INDW vs SAW: ఏకైక టెస్ట్‌లో సౌతాఫ్రికా చిత్తు.. 10 వికెట్లతో గెలిచిన భారత మహిళల జట్టు

INDW vs SAW: ఏకైక టెస్ట్‌లో సౌతాఫ్రికా చిత్తు.. 10 వికెట్లతో గెలిచిన భారత మహిళల జట్టు

చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళలు సఫారీలను చిత్తు చేశారు. 10 వికెట్ల తేడాతో గెలిచి భారీ విజయాన్ని అందుకున్నారు. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ టార్గెట్ ను వికెట్ కోల్పోకుండా షెఫాలీ వర్మ(24) , శుభ సతీష్ (13) కొట్టేశారు. వన్డే సిరీస్ ను 3-0 తో గెలుచుకున్న భారత్.. ఏకైక టెస్టులోనూ ఘన విజయం సాధించారు. 

తొలి ఇన్నింగ్స్‌లో విమెన్ ఇన్ బ్లూ 603/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. షఫాలీ వర్మ(205), స్మృతి మంధాన(149), జెమీమా రోడ్రిగ్స్(55), హర్మన్‌ప్రీత్ కౌర్(69), రిచా ఘోష్(86) పరుగులు చేశారు. దీంతో 90 ఏళ్ల మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో మరే ఇతర మహిళా జట్టు సాధించలేని రికార్డు నెలకొల్పారు. 600 పైచిలుకు పరుగులు చేసి మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా అవతరించారు. గతంలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆసీస్ మహిళలు 575/9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 266 పరుగులకు ఆలౌటైంది. 74 పరుగులు చేసిన కప్ టాప్ స్కోరర్. భారత బౌలర్లలో స్నేహ రానా 8 వికెట్లతో చెలరేగింది. తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులు వెనకబడిన దక్షిణాఫ్రికా ఫాలో ఆన్ ఆడింది. వోల్వర్ట్ (122), లూస్ (109) పోరాడడంతో ఒక దశలో మ్యాచ్ డ్రా వైపుగా పయనించింది. అయితే ఐదో రోజు భారత బౌలర్లు పుంజుకోవడంతో 373 పరుగులకు ఆలౌటైంది. చివర్లో డీ క్లర్క్ అసాధారణం పోరాటంతో ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగలిగింది. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన స్నేహ రానాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.