
- ఫైనల్లో 4 వికెట్లతో న్యూజిలాండ్‌పై గెలుపు..రాణించిన రోహిత్, శ్రేయస్, స్పిన్నర్లు
అరబ్ గడ్డపై టీమిండియా అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఎనిమిది మేటి జట్లు పోటీ పడ్డ ఐసీసీ చాంపియన్స్ టోర్నీలో విజేతగా నిలిచి అసలైన చాంపియన్ అనిపించుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలుత స్పిన్నర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ మాత్రమే చేసింది. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (83 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76) ముందుండి నడిపించడంతో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి మరో ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. జట్టును గెలిపించిన రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఏడాది కిందటే టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీతో తన ఖ్యాతిని పెంచుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌కు మొత్తంగా ఇది ఏడో టైటిల్.
వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు, ఆసియా కప్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించినా.. మూడు ఫార్మాట్లలో మరెన్నో రికార్డులు కొల్లగొట్టినా. ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియాకు చాలామట్టుకు చేదు జ్ఞాపకాలే! అప్పటిదాకా గొప్పగా ఆడుతూ.. అంచనాలు పెంచేసి అసలైన సమయంలో ఉసూరుమనిపించే మన జట్టు 2013 నుంచి 2024 వరకు 11 ఏండ్ల పాటు ఒక్క ఐసీసీ ట్రోఫీ నెగ్గలేక అభిమానులను నిరాశపరిచింది..! కానీ, ఇప్పుడు మన ఆట మారింది. రాత కూడా మారింది. ఏడాది తిరగకుండానే రెండో ఐసీసీ ట్రోఫీ మన సొంతమైంది.
తొమ్మిది నెలల కిందట కరీబియన్ గడ్డపై టీ20 వరల్డ్ కప్ అందుకున్న టీమిండియా ఇప్పుడు అరబ్ గడ్డపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అన్ని విభాగాల్లో అదరగొడుతూ.. అసాధారణ ఆటతో సత్తా చాటుతూ చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచింది. మెగా టోర్నీలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడోసారి ట్రోఫీ నెగ్గి తీన్‌మార్ కొట్టింది. విశ్వవేదికపై మన తిరంగాను మరోసారి రెపరెపలాడించింది.
పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీలో భద్రతా కారణాలతో తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడిన టీమిండియా తొలి పోరు నుంచి ఆఖరాట వరకూ ఎక్కడా ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా అజేయంగా ట్రోఫీని ముద్దాడింది. బలమైన న్యూజిలాండ్ జట్టును లీగ్ దశలోనే ఓసారి పడగొట్టిన రోహిత్‌సేన ఫైనల్లోనూ ఆ జట్టు విసిరిన సవాల్‌ను ఛేదించింది. మొదట నలుగురు స్పిన్నర్లు కివీస్‌ను కట్టడి చేస్తే.. ఛేజింగ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ ముందుండి నడిపించి హీరో అయ్యాడు. పాతికేండ్ల కిందట ఇదే టోర్నీ ఫైనల్లో, 2021 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటములకు ప్రతీకారం తీర్చుకున్న ఇండియా.. ఎనిమిది మేటి జట్లు పోటీపడ్డ టోర్నీలో గెలిచి తాను చాంపియన్లకే చాంపియన్ నిరూపించుకుంది.
మొత్తానికి గతేడాది టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత శ్రీలంకలో వన్డే సిరీస్‌లో, సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయి.. ఆస్ట్రేలియాకు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో వచ్చిన విమర్శలకు టీమిండియా ఈ ట్రోఫీతోనే సమాధానం చెప్పింది. రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ విజయా ల్లో భాగమైన రోహిత్ తన కెరీర్‌లో లోటుగా ఉన్న వన్డే ఫార్మాట్ ఐసీసీ టైటిల్ కూడా అందుకోవడం మరింత స్పెషల్.
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో అజేయ, అద్భుతమైన ఆటను కొనసాగించిన టీమిండియా అనుకున్నది సాధించింది. ఛేజింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (83 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76) జట్టును ముందుండి నడిపించడంతో ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి పుష్కరకాలం తర్వాత మళ్లీ ట్రోఫీని అందుకుంది. తొలుత న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251/7 స్కోరు చేసింది. డారిల్ మిచెల్ (101 బాల్స్‌లో 3 ఫోర్లతో 63), మైకేల్ బ్రేస్‌వెల్ (40 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్) ఫిఫ్టీలతో సత్తా చాటగా.. ఓపెనర్ రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) ఫర్వాలేదనిపించారు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (2/40), వరుణ్ చక్రవర్తి (2/45) చెరో రెండు, జడేజా (1/30), మహ్మద్ షమీ (1/74) ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం ఇండియా 49 ఓవర్లలో 254/6 స్కోరు చేసి గెలిచింది. రోహిత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ ( 34 నాటౌట్) రాణించారు. శాంట్నర్, బ్రేస్‌వెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా... రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు.
38 ఓవర్ల స్పిన్ దాడి.. మిచెల్, బ్రేస్‌వెల్ పోరాటం
న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. మొత్తంగా 38 ఓవర్లు వేసిన నలుగురు స్పిన్నర్లు రన్‌రేట్‌ను నియంత్రించారు. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి వికెట్‌కు 57 రన్స్ జోడించిన ఓపెనర్లు విల్ యంగ్ (15), రచిన్ మంచి ఆరంభమే ఇచ్చారు. ఆరో బాల్‌కే యంగ్ బౌండ్రీల ఖాతా తెరవగా.. హార్దిక్ వేసిన నాలుగో ఓవర్లో 6,4,4 రచిన్ రవీంద్ర జోరందుకున్నాడు. ఆపై షమీ బౌలింగ్‌లోనూ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. దాంతో కెప్టెన్ రోహిత్ ఆరో ఓవర్లోనే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బౌలింగ్‌కు దింపాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన వరుణ్.. తన రెండో ఓవర్లోనే విల్ యంగ్‌ను ఎల్బీ చేసి ఇండియాకు తొలి బ్రేక్ అందించాడు. పవర్ ప్లేలో కివీస్ 69/1తో నిలవగా.. 11వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కుల్దీప్ తన తొలి బాల్‌కే అద్భుతమైన గూగ్లీతో రచిన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తన తర్వాతి ఓవర్లోనే మరో ఇన్‌ఫామ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (11)ను రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసి ప్రత్యర్థికి డబుల్ షాక్ ఇచ్చాడు. రెండు ఎండ్ల నుంచి ఇండియా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో వరుసగా 81 బాల్స్‌లో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. డారిల్ మిచెల్ జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పరుగు రాబట్టినా.. జడేజా బౌలింగ్‌లో లాథమ్ (14) ఎల్బీ అయ్యాడు. కుల్దీప్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన గ్లెన్ ఫిలిప్స్ మరో రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌లో చలనం తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ,38వ ఓవర్లో ఫిలిప్స్‌ను బౌల్డ్ చేసిన వరుణ్ ఈ జోని విడదీయగా.. 40 ఓవర్లకు న్యూజిలాండ్ 172/5 స్కోరు మాత్రమే చేసింది. వరుణ్ వేసిన 42వ ఓవర్లో సింగిల్‌తో డారిల్ 91 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. స్లాగ్ ఓవర్లలోనూ స్పిన్నర్లు పొదుగానే బౌలింగ్ చేశారు. కానీ, బ్రేస్‌వెల్.. పేసర్ షమీని టార్గెట్ చేసి భారీ షాట్లతో వేగం పెంచాడు. 44వ ఓవర్లో సిక్స్ కొట్టాడు. షమీ బౌలింగ్‌లోనే రెండు ఫోర్లతో జోరు పెంచే ప్రయత్నం చేసిన మిచెల్ తర్వాతి బాల్‌కే రోహిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయినా వెనక్కు తగ్గని బ్రేస్‌వెల్ మరో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో స్కోరు 250 మార్కు దాటించాడు.
టాప్‌లో రో‘హిట్’
గత నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క ఫిఫ్టీ కూడా చేయలేకోయిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్లో సూపర్ హిట్‌అయ్యాడు. తను ముందుండి నడిపించడంతో చిన్న టార్గెట్‌ను ఇండియా అందుకుంది. ఆరంభంలో హిట్‌మ్యాన్ తన మార్కు పవర్ ఫుల్ షాట్లతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. జెమీసన్ వేసిన ఇన్నింగ్స్ రెండో బాల్‌నే సిక్స్ కొట్టి తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. మరో పేసర్ ఒరూర్క్‌కు రెండు ఫోర్లతో స్వాగతం పలికిన కెప్టెన్ పవర్ ప్లేను సద్వినియోగం చేసుకొని ధాటిగా ఆడాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ (31) స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. నేథన్ స్మిత్‌కు కూడా భారీ సిక్స్‌తో వెల్‌కం చెప్పిన హిట్‌మ్యాన్.. అతని తర్వాతి ఓవర్లో మరో సిక్స్, రెండు ఫోర్లతో విజృంభించాడు. దాంతో తొమ్మిదో ఓవర్లోనే కెప్టెన్, స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌కు రావాల్సి వచ్చింది. రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లు బౌలింగ్ చేయడంతో రోహిత్ నెమ్మదించాడు. 41 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత రచిన్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్.. శాంట్నర్ ఓవర్లో ఫోర్ కొట్టాడు. అతని జోరుతో 17 ఓవర్లకే స్కోరు వంద దాటింది. మరో ఎండ్‌లో జాగ్రత్తగా ఆడుతున్న గిల్.. శాంట్నర్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు సెంచరీ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. ఇక, ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (1)ని మరో స్పిన్నర్ బ్రేస్‌వెల్ ఎల్బీ చేయగా.. ఏడు ఓవర్ల తర్వాత రచిన్ బౌలింగ్‌లో రోహిత్ స్టంపౌటయ్యాడు.
నాలుగు క్యాచ్‌లు డ్రాప్
బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన ఇండియా ఫీల్డింగ్‌లో మాత్రం నిరాశపరిచింది. ఏకంగా నాలుగు క్యాచ్‌లు జార విడిచింది. ఇందులో రచిన్ రవీంద్రవే రెండు ఉన్నాయి. రచిన్ 28 రన్స్ వద్ద ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను షమీ డ్రాప్ చేయగా.. మరో పరుగు చేసిన తర్వాత ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ అందుకోలేకపోయాడు. డారిల్ మిచెల్ 38 రన్స్ వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ రోహిత్ జారవిడవగా... ఫిలిప్స్ 27 రన్స్ వద్ద ఉన్నప్పుడు గిల్ అతనికి లైఫ్ ఇచ్చాడు. ఈ క్యాచ్‌లు పట్టి ఉంటే కివీస్ మరింత తక్కువ స్కోరుకే పరిమితం అయి ఉండేది.
ఆదుకున్న శ్రేయస్, రాహుల్
వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఇండియా 122/3తో నిలవడంతో కివీస్ రేసులోకి వచ్చేలా కనిపించింది.ఈ దశలో శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్‌లో భారాన్ని మోశాడు. లెఫ్టాండర్ అక్షర్ (29)తో టార్గెట్ కరిగించాడు. జాగ్రత్తగా ఆడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు కొట్టాడు. ఫిలిప్స్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన అయ్యర్ తర్వాతి బాల్‌కే ఇచ్చిన క్యాచ్‌ను జెమీసన్ డ్రాప్ చేశాడు. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయిన అయ్యర్ శాంట్నర్ వేసిన 39వ ఓవర్లో రచిన్‌కు క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్‌కు 61 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అదే ఓవర్లో అక్షర్ సిక్స్ కొట్టగా.. శాంట్నర్ బౌలింగ్‌లోనే రాహుల్ కూడా సిక్స్ బాదడంతో ఇండియాపై ఒత్తిడి తగ్గింది. స్కోరు 200 దాటిన తర్వాత అక్షర్ ఔటైనా.. హార్దిక్ పాండ్యా (18) భారీ సిక్స్, ఫోర్‌తో మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. విజయానికి 11 రన్స్ ముంగిట తను ఔటైనా.. జడేజా (9 నాటౌట్) విన్నింగ్ ఫోర్ కొట్టాడు.
ఈ టోర్నీలో ఆరంభం నుంచి మేం మెరుగ్గా ఆడాం. దానికి తగిన ఫలితం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రారంభం నుంచే మా స్పిన్నర్లపై చాలా అంచనాలు ఉన్నాయి. వాళ్లు ఎప్పుడూ నిరాశపరచలేదు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ టోర్నీలో మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇది మా హోమ్ గ్రౌండ్ కాదు. అయినా అభిమానులు దీన్ని మా హోమ్ గ్రౌండ్‌గా మార్చారు.
– కెప్టెన్ రోహిత్ శర్మ
అసాధారణమైన ఆట, అసాధారణ ఫలితం! ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తీసుకొస్తున్న మన క్రికెట్ జట్టును చూసి గర్వపడుతున్నా. మన ఆటగాళ్లు టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ఆడారు. అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన జట్టుకు అభినందనలు.
– పీఎం నరేంద్ర మోదీ
చాంపియన్స్ ట్రోఫీ విన్నర్ టీమిండియాకు హృదయ పూర్వక అభినందనలు. ఈ టోర్నీలో అద్భుత ఆటతీరుతో ఇండియా తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. జట్టులోని ఆటగాళ్లందరికీ నా అభినందనలు.
–సీఎం రేవంత్ రెడ్డి
స్కోర్‌బోర్డ్
న్యూజిలాండ్: విల్ యంగ్ (ఎల్బీ) వరుణ్ 15, రచిన్ రవీంద్ర (బి) కుల్దీప్ 37, కేన్ విలియమ్సన్ (సిఅండ్ బి) కుల్దీప్ 11, డారిల్ మిచెల్ ( సి) రోహిత్ (బి) షమి 63, టామ్ లాథమ్ (ఎల్బీ) జడేజా 14, గ్లెన్ ఫిలిప్స్ (బి) వరుణ్ 34, బ్రేస్‌వెల్ ( నాటౌట్) 53, శాంట్నర్( రనౌట్) 8, నేథన్ స్మిత్ ( నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 50 ఓవర్లలో 251/7; వికెట్ల పతనం: 1–-57, 2-–-69, 3–-75, 4-–108, 5-–165, 6-–211, 7–-239; బౌలింగ్: మహ్మద్ షమీ 9–0–74-–1, హార్దిక్ పాండ్యా 3-–0-–30–-0, వరుణ్ చక్రవర్తి 10–-0–-45–-2, కుల్దీప్ యాదవ్ 10–-0–-40–-2, అక్షర్ పటేల్ 8–-0–-29–-0, రవీంద్ర జడేజా 10-–0–-30–1.
ఇండియా: రోహిత్ (స్టంప్డ్) లాథమ్ (బి) రచిన్ 76, గిల్ (సి) ఫిలిప్స్ (బి) శాంట్నర్ 31, కోహ్లీ (ఎల్బీ) బ్రేస్‌వెల్ 1, శ్రేయస్ (సి) రచిన్ (బి) శాంట్నర్ 48, అక్షర్ (సి) ఒరూర్క్ (బి) బ్రేస్‌వెల్ 29, రాహుల్ (నాటౌట్) 34, హార్దిక్ పాండ్యా (సి అండ్ బి) జెమీసన్ 18, జడేజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 49 ఓవర్లలో 254/6; వికెట్ల పతనం: 1–105, 2–106, 3–122, 4–183, 5–203, 6–241,
బౌలింగ్: జెమీసన్ 5–0–24–0, ఒరూర్క్ 7–0–56–0, నేథన్ స్మిత్ 2–0–22–0, శాంట్నర్ 10–0–46–2, రచిన్ 10–1–47–1, బ్రేస్‌వెల్ 10–1–28–2, ఫిలిప్స్ 5–0–31–0.