రాజ్‌గిర్ (బిహార్): విమెన్స్ హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య ఇండియా వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. స్ట్రయికర్ దీపిక రెండు గోల్స్‌తో సత్తా చాటడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 3–2తో సౌత్ కొరియాను ఓడించింది.
సంగీత కుమారి మూడో నిమిషంలోనే గోల్ కొట్టి జట్టుకు మంచి ఆరంభం అందించింది. 20వ నిమిషంలో దీపిక కూడా గోల్ చేయడంతో తొలి అర్ధభాగాన్ని ఇండియా 2–0 ఆధిక్యంతో ముగించింది. కానీ, బ్రేక్ తర్వాత కొరియా బలంగా పుంజుకుంది. నాలుగు నిమిషాల వ్యవధిలో యురి లీ (34 వ ని), కెప్టెన్ ఎయుంబి చెయోన్ (38 వ. మి) చెరో గోల్ చేయడంతో 2–2తో స్కోరు సమం అయింది. మ్యాచ్ డ్రా దిశగా సాగుతుండగా.. 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను దీపిక గోల్‌గా మలచడంతో ఇండియా ఉత్కంఠ విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో చైనా 5–0తో మలేసియాను చిత్తు చేయగా.. థాయ్‌లాండ్, జపాన్ పోరు 1–1తో డ్రాగా ముగిసింది. గురువారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ఇండియా పోటీ పడనుంది.