Asia Cup 2025: భారత్ వేదికగా 2025 ఆసియా కప్.. ఏ ఫార్మాట్‌లో అంటే..?

Asia Cup 2025: భారత్ వేదికగా 2025 ఆసియా కప్.. ఏ ఫార్మాట్‌లో అంటే..?

2025 ఆసియా కప్ వేదిక ఖరారైంది. భారత్ వేదికగా ఈ టోర్నీ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది. టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరగబోతుంది. 2026 లో భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ కారణంగానే టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక 2027 ఆసియా కప్ బంగ్లాదేశ్ లో జరుగుతుందని.. అప్పుడు ఈ టోర్నీ వన్డే ఫార్మాట్ లో జరుగనుందని స్పష్టం చేసింది. 2027 దక్షిణాఫ్రికా వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. 

2025 ఆసియా కప్ లో మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తో పాటు మరో జట్టు క్వాలిఫైయింగ్ ఈవెంట్ ద్వారా ఎంపిక చేయబడింది. షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ ఈ టోర్నీ సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  2025 ఫిబ్రవరి లో ఛాంపియన్స్ ట్రోఫీ.. ఏప్రిల్, మే నెలలో ఐపీఎల్ జరగుతుంది. ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్ తో వన్డే, టీ20 సిరీస్.. జూన్ నుంచి ఆగస్టు వరకు ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంది.

అక్టోబర్ లో వెస్టిండీస్ తో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ మధ్యలో సెప్టెంబర్ నెల ఒక్కటే మిగిలి ఉండడంతో ఈ నెలలో నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వేదికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. 2023 లో ఆసియా కప్ ను పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా నిర్వహించారు. వన్డే ఫార్మాట్ లో సాగిన ఈ టోర్నీలో శ్రీలంకను ఫైనల్లో ఓడించి  భారత్ విజేతగా నిలిచింది.