
- ఇండియా తరఫున ఇచ్చే గిఫ్ట్ ఇదేనని వ్యాఖ్య
- ఈ ప్రాంత శ్రేయస్సు, స్థిరత్వం కోసం సాగర్ విజన్ తీసుకొచ్చాం
- మారిషస్ నేషనల్ డే వేడుకల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ
- వాణిజ్యం, సముద్ర భద్రతతో సహా 8 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: భారత్‌కు మారిషస్ కీలక భాగస్వామి అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య బంధాన్ని ‘మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య’ హోదాకు తీసుకెళ్లాలని ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గూలం, తాను నిర్ణయించామని చెప్పారు. మారిషస్‌లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి తాము సహకరిస్తామని, ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ నుంచి మారిషస్‌కు ఇస్తున్న గిఫ్ట్ అని తెలిపారు. ఈమేరకు మారిషస్ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రధాని మోదీ.. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఆ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నేషనల్ డే వేడుకల్లో మరోసారి మీ ముందుండడం తన అదృష్టమని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంతో పాటు సంస్కృతీ, సంప్రదాయాలు ఇరుదేశాలను కలిపి ఉంచుతున్నాయని చెప్పారు. ఈ వేడుకల్లో భారత నేవీకి చెందిన యుద్ధనౌక, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆకాశ్ గంగా స్కైడైవింగ్ బృందంతో పాటు
భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా పాల్గొన్నాయి.
గ్లోబల్ సౌత్ దేశాల కోసం మహాసాగర్
పదేండ్ల క్రితం ‘సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్’(సాగర్)కు మారిషస్ నుంచే పునాది వేశామని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రాంత శ్రేయస్సు, స్థిరత్వం కోసం దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పుడు గ్లోబల్ సౌత్ దేశాల కోసం మ్యూచువల్అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్విజన్(మహాసాగర్) ను ప్రకటిస్తున్నామని, వాణిజ్యం, పరస్పర భద్రత అంశాలపై దానికింద పనిచేస్తామని వెల్లడించారు.
ఈ ప్రాంతంలో చైనా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో మహాసాగర్ ను తీసుకొచ్చామని తెలిపారు. స్వేచ్ఛాయుత, సురక్షిత హిందూ మహాసముద్రం ఇరు దేశాల ఉమ్మడి ప్రాధాన్యత అని, ఇందుకోసం రక్షణ సహకారం, సముద్ర భద్రతపై తాను, రామ్‌గూలం ఓ అంగీకారానికి వచ్చినట్టు చెప్పారు. కాగా, వాణిజ్యం, సముద్ర భద్రతతో సహా అనేక రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి 8 ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
ఒప్పందాల్లో ముఖ్యంగా క్రాస్ బార్డర్ లావాదేవీలకు జాతీయ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం, సముద్ర డేటాను పంచుకోవడం, మనీలాండరింగ్‌ను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పనిచేయడం, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడం లాంటివి ఉన్నాయి.
మారిషస్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ
మారిషస్ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషియన్’ ను ప్రధాని మోదీ బుధవారం అందుకున్నారు. ఈ పురస్కారం రెండు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, చారిత్రక బంధాలకు గుర్తు అని తెలిపారు. ఈ విశిష్ట పురస్కారాన్ని తాను వినమ్రంగా స్వీకరిస్తున్నానని మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ఇది 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోదీ రెండు రోజుల మారిషస్ పర్యటన ముగిసింది. బుధవారం ఆయన న్యూఢిల్లీకి బయలు దేరారు. ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గూలం వీడ్కోలు పలికారు. ఈమేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టింది.