చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. నాలుగో రోజు తొలి సెషన్ లో ముగిసిన టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో ఈ సిరీస్ లో బోణీ కొట్టింది. 4 వికెట్ల నష్టానికి 158 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన బంగ్లాదేశ్ 234 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్, జడేజా విజ్రంభించి లంచ్ లోపే బంగ్లాను చిత్తు చేశారు. ఈ విజయంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 న జరుగుతుంది.
నాలుగో రోజు షకీబ్, శాంటో బంగ్లా ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 48 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. ఈ జోడీని అశ్విన్ విడదీయడంతో బంగ్లా కోలుకోలేకపోయింది. షకీబ్ వికెట్ తో అశ్విన్ 5 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. చివర్లో చక చక వికెట్లు తీస్తూ బంగ్లా లోయర్ ఆర్డర్ ను జడేజా పెవిలియన్ కు పంపాడు. 82 పరుగులు చేసిన కెప్టెన్ శాంటో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ కు నాలుగు వికెట్లు దక్కాయి. జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు.
మూడో రోజు గిల్ (119), పంత్ (109) సెంచరీలతో భారత్ తమ రెండో ఇన్నింగ్స్ 4 వికెట్లకు 287 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
The Chennai boy R Ashwin wraps up the game early on Sundayhttps://t.co/i7S5QqEZ4M #INDvBAN pic.twitter.com/QnHIHLij83
— ESPNcricinfo (@ESPNcricinfo) September 22, 2024