U19 Women's Asia Cup: మెరిసిన తెలంగాణ బిడ్డ.. అండర్ -19 ఆసియా కప్ విజేత టీమిండియా

U19 Women's Asia Cup: మెరిసిన తెలంగాణ బిడ్డ.. అండర్ -19 ఆసియా కప్ విజేత టీమిండియా

అండర్-19 మహిళల ఆసియా కప్ 2024 ప్రారంభ ఎడిషన్‌ను భారత మహిళా జట్టు గెలుచుకుంది. ఆదివారం (డిసెంబర్ 22) బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఫైనల్లో టీమిండియా 41 పరుగులు తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్‌ 76 పరుగులకే కుప్పకూలింది.

గొంగడి త్రిష

అండర్-19 మహిళల ఆసియా కప్ టోర్నీలో భద్రాచలం(తెలంగాణ) బిడ్డ గొంగడి త్రిష స్టార్‌గా నిలిచింది. 19 ఏళ్ల త్రిష ఈ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఐదు ఇన్నింగ్స్‌లలో 53 సగటుతో, 120.45 స్ట్రైక్ రేట్‌తో 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఫైనల్లోనూ త్రిష హాఫ్ సెంచరీ చేసింది. 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 52 పరుగులు చేసింది. దాంతో, టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 117 పరుగులు చేయగలిగింది.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్‌ మహిళలు 76 పరుగులకే కుప్పకూలారు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యం కూడా బంగ్లాకు కొండలా కనిపించింది. బంగ్లా బ్యాటర్లలో జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) ఇద్దరే రెండెంకల స్కోరూ చేయగలిగారు. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3, సిసోదియా 2, సోనమ్ యాదవ్ 2, జోషిత ఒక వికెట్‌ పడగొట్టారు.