- ఏకైక టెస్టులో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్
- రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 131 ఆలౌట్
- రాణించిన దీప్తి, పూజ
నవీ ముంబై : ఇంగ్లండ్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్ట్‌లో ఇండియా విమెన్స్ టీమ్ రికార్డు విజయం సాధించింది. బౌలింగ్‌లో స్పిన్నర్ దీప్తి శర్మ (4/32), పూజా వస్త్రాకర్ (3/23), రాజేశ్వరి గైక్వాడ్ (2/20) చెలరేగడంతో.. శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 347 రన్స్ భారీ తేడాతో గ్రాండ్ విక్టరీని అందుకుంది. దీంతో విమెన్స్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో రన్స్ పరంగా అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఫలితంగా ఏప్రిల్1998లో పాకిస్తాన్‌పై 309 రన్స్ తేడాతో నెగ్గి శ్రీలంక నెలకొల్పిన రికార్డును ఇండియా అమ్మాయిలు బ్రేక్ చేశారు. అలాగే స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఆడిన 15 టెస్ట్‌ల్లో ఇండియాకు ఇది తొలి విజయం కావడం విశేషం. 2014లో విదేశాల్లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా నెగ్గింది. ఓవర్‌నైట్ స్కోరు 186/6 వద్దే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇండియా... ఇంగ్లండ్ ముందు 479 రన్స్ భారీ టార్గెట్‌ను ఉంచింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లిష్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 27.3 ఓవర్లలో 131 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ హీథర్ నైట్(21) టాప్ స్కోరర్. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
9 ఏండ్ల తర్వాత..
గత రెండేండ్ల నుంచి టెస్ట్ క్రికెట్ ఆడని ఇండియా విమెన్స్ టీమ్ ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంది. 9 ఏండ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ లో స్పిన్నర్ దీప్తి శర్మ రెండు ఇన్నింగ్స్‌లోనూ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపెట్టింది. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో అద్భుతమైన టర్నింగ్ బాల్స్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది.
తొలి సెషన్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టడానికి ఇండియా బౌలర్లకు ఎక్కువసేపు పట్టలేదు. ఏడో ఓవర్‌లోనే రేణుకా సింగ్(1/30).. టామీ బ్యూమోంట్(17)ను వెనక్కి పంపింది. ఆ వెంటనే 10వ ఓవర్‌లో పూజ డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. వరుస బాల్స్‌లో సోఫీయా డంక్లీ (15), సివర్ బ్రంట్(0)ను పెవిలియన్‌కు చేర్చింది. 37/3తో కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను ఆదుకునే బాధ్యతను హీథర్ నైట్, డ్యానీ వ్యాట్(12) తీసుకున్నారు.
ఈ ఇద్దర్ని ఔట్ చేసేందుకు ఇండియా రెండు డీఆర్‌ఎస్‌లు వృథా చేసినా వికెట్కోసం ఎక్కువసేపు వేచి చూడలేదు. 14వ ఓవర్‌లో పూజ.. హీథర్ నైట్‌ను ఔట్ చేసి మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడి నుంచి స్పిన్నర్ దీప్తి జోరందుకుంది.
తన వరుస ఓవర్లలో (15, 17) వ్యాట్, అమీ జోన్స్(5)ను వెనక్కి పంపింది. మధ్యలో చార్లీ డీన్ (20) కాసేపు పోరాడినా.. రెండో ఎండ్‌లో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంలో ఇండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. సోఫీ ఎకిల్‌స్టోన్(10)ను గైక్వాడ్ ఔట్ చేయగా, 25వ ఓవర్‌లో దీప్తి.. ఐదు బాల్స్ తేడాలో కేట్ క్రాస్(16), లారెన్ ఫిలెర్(0) వికెట్లను పడగొట్టింది. మూడు ఓవర్ల తర్వాత గైక్వాడ్ దెబ్బకు లారెన్ బెల్(8) ఔట్ కావడంతో ఇండియా చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్ : 428 ఆలౌట్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : 136 ఆలౌట్, ఇండియా రెండో ఇన్నింగ్స్: 186/6 డిక్లేర్డ్ (హర్మన్ 44 నాటౌట్, పూజ 17 నాటౌట్, చార్లీ డీన్ 4/68, ఎకిల్‌స్టోన్ 2/76), ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 27.3 ఓవర్లలో 131 ఆలౌట్ (హీథర్ నైట్ 21, చార్లీ డీన్ 20 నాటౌట్, దీప్తి శర్మ 4/32, పూజా వస్త్రాకర్ 3/23, రాజేశ్వరీ గైక్వాడ్ 2/20).