- 4-–1తో సిరీస్ సొంతం
- రాణించిన శ్రేయస్ అయ్యర్, బౌలర్లు
- బెన్ మెక్‌డెర్మాట్ హాఫ్ సెంచరీ వృథా
బెంగళూరు : బౌలింగ్‌లో చెలరేగిన టీమిండియా.. లో స్కోరింగ్ మ్యాచ్‌ను అద్భుతంగా కాపాడుకుంది. పేసర్లు ముకేశ్ కుమార్ (3/32), అర్ష్‌దీప్ సింగ్ (2/40), స్పిన్నర్ రవి బిష్ణోయ్ (2/29) రాణించడంతో ఆదివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో ఇండియా 6 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 160/8 స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ (37 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53)
అక్షర్ పటేల్ (21 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31, 1/14) రాణించారు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 154/8 స్కోరుకే పరిమితమైంది. బెన్ మెక్‌డెర్మాట్ (36 బాల్స్‌లో 5 సిక్స్‌లతో 54), ట్రావిస్ హెడ్ (28) రాణించారు. అక్షర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, బిష్ణోయ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
బౌలర్లు మళ్లీ..
ఛేజింగ్‌లో ఆసీస్‌ను ఇండియా బౌలర్లు మరోసారి కట్టడి చేశారు. ఓ ఎండ్‌లో మెక్‌డెర్మాట్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా.. వరుస విరామాల్లో వికెట్లు తీసి రన్స్‌ను అడ్డుకున్నారు. మూడో ఓవర్‌లో ముకేశ్.. జోష్ ఫిలిప్పీ (4)ని ఔట్ చేసి శుభారంభాన్నిచ్చాడు. 5, 7వ ఓవర్‌లో రవి.. వరుసగా ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ (6)ని ఔట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. దీంతో ఆసీస్ 55 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మెక్‌డెర్మాట్‌తో కలిసిన టిమ్ డేవిడ్ (17) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా ఇండియా బౌలర్లు పట్టు విడవలేదు. 14వ ఓవర్‌లో అక్షర్..
డేవిడ్‌ను వెనక్కి పంపి నాలుగో వికెట్‌కు 47 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. 15వ ఓవర్‌లో సిక్స్‌తో హాఫ్ సెంచరీ చేసిన మెక్‌డెర్మాట్‌ను ఆఖరి బాల్‌కు అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. 17వ ఓవర్లో ముకేశ్ వరుస బాల్స్‌లో మాథ్యూ షార్ట్ (16), డ్వారిషస్ (0)ను ఔట్ చేశాడు. ఇక 18 బాల్స్‌లో 32 రన్స్ కావాల్సిన దశలో వేడ్ (22).. 18వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
12 బాల్స్‌లో 17 రన్స్ అవసరం కాగా 19వ ఓవర్లో ముకేశ్ 7 రన్స్ ఇచ్చాడు. ఆఖరి ఓవర్‌లో 10 రన్స్ కావాల్సి ఉండగా అర్ష్‌దీప్ కట్టుదిట్టంగా బాల్స్ వేశాడు. వేడ్ భారీ షాట్‌కు యత్నించి ఔట్ కాగా, చివరి 3 బాల్స్‌కు మూడు రన్సేరావడంతో ఇండియావిజయంతో సిరీస్‌ను ముగించింది.
ఆదుకున్న శ్రేయస్..
శ్రేయర్ అయ్యర్ ఫిఫ్టీతో రాణించడంతో ఇండియా ఆ మాత్రం స్కోరు చేసింది. తొలి రెండు ఓవర్లలో నెమ్మదిగా ఆడిన ఓపెనర్ యశస్వి (21), థర్డ్ ఓవర్‌లో సిక్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. నాలుగో ఓవర్‌లో రుతురాజ్ (10) ఫోర్ కొడితే, యశస్వి 6, 4 బాదాడు. కానీ ఇదే ఓవర్ ఆరో బాల్‌ను భారీ షాట్‌గా మలిచే ప్రయత్నంలో ఎలీస్ (1/42)కు క్యాచ్ ఇచ్చి యశస్వి వెనుదిరిగాడు. ఐదో ఓవర్లో రుతురాజ్ కూడా ఔట్‌కావడంతో పవర్‌ప్లేలో ఇండియా 42/2 స్కోరు చేసింది. ఈ దశలో శ్రేయస్ నిలకడగా ఆడి రెండు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
అయితే రెండో ఎండ్‌లో సూర్య (5), హిట్టర్ రింకూ (6) నిరాశపర్చారు. 7, 10వ ఓవర్లలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో ఇండియా 61/4తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌లో వచ్చిన జితేశ్ శర్మ (24).. శ్రేయస్‌కు అండగా నిలిచాడు. 11వ ఓవర్‌తో ఫోర్‌తో అతను టచ్‌లోకి రాగా, శ్రేయస్ 6, 4 బాదాడు. మరో రెండు ఫోర్లు కొట్టిన జితేశ్‌ను 14వ ఓవర్ హార్డీ (1/21) ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు 42 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
అక్షర్ ఉన్నంతసేపు సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. రన్‌రేట్ పెంచే క్రమంలో 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 19వ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి 36 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్‌తో పాటు బిష్ణోయ్ (2) కూడా వెనుదిరిగాడు.
19 టీ20ల్లో ఆస్ట్రేలియాపై ఇండియా విజయాల సంఖ్య. ఈ ఫార్మాట్‌లో ఒక ప్రత్యర్థిపై ఎక్కువ విజయాలు సాధించిన రెండో జట్టు ఇండియా. న్యూజిలాండ్‌పై 20 సార్లు గెలిచిన పాకిస్తాన్ టాప్ ప్లేస్ ఉంది. శ్రీలంక, వెస్టిండీస్‌పైనా ఇండియా 19 టీ20ల్లో గెలిచింది.
9 ఈ సిరీస్‌లో రవి బిష్ణోయ్ పడగొట్టిన వికెట్లు. ఒక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్‌గా అశ్విన్ (2016లో లంకపై 9 వికెట్లు) సరసన నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా : 20 ఓవర్లలో 160/8 (శ్రేయస్ అయ్యర్ 53, అక్షర్ పటేల్ 31, బెరెన్‌డార్ఫ్ 2/38, డ్వారిషస్ 2/30).
ఆస్ట్రేలియా : 20 ఓవర్లలో 154/8 (బెన్ మెక్‌డెర్మాట్ 54, ట్రావిస్ హెడ్ 28, ముకేశ్ 3/32, బిష్ణోయ్ 2/29).