Women's U19 World Cup: 4.2 ఓవర్లలోనే మ్యాచ్ ఖతం.. శభాష్ భారత మహిళలు

అండర్‌-19 ప్రపంచకప్‌‌లో భారత్ బోణీ కొట్టింది. ఆదివారం(జనవరి 19) వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించారు. తొలుత విండీస్‌ను 44 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 4.2 ఓవర్లలోనే చేధించింది.

ఐదుగురు డకౌట్

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. భారత బౌలర్ల ధాటికి 13.2 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. విండీస్ బ్యాటర్లలో అసబి క్యాలెండర్ (12), కెనికా కాసర్ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో పరుణికా సిసోడియా 3, జోషిత 2, ఆయుషి శుక్లా 2 వికెట్లు పడగొట్టారు.

ALSO READ | Women's T20 World Cup: 23 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్.. లంక మహిళల భారీ విజయం

 
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 4.2 ఓవర్లలోనే ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (4) నిరాశపరచగా.. కమిలిని (13 బంతుల్లో 16 నాటౌట్), సానికా చాల్కే (11 బంతుల్లో 18 నాటౌట్) పరుగులు చేశారు.

భారత జట్టు తదుపరి మ్యాచ్‌లో మలేషియా మహిళలతో తలపడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం(జనవరి 21) జరగనుంది.