IND vs SA: బ్రిట్స్ వణికించినా రాణా గెలిపించింది: సఫారీలపై టీమిండియా మహిళలు థ్రిల్లింగ్ విక్టరీ

IND vs SA: బ్రిట్స్ వణికించినా రాణా గెలిపించింది: సఫారీలపై టీమిండియా మహిళలు థ్రిల్లింగ్ విక్టరీ

వన్డే ట్రై సిరీస్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం (ఏప్రిల్ 29) సౌతాఫ్రికా మహిళలతో  జరిగిన మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. తొలి వికెట్ కు లారా వోల్వార్డ్ట్, బ్రిట్స్ (107 బంతుల్లో 109: 13 ఫోర్లు, 3 సిక్సర్లు) ఏకంగా 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినా.. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకొని అద్భుతంగా రాణించారు. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో స్నేహ రాణా 5 వికెట్లతో సత్తా చాటడంతో ఓడిపోయే మ్యాచ్ లో గెలుపు అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది.  

277 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి వికెట్ కు వోల్వార్డ్ట్, బ్రిట్స్ ఏకంగా 140 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని దీప్తి శర్మ విడగొట్టింది. 2 వికెట్ల నష్టానికి 181 పరుగులతో విజయం దిశగా వెళ్తున్న సఫారీలు ఒక్కసారిగా కుప్పకూలారు. స్పిన్నర్ స్నేహ రాణా ధాటికి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఒక ఎండ్ లో టాజ్మిన్ బ్రిట్స్ ఒంటరి పోరాటం చేసినా ఆమెకు మిగిలిన వారి నుంచి పెద్దగా సహకరించలేదు. 48 ఓవర్ చివరి బంతికి ఔట్ కావడంతో సౌతాఫ్రికా ఓటమి ఖరారైంది. 

భారత బౌలర్లలో స్నేహ రాణా 5 వికెట్లు పడగొట్టింది. అరుంధతి రెడ్డి, చరని, దీప్తి శర్మ తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగుల భారీ స్కోర్ చేసింది.  ఓపెనర్ ప్రతీక రావల్ 78పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. స్మృతి మంధన (36), హర్మాన్ ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగ్స్ (42) రాణించారు. ఏ టోర్నీలో తర్వాత మ్యాచ్ శ్రీలంక, సౌతాఫ్రికా జట్ల మధ్య గురువారం (మే 1) జరుగుతుంది.