జింబాబ్వే టూర్ లో భాగంగా 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ టీమిండియా వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. హరారే వేదికగా జింబాబ్వేతో ముగిసిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ లో తొలి టీ20లో జింబాబ్వే గెలవగా.. రెండో టీ20 లో భారత్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 6 వికెట్లకు 159 పరుగులు చేసింది.
183 పరుగుల భారీ బరిలోకి దిగిన జింబాబ్వే పవర్ ప్లే లో చక చక వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లు చెలరేగడంతో తొలి 7 ఓవర్లు ముగిసేసరికి 39 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమి అంచుల్లో పడింది. మారుమణి(13), వెస్లీ మాధేవెరే(1), బ్రియాన్ బెన్నెట్(4), సికందర్ రజా(15), జోనాథన్ కాంప్‌బెల్(1) వరుస పెట్టి పెవిలియన్ కు క్యూ కట్టారు. అయితే ఈ దశలో డియోన్ మైయర్స్, క్లైవ్ మదాండే భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. వేగంగా పరుగులు చేస్తూ చెమటలు పట్టించారు. ఆరో వికెట్ కు 77 పరుగులు జోడించిన తర్వాత ఈ జోడీని 17 ఓవర్లో సుందర్ విడగొట్టాడు. దీంతో జింబాబ్వే ఓటమి ఖరారైంది.
మేయర్స్ (57) చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మదాండే 37 పరుగులు చేసి రాణించాడు. భారత బౌలర్లలో సుందర్ కు 3 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ రెండు.. ఖలీల్ ఒక వికెట్ తీసుకున్నారు. అంతకముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుభమాన్ గిల్(49 బంతుల్లో 66: 3 సిక్సులు, 7 ఫోర్లు) రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 49: 4 ఫోర్లు, 3 సిక్సులు) యశస్వి జైస్వాల్ (36) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా, ముజురుభాని చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Zimbabwe gave it a good go but India go 2-1 #ZIMvIND https://t.co/BUGVUr6h8x pic.twitter.com/6vqNUuygg5
— ESPNcricinfo (@ESPNcricinfo) July 10, 2024