న్యూఢిల్లీ: భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని.. త్వరలోనే ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఆవతరించబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ నిర్వహించారు. లోక్ సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చకు శనివారం (డిసెంబర్ 14) ప్రధాని మోడీ సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్య పండగను ఘనంగా జరుపుకుంటున్నాం.. ఇవి దేశం మొత్తం గర్వపడే క్షణాలని అన్నారు. 75 ఏళ్ల ప్రజాస్వామాన్ని వేడుకగా చేసుకునే ఆనంద క్షణాలివన్నారు. రాజ్యాంగ నిర్మాతలతో పాటు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య భావనను 75 ఏళ్లుగా నిలబెట్టుకుంటున్నామని.. దేశ ప్రజలకే మొదట ఆ ఘనత దక్కుతుందని అన్నారు. భారత రాజ్యాంగ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని.. మదర్ ఆఫ్ డెమొక్రసీగా పేరు గాంచిదన్నారు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని అభవర్ణించారు.
ALSO READ | 50 శాతం రిజర్వేషన్ల గోడ బద్దలు కొడతాం: రాహుల్ గాంధీ
భారత రాజ్యాంగ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషించారని మోడీ కొనియాడారు. రాజ్యాంగ సభలో 15 మంది మహిళలు ఉన్నారని.. రాజ్యాంగంపై చర్చలోనూ వారు చురుగ్గా పాల్గొన్నారన్నారని గుర్తు చేశారు. వివిధ రంగాంలకు చెందిన ఆ మహిళలు రాజ్యాంగ నిర్మాణంలో చాలా ప్రభావశీలంగా పని చేశారని పొగిడారు మోడీ. ఎన్డీఏ ప్రభుత్వం మహిళాభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ ఏడాది భారత్‌లో జరిగిన జీ 20 సదస్సులో మహిళా ఆధారిత అభివృద్ధి అంశాన్ని చర్చగా పెట్టామని మోడీ గుర్తు చేశారు.
మహిళ రిజర్వేషన్లు బిల్లును సభ ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత ప్రత్యేకతని.. మనం ఏకత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటే.. కొందరు వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్య గొంతునొక్కిందని.. భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని అన్నారు. భారత్‌ను ఒక్కటి చేసేందుకే ఆర్టికల్ 370 రద్దు చేశామని చెప్పారు. భారత్ మరింత అభివృద్ధి చెందాలంటే ఐక్యత ఉండాలని.. అందుకే మేం వివక్షను తొలగించి ఒక్కటిగా ముందుకు సాగుతున్నామన్నారు.