- 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపు
- రాణించిన మంధాన, తేజల్
రాజ్‌కోట్ : ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఇండియా విమెన్స్ టీమ్ బోణీ చేసింది. టార్గెట్ ఛేజింగ్‌లో ప్రతీక రావల్ (96 బాల్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 89), తేజల్ హసబ్నిస్ (46 బాల్స్‌లో 9 ఫోర్లతో 53 నాటౌట్), కెప్టెన్ స్మృతి మంధాన (29 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 41) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇండియా 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1–0 ఆధిక్యంలో నిలిచింది.
టాస్ గెలిచిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 238/7 స్కోరు చేసింది. కెప్టెన్ గాబీ లూయిస్ (129 బాల్స్‌లో 15 ఫోర్లతో 92), లియా పాల్ (59) రాణించారు. తర్వాత ఇండియా 34.3 ఓవర్లలో 241/4 స్కోరు చేసింది. ప్రతీకాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో వన్డే ఆదివారం జరుగుతుంది.
‘టాప్’ పని పట్టినా..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ టాపార్డర్‌ను కట్టడి చేయడంలో సక్సెస్ అయిన ఇండియా బౌలర్లు మధ్యలో నిరాశపర్చారు. కెప్టెన్ గాబీ లూయిస్ వికెట్ తీయలేక భారీ స్కోరు ఇచ్చుకున్నారు. టిటాస్ సాధూ (1/48, ప్రియా మిశ్రా (2/56) దెబ్బకు సారా ఫోర్బ్స్ (9), ఉనా రేమండ్ హోయ్ (5), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (9), లారా డిలానీ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 56/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన లియా పాల్ సమయోచిత బ్యాటింగ్‌తో లూయిస్‌కు అండగా నిలిచింది.
అదే టైమ్‌లో లూయిస్ ఇచ్చిన మూడు క్లియర్ క్యాచ్‌లతో పాటు మిస్ ఫీల్డింగ్‌తో ఇండియా మూల్యం చెల్లించుకుంది. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 117 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఇండియాపై ఐర్లాండ్‌కు ఇదే తొలి సెంచరీ భాగస్వామ్యం. 39వ ఓవర్‌లో పాల్ ఔట్‌కావడంతో క్రీజులోకి వచ్చిన కోల్టర్ రిలీ (15 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించింది. ఆమెతో 19 రన్స్ జత చేసి సెంచరీ చేయకుండానే లూయిస్ ఔటైంది. చివర్లో అర్లీనా కెల్లీ (28) ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో ఐర్లాండ్ మంచి టార్గెట్‌ను నిర్దేశించింది. సయాలీ, దీప్తి చెరో వికెట్ తీశారు.
84 బాల్స్‌లో 116 రన్స్
ఛేజింగ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన భారీ షాట్లతో విరుచుకుపడగా, ప్రతీక రావల్ నిలకడైన ఆటతో ఆకట్టుకుంది. ఐర్లాండ్ బౌలింగ్ అనుభవలేమిని ఆసరాగా చేసుకుని మంధాన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో ఫోర్లు, సిక్స్ బాదింది. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 10 ఓవర్లలోనే 70 రన్స్ జోడించి వెనుదిరిగింది. మంధాన, రావల్ మధ్య నాలుగో మ్యాచ్‌ల్లో ఇది మూడో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్ (20), జెమీమా (9) మంచి టచ్‌లో కనిపించినా ఎమీ మిగుయెర్ (3/57) దెబ్బకొట్టింది. దీంతో 46 రన్స్ తేడాలో మూడు వికెట్లు పడటంతో ఇండియా 116/3తో కష్టాల్లో పడింది.
కానీ రావల్‌తో జత కట్టిన తేజల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. గ్రౌండ్ నలుమూలాభారీ షాట్లు కొడుతూ ఐరీష్ బౌలర్లను ఉతికి ఆరేసింది. అవతలివైపు రావల్ కూడా ఇదే జోరు కొనసాగించడంతో స్కోరు బోర్డు వేగంగా ముందుకెళ్లింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 84 బాల్స్‌లోనే 116 రన్స్ జత చేశారు. 34వ ఓవర్‌లో ప్రతీక ఔటైనా, రిచా ఘోష్ (8 నాటౌట్)తో కలిసి మరో 93 బాల్స్ మిగిలి ఉండగానే తేజల్ లాంఛనం పూర్తి చేసింది.
1 ఇండియా తరఫున వన్డేల్లో వేగంగా 4 వేల రన్స్ (95 ఇన్నింగ్స్‌ల్లో) పూర్తి చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (112) రికార్డు బ్రేక్ చేసింది.
సంక్షిప్త స్కోర్లు
ఐర్లాండ్ : 50 ఓవర్లలో 238/7 (గాబీ 92, లియా పాల్ 59, ప్రియా 2/56).
ఇండియా : 34.3 ఓవర్లలో 241/4 (ప్రతీక 89, తేజల్ 53*, మిగుయెర్ 3/57).