- 60 రన్స్ తేడాతో వెస్టిండీస్ విమెన్స్‌పై గెలుపు
- 2–1తో సిరీస్ సొంతం
- రాణించిన రిచా, జెమీమా, బిస్త్
నవీ ముంబై : బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ఇండియా విమెన్స్ టీమ్.. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో అద్భుత విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన (47 బాల్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 77)కు తోడు రిచా ఘోష్ (21 బాల్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో టీమిండియా 60 రన్స్ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ నెగ్గిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 217/4 స్కోరు చేసింది. ఈ ఫార్మాట్లో ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు.
తర్వాత విండీస్ 20 ఓవర్లలో 157/9 స్కోరుకే పరిమితమైంది. చినెల్లీ హెన్రీ (43) టాప్ స్కోరర్. హీలీ మాథ్యూస్ (22), దియోంద్ర డాటిన్ (25) ఫర్వాలేదనిపించారు. క్యాంప్‌బెల్ (17), క్వియానా జోసెఫ్ (11)తో సహా మిగతా వారు నిరాశపర్చారు. రాధా యాదవ్ (4/29) దెబ్బకు విండీస్ లోయర్ ఆర్డర్ కుదేలైంది. ఆరుగురు సింగిల్ డిజిట్ స్కోరే చేయడంతో టార్గెట్‌ను అందుకోలేకపోయింది. రిచాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, స్మృతికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
రిచా మెరుపులు..
సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో ఆరంభం నుంచే ఇండియా బ్యాటర్లు దుమ్మురేపారు. విండీస్ బౌలింగ్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ భారీ షాట్లతో రెచ్చిపోయారు. తొలి ఓవర్ వేసిన హెన్రీ (1/14) ఆరో బాల్‌కే ఉమా ఛెత్రి (0)ని డకౌట్ చేసింది. దీంతో 1/1 స్కోరుతో కష్టాల్లో పడిన ఇండియాను స్మృతి, జెమీమా (28 బాల్స్‌లో 4 ఫోర్లతో 39) ఆదుకున్నారు. పవర్‌ప్లేలో ఈ ఇద్దరు పోటీపడి బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. తొలి ఆరు ఓవర్లలో 61/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో మంధాన 27 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసింది.
ఈ సిరీస్‌లో ఆమెకు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అలాగే విమెన్స్ టీ20ల్లో 30 హాఫ్ సెంచరీలతో సుజీ బేట్స్ (29) రికార్డును బ్రేక్ చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా మంధాన మెరుపు షాట్లతో ఆకట్టుకుంది. రెండో ఎండ్‌లో జెమీమా కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేయడంతో ఫస్ట్ టెన్‌లో ఇండియా 99/1 స్కోరుతో నిలిచింది. అయితే 11వ ఓవర్ తొలి బాల్‌కు ఫ్లెచర్ (1/24).. జెమీమాను ఎల్బీ చేయడంతో రెండో వికెట్‌కు 98 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన రాఘవి బిస్త్ (22 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 నాటౌట్) కూడా ఎక్కడా తగ్గలేదు.
మంధానతో కలిసి గ్రౌండ్ నలువైపులా భారీ షాట్లు ఆడింది. మూడో వికెట్‌కు 42 రన్స్ జోడించిన తర్వాత ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించిన మంధాన.. డాటిన్ (1/54) బౌలింగ్‌లో ఔటైంది. ఈ టైమ్‌లో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. లాంగాఫ్, లాంగాన్, మిడ్ వికెట్ మీదుగా ఐదు భారీ సిక్సర్లు కొట్టింది. కేవలం 18 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ సాధించింది. రాఘవితో కలిసి నాలుగో వికెట్‌కు 32 బాల్స్‌లో 70 రన్స్ జత చేసి వెనుదిరిగింది. సాజన (4 నాటౌట్) చివరి బాల్‌ను బౌండ్రీకి తరలించడంతో ఇండియా భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా : 20 ఓవర్లలో 217/4 (మంధాన 77, రిచా ఘోష్ 54, హెన్రీ 1/14). వెస్టిండీస్ : 20 ఓవర్లలో 157/9 (హెన్రీ 43, డాటిన్ 25, రాధా 4/29).