- జోరుమీదున్న టీమిండియా
- రా. 7 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో లైవ్
నవీ ముంబై : తొలి టీ20లో దుమ్మురేపిన ఇండియా విమెన్స్ టీమ్ సిరీస్‌పై గురి పెట్టింది. ఆదివారం ఆస్ట్రేలియా విమెన్స్‌తో జరిగే రెండో టీ20లోనూ అదే జోరును కొనసాగించి.. వన్డే సిరీస్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. వన్డేల్లో ఘోరంగా ఫెయిలై విమర్శలు ఎదుర్కొన్న బ్యాటర్లు తొలి టీ20లో చెలరేగిపోవడం ఇండియాకు అతిపెద్ద సానుకూలాంశం. ఓపెనర్లు షెఫాలీ, స్మృతి మంధాన మరో మంచి భాగస్వామ్యం నెలకొల్పితే ఈ మ్యాచ్‌ను గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే మూడు వన్డేల్లో ఫెయిలైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫామ్‌పై ఆందోళన కొనసాగుతోంది.
తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చాన్స్ రాకపోయిన కెప్టెన్‌కు ఈ పోరు కీలకం కానుంది. జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్ పవర్ హిట్టింగ్ చూపిస్తే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో 19 ఏండ్ల టిటాస్ ఫామ్‌లోకి రావడం ఇండియాకు బలంగా మారింది. స్పిన్నర్లు దీప్తి, శ్రేయాంక పాటిల్ టీమ్‌కు అవసరమైనప్పుడు వికెట్లు తీయడం బాగా కలిసొస్తున్నది. దీనికితోడు టీమిండియా ఫీల్డింగ్‌లో మెరవడం అతి పెద్ద సానుకూలాంశం. వన్డే సిరీస్‌లో క్యాచ్‌లు డ్రాప్ చేసిన ఫీల్డర్లు షార్ట్ ఫార్మాట్‌లో మాత్రం అదరహో అనిపించారు. రన్స్‌ను ఆపడంతో పాటు క్యాచ్‌లు అందుకున్న తీరు అద్భుతం. కెప్టెన్ హర్మన్ నాలుగు క్యాచ్‌లు అందుకోవడమే ఇందుకు నిదర్శనం. మరోసారి సమష్టి పెర్ఫామెన్స్‌ను చూపెడితే ఇండియా ఇక్కడే సిరీస్‌ను గెలవడం పెద్ద కష్టం కాబోదు.
గెలుపే లక్ష్యంగా
మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో ఫెయిలైన బౌలర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా ఇండియా ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క వికెట్ తీయడం, భారీగా రన్స్ ఇచ్చుకోవడంతో మేనేజ్‌మెంట్ తీవ్ర ఆందోళనలో పడింది. బ్యాటింగ్ భారాన్ని లిచ్‌ఫీల్డ్, పెర్రీ మాత్రమే మోస్తుండటం మైనస్‌గా మారింది. ఓపెనింగ్‌లో అలీసా హీలీ, బెత్ మూనీ, తాలియా మెక్‌గ్రాత్ బ్యాట్లు ఝుళిపించాల్సిన అవసరం చాలా ఉంది. వీళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా భారీ స్కోరు ఖాయమే. ఇక ఫినిషర్‌గా, ఆల్‌రౌండర్‌గా ఆష్లే గార్డ్‌నర్ వైఫల్యం టీమ్‌ను వెంటాడుతోంది. తొలి మ్యాచ్‌లో ఆరుగురు బౌలర్లను ప్రయోగించినా ఒక్క వికెట్ మాత్రమే తీశారు. కంగారూల స్థాయికి ఇది చాలా పెద్ద లోటుగా కనిపిస్తున్నది. డార్సి బ్రౌన్, మేఘన్ షుట్, సదర్లాండ్, గార్డ్‌నర్, మెక్‌గ్రాత్, వారెహమ్ ధారాళంగా రన్స్ ఇవ్వడం బలహీనంగా మారింది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో ఇండియాను నిలువరించాలంటే ఆసీస్ వన్డే సిరీస్ ఆటను రిపీట్ చేయాలి. మరి గ్రౌండ్‌లో దాన్ని చూపిస్తారా? లేక సిరీస్‌ను ఇక్కడే ఇచ్చేస్తారా? చూడాలి.
జట్లు (అంచనా)
ఇండియా: హర్మన్ ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జ్యోత్, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, టిటాస్ సాధు.
ఆస్ట్రేలియా: అలీసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, తాలియా మెక్‌గ్రాత్, ఎలైస్ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్, లిచ్‌ఫీల్డ్, గ్రేసీ హారిస్, సదర్లాండ్, వారెహమ్, మేఘన్ షుట్, డార్సి బ్రౌన్.