Asian Games 2023: చెలరేగిన షఫాలి... సెమీస్ లో భారత మహిళల జట్టు

Asian Games 2023: చెలరేగిన షఫాలి... సెమీస్ లో భారత మహిళల జట్టు

ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు సెమీ ఫైనల్ కి దూసుకెళ్లింది. నేడు మలేషియాతో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్ వర్షం కారణంగా రద్ధయినా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్ లో ఉండడంతో సెమీ ఫైనల్ కి అర్హత సాధించినట్లుగా ప్రకటించారు.  దీంతో మన మహిళల జట్టు గోల్డ్ మెడల్ గెలవడానికి మరో రెండడుగుల దూరంలో నిలిచింది.

దంచికొట్టిన షెఫాలీ వర్మ 

ఈ మ్యాచులో టాస్ గెలిచిన మలేసియా ఫీల్డింగ్  ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచుని 15 ఓవర్లకు కుదించారు.

Also Read : Good Health : బాదం, అల్లం, బీన్స్ రోజూ తింటే.. ఆ ఎనర్జీనే వేరు..

ఇక ఈ మ్యాచులో భారత మహిళా జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ స్మృతి మంధాన 16 బంతుల్లోనే  5 ఫోర్లతో 27 పరుగులు చేస్తే..    షెఫాలీ 39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేసి మలేసియా బౌలర్లను ఒక ఆటాడుకుంది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 6 ఫోర్లతో 47), రిచా ఘోష్( 7 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21) బ్యాట్ ఝళిపించడంతో 174 పరుగుల భారీ టార్గెట్ ని మలేసియా జట్టుకి విధించింది.
  
రెండు బంతులకే మరోసారి వరుణుడు
 
ఇక భారీ లక్ష్య ఛేదనలో మలేసియా కేవలం రెండు బంతులు ఆడిన తర్వాత భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ఆడేందుకు సాధ్యపడలేదు. దీంతో భారత్ సెమీ ఫైనల్ కి చేరుకుంది. సెప్టెంబర్ 24న ఉమెన్స్ క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. మరి సెమీ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరో చూడాలి.