హర్మన్‌‌సేనకు విండీస్ సవాల్‌‌

హర్మన్‌‌సేనకు విండీస్ సవాల్‌‌
  •     నేడు కరీబియన్ టీమ్‌‌తో ఇండియా తొలి టీ20
  •     రా. 7 నుంచి స్పోర్ట్స్‌‌18లో 

నవీ ముంబై : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌లో 0–3తో వైట్‌‌వాష్ అయిన ఇండియా విమెన్స్‌‌ టీమ్ ఇప్పుడు సొంతగడ్డపై వెస్టిండీస్‌‌తో టీ20 సవాల్‌‌కు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌‌లో భాగంగా ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌‌ జరగనుంది. కెప్టెన్‌‌గా నిరాశపరుస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హర్మన్‌‌ప్రీత్ కౌర్‌‌‌‌కు ఈ సిరీస్‌‌ కీలకం కానుంది. బ్యాట్‌‌తో రాణించడంతో పాటు జట్టును విజయాల బాట పట్టించాల్సిన బాధ్యతను హర్మన్‌‌ తీసుకోవాలి.  

2019 నవంబర్ నుంచి విండీస్‌‌తో ఆడిన 8 టీ20ల్లో ఇండియా గెలిచింది. ఆ రికార్డును కొనసాగించాలంటే ఆతిథ్య జట్టు అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఆసీస్‌‌తో వన్డే సిరీస్‌‌లో  తుది జట్టు విషయంలో హర్మన్‌‌ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. ఈ సిరీస్‌లోనూ ఓపెనర్‌‌‌‌ షెఫాలీ వర్మ జట్టులో లేకపోవడం ఇండియాకు మైనస్ కానుంది.  ఆసీస్‌‌తో చివరి వన్డేలో సెంచరీతో ఫామ్‌‌లోకి వచ్చిన మంధాన మరోసారి కీలకం కానుంది.

కానీ, అదే మ్యాచ్‌‌లో  కెరీర్ బెస్ట్ బౌలింగ్‌‌ చేసిన హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డిని విండీస్‌‌తో టీ20లతో పాటు వన్డే సిరీస్‌‌కు సెలెక్టర్లు దూరంగా ఉంచడం కూడా విమర్శలకు తావిచ్చింది. మరోవైపు హేలీ మాథ్యూస్‌‌ కెప్టెన్సీలోని విండీస్‌‌.. ఇండియా గడ్డపై సత్తా చాటాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనుంది.