సిరీస్‌‌‌‌ పాయె..రెండో వన్డేలో ఓడిన ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌

సిరీస్‌‌‌‌ పాయె..రెండో వన్డేలో ఓడిన ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌
  •     3 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా
  •     మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో కంగారూలు 2-0తో ఆధిక్యం
  •     రిచా, జెమీమా పోరాటం వృథా‌‌

ముంబై: బ్యాటింగ్‌‌‌‌లో రిచా ఘోష్‌‌‌‌ (117 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లతో 96), బౌలింగ్‌‌‌‌లో దీప్తి శర్మ (5/38) చెలరేగినా.. ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ వన్డే సిరీస్‌‌‌‌ను కాపాడుకోలేకపోయింది. శనివారం జరిగిన రెండో వన్డేలో చివరి వరకు పోరాడిన  టీమిండియా 3 రన్స్‌‌‌‌ స్వల్ప తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను మరోటి మిగిలి ఉండగానే కంగారూలు 2–0తో సొంతం చేసుకున్నారు. 

టాస్‌‌‌‌ గెలిచిన ఆసీస్‌‌‌‌ 50 ఓవర్లలో 258/8 స్కోరు చేసింది. ఫోబీ లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ (98 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లతో 63), ఎలీసా పెర్రీ (47 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 50) హాఫ్‌‌‌‌ సెంచరీలతో ఆకట్టుకున్నారు. తర్వాత ఇండియా 50 ఓవర్లలో 255/8 స్కోరుకే పరిమితమైంది. జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌ (44) రాణించింది. సదర్లాండ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే వాంఖడేలోనే మంగళవారం జరుగుతుంది. 

దీప్తి పాంచ్‌‌‌‌

డ్రై పిచ్‌‌‌‌పై దీప్తి శర్మ స్పిన్‌‌‌‌తో ఆసీస్‌‌‌‌ను కట్టడి చేసినా, ఇండియా ఫీల్డర్లు ఏడు క్యాచ్‌‌‌‌లు డ్రాప్‌‌‌‌ చేసి భారీ స్కోరుకు కారణమయ్యారు. ఓపెనర్లు లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌, అలీసా హీలీ (13) తొలి వికెట్‌‌‌‌కు 40 రన్స్‌‌‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. దాన్ని ఎలీసా పెర్రీ కంటిన్యూ చేసింది. 30 రన్స్‌‌‌‌ వద్ద స్నేహ్‌‌‌‌ రాణా (1/59) క్యాచ్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ చేయడంతో బయటపడ్డ పెర్రీ.. లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌తో రెండో వికెట్‌‌‌‌కు 77 రన్స్‌‌‌‌ జత చేసింది. 

అయితే దీప్తి బౌలింగ్‌‌‌‌కు దిగిన తర్వాత పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చింది. బాల్‌‌‌‌ను బాగా టర్న్‌‌‌‌ చేస్తూ వరుస విరామాల్లో పెర్రీ, బెత్‌‌‌‌ మూనీ (10)ని పెవిలియన్‌‌‌‌కు పంపింది. కొద్దిసేపటికే శ్రేయాంక పాటిల్‌‌‌‌ (1/43) దెబ్బకు లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ ఔట్‌‌‌‌కాగా, ఆష్లే గార్డ్‌‌‌‌నర్‌‌‌‌ (2)ను స్నేహ్‌‌‌‌ రాణా దెబ్బకొట్టింది. 40వ ఓవర్‌‌‌‌లో మెక్‌‌‌‌గ్రాత్‌‌‌‌ (24)ను ఔట్‌‌‌‌ చేసిన దీప్తి మూడో వికెట్‌‌‌‌ ఖాతాలో వేసుకుంది. అప్పటికి ఆసీస్‌‌‌‌ స్కోరు 180/6. ఈ దశలో సదర్లాండ్‌‌‌‌ (23), వారెహమ్‌‌‌‌ (22) నిలకడగా ఆడారు. 

ఏడో వికెట్‌‌‌‌కు 36 రన్స్‌‌‌‌ జత చేసిన ఈ ఇద్దర్ని దీప్తి మూడు రన్స్‌‌‌‌ తేడాతో పెవిలియన్‌‌‌‌కు పంపింది. 219/8 స్కోరుతో ఉన్న ఆసీస్‌‌‌‌కు అలనా కింగ్‌‌‌‌ (28 నాటౌట్‌‌‌‌) భారీ స్కోరు అందించింది. దీప్తి, హర్మన్‌‌‌‌ క్యాచ్‌‌‌‌లు డ్రాప్‌‌‌‌ చేయడంతో కిమ్‌‌‌‌ గారెత్‌‌‌‌ (11 నాటౌట్‌‌‌‌)తో కలిసి తొమ్మిదో వికెట్‌‌‌‌కు 39 రన్స్‌‌‌‌ జోడించింది. 

రిచా పోరాటం..

ఛేజింగ్‌‌‌‌లో రిచా ఘోష్‌‌‌‌, జెమీమా పోరాడారు. ఆరంభంలోనే యాస్తికా భాటియా (14) ఔటైనా, రిచా కీలక భాగస్వామ్యాలతో ఆకట్టుకుంది. రెండో వికెట్‌‌‌‌కు 34 రన్స్‌‌‌‌ జోడించి స్మృతి మంధాన (34) వెనుదిరగగా, జెమీమా సూపర్‌‌‌‌గా ఆడింది. రిచాతో కలిసి ఆసీస్‌‌‌‌ బౌలర్లను హడలెత్తించింది. ఈ ఇద్దరు స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేస్తూ బౌండ్రీలతో విరుచుకుపడ్డారు. ఫలితంగా మూడో వికెట్‌‌‌‌కు 88 రన్స్‌‌‌‌ జత చేశారు. 

అయితే 34వ ఓవర్‌‌‌‌లో జెమీమా ఔట్‌‌‌‌ కావడంతో ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ తడబడింది. కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ (5) ఫెయిలైంది. ఫోర్త్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 12 రన్స్‌‌‌‌ జోడించి ఔటైంది. ఈ దశలో రిచాతో కలిసిన దీప్తి శర్మ (24 నాటౌట్‌‌‌‌) నిలకడగా ఆడింది. 74 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేసి 90ల్లోకి వచ్చిన రిచాను 44వ ఓవర్‌‌‌‌లో సదర్లాండ్‌‌‌‌ (3/47) ఔట్‌‌‌‌ చేయడంతో మ్యాచ్‌‌‌‌ కీలక మలుపు తీసుకుంది. ఐదో వికెట్‌‌‌‌కు 47 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో అమన్‌‌‌‌జ్యోత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (4), పూజా వస్త్రాకర్‌‌‌‌ (8), హర్లీన్‌‌‌‌ డియోల్‌‌‌‌ (1), శ్రేయాంక పాటిల్‌‌‌‌ (5 నాటౌట్‌‌‌‌) నిరాశపర్చడంతో ఇండియా విజయానికి మూడు రన్స్‌‌‌‌ దూరంలో ఆగిపోయింది. 

సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 258/8 (లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ 63, పెర్రీ 50, దీప్తి 5/38). ఇండియా: 50 ఓవర్లలో 255/8 (రిచా 96, జెమీమా 44, సదర్లాండ్‌‌‌‌ 3/47).