ని మన దేశం అందిపుచ్చుకోవాలని అభిప్రాయపడింది.

ఎన్ఈపీ-2020 ముఖ్య సిఫార్సులు
ఉన్నతవిద్యా సంస్థలు డిగ్రీ, పి‌‌‌‌జి కోర్సులు అందిస్తూ నాణ్యమైన బోధన అందిస్తూ, పరిశోధన చేస్తూ, సమాజ అభివృద్ధికి (కమ్యూనిటీ ఎంగేజ్ మెంట్) పాటుపడాలి. అందువల్ల ఉన్నతవిద్యా సంస్థలను టీచింగ్ యూనివర్సిటీ (టియూ), రీసెర్చ్-ఇంటెన్సివ్ యూనివర్సిటీ (ఆర్​యూ), అటానమస్ డిగ్రీ -గ్రాంటింగ్ కాలేజీ (ఏసీ)లుగా మార్చాలని రికమెండ్ చేసింది,  అయితే ఆయా యూనివర్సిటీలు వాటికి ఉన్న శక్తిసామర్థ్యాలు, అభిరుచి, వనరులను బట్టి టీయూ, యూఆర్ లల్లో దేన్ని ఎంచుకోవాలో వారి నిర్ణయానికే వదిలేసింది. దేశంలో ఉన్న అన్ని కాలేజీలు క్రమక్రమంగా 2035 వరకు ఏసీలుగా మారాలని, ఆ తర్వాత అనుబంధ (అఫిలియేటెడ్) కాలేజీ విధానాన్ని ఎత్తివేయాలని  దిశానిర్దేశం చేసింది.  ఉన్నత విద్యలో సేవాదృక్పథం ఉండే ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ప్రైవేట్ యూనివర్సిటీ/కాలేజీలు పారదర్శకంగా ఉండేలా, విద్యావ్యాపారీకరణను అడ్డుకునేందుకు ‘లైట్ బట్ టైట్’ విధానాలను అనుసరించాలని రికమెండ్ చేసింది. టాప్ 100 ర్యాంకుల్లోనిలిచే ఫారిన్ యూనివర్సిటీలు, మన దేశంలో వారి క్యాంపస్ లను స్థాపించి, విద్యా కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అలాగే మన దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు, విదేశాల్లో వారి క్యాంపస్ లను నెలకొల్పుకోవచ్చు. దీనికై ప్రత్యేక చట్టం రూపొందించాల్సి ఉంటుంది.  

ఎన్ఈపీ-2020 అమలులో సవాళ్లెన్నో
ఉన్నత విద్యను గాడినపెట్టేందుకు ఎన్ఈపీ-2020 బృహత్తర ప్రణాళిక భాగంగా మొదటగా ఎం‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీని ‘మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్’ గా మార్చారు.  కానీ పాలసీ అమలౌతున్నప్పుడు వచ్చే సమస్యలు ఎన్నో. 3000 విద్యార్థులను సమకూర్చుకోవడం అనేది గ్రామీణ/వెనకబడ్డ ప్రాంతాల్లోని కాలేజీలకు అసాధ్యం. మల్టీ డిసిప్లినరి  విధానంతో పాటు కొన్ని ఉద్యోగాలకు, చేసే కోర్సులకు మధ్య లంకె ఉండాలి. అంటే అన్ని ఉద్యోగాలకు కనీస అర్హతగా ‘కామన్ డిగ్రీ’ ని పెట్టకూడదు.  అప్పుడే సైన్స్, ఆర్ట్స్/సోషల్ సైన్స్ మధ్య అంతరం తగ్గుతుంది. డిగ్రీ చేసిన వారిలో చాలామందికి సరైన జ్ఞానంగానీ, నైపుణ్యంగానీ లేకపోవడంతో నిరుద్యోగులుగా మారుతున్నారు. డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా లాంటి తక్కువ కాల వ్యవధులున్న కొత్త డిగ్రీలు పూర్తి చేసినవారికి ఉద్యోగాలు దొరకడం/రావడం కష్టమవుతోంది. విద్యార్థులకు మల్టిపుల్ ఎంట్రీ/ఎగ్జిట్ అవకాశం కల్పిస్తే,  వారు చిన్న చిన్న విషయాలకే కాలేజీ/యూనివర్సిటీ మారడం లేదా ఒక నిర్ణీత కోర్సు తర్వాత చదువు మానేయవచ్చు. విదేశీ యూనివర్సిటీల స్థాపనవల్ల మన విద్యార్థులు వేరే దేశాలకు వలస వెళ్ళడం తగ్గొచ్చు. కానీ స్వదేశీ యూనివర్సిటీ/కాలేజీలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఎన్ని సవాళ్లున్నప్పటికీ, ఎన్ఈపీ-2020 అమలుచేయడం అనివార్యం. అందుకే సెంట్రల్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు దీన్ని అమలుచేయడంలో ముందు వరుసలో ఉన్నాయి. సమస్యలను అధిగమిస్తూ ముందుకెళితేనే మనం ఈ పాలసీ ప్రతిఫలాలను పొంది ఇండియాను ‘విశ్వ గురువు’ గా చూడగలుగుతాం.  
- డా. శ్రీరాములు గోసికొండ, అసిస్టెంట్ ప్రొఫెసర్.