- ఏకైక టెస్టు మ్యాచ్‌లో 8 వికెట్లతో గెలిచిన హర్మన్‌సేన
- రాణించిన స్నేహ్ రాణా, రాజేశ్వరి
ముంబై : మొన్న ఇంగ్లండ్‌పై అతి పెద్ద విజయంతో రికార్డు సృష్టించిన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ ఇప్పుడు బలమైన ఆస్ట్రేలియాపై హిస్టారికల్ విక్టరీ సాధించింది. 46 ఏండ్ల పోరాటంలో 11 ప్రయత్నాల తర్వాత టెస్టుల్లో ఆసీస్‌పై తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించింది. ఆదివారం ముగిసిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఇండియా 8 వికెట్ల తేడాతో కంగారూ టీమ్‌ను చిత్తు చేసింది. ఇండియా చివరి రోజు బాల్, బ్యాట్‌తో సత్తా చాటింది. తొలుత మరో 28 రన్స్‌కే ఆసీస్ చివరి ఐదు వికెట్లు పడగొట్టింది.
ఆపై, ఆ జట్టు ఇచ్చిన 75 పరుగులు లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఈజీగా ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన (38 నాటౌట్), రిచా ఘోశ్(13), జెమీమా రోడ్రిగ్స్ (12 నాటౌట్) రాణించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 233/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 261 రన్స్‌కే ఆలౌటైంది. స్పిన్నర్లు స్నేహ్ రాణా (4/63), రాజేశ్వరి గైక్వాడ్ (2/42) దెబ్బకు చివరి వరుస బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 219, ఇండియా 406 రన్స్ చేశాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
45 నిమిషాల్లోనే..
మూడో రోజు ఇండియాకు గట్టి పోటీనిచ్చిన కంగారూలు ఆఖరి రోజు తేలిపోయారు. స్పిన్ త్రయం రాణా, గైక్వాడ్, దీప్తి శర్మ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డారు. దాంతో46 రన్స్ ఆధిక్యంతో ఆట కొనసాగించిన ఆసీస్ 45 నిమిషాల్లో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. తొలుత ఓవర్‌నైట్ బ్యాటర్ ఆష్లే గార్డ్‌నర్ (11)ను ఎల్బీ చేసిన పేసర్ పూజా వస్త్రాకర్ (1/11) ఆ జట్టు పతనాన్ని ఆరంభించింది. ఆపై స్నేహ్ రాణా వెంటవెంటనే సదర్లాండ్ (27), అలానా కింగ్ (0)ను పెవిలియన్ చేర్చింది. మూడో రోజు వికెట్లు పడగొట్టలేకపోయిన రాజేశ్వరి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.
కిమ్ గార్త్ (4)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆమె ఆవెంటనే సూపర్ టర్నర్‌తో జొనాసెన్ (9) వికెట్ పడగొట్టి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముగించింది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో తొలి బాల్‌నే బౌండ్రీకి పంపిన షెఫాలీ (4)నాలుగో బాల్‌కు హీలీకి క్యాచ్ ఇచ్చి ఔటైంది. మరో ఓపెనర్ మంధాన, రిచా ఘోష్ రెండో వికెట్‌కు 51 రన్స్ జోడించారు. గార్డ్‌నర్ బౌలింగ్‌లో రిచా వెనుదిరిగినా.. జెమీమాతో కలిసి మంధాన లాంఛనం పూర్తి చేసింది. దాంతో లంచ్ తర్వాత పది ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది.