![IND vs ENG: సిరీస్ మనదే: కటక్‌లో ఇంగ్లాండ్ చిత్తు.. రోహిత్ సెంచరీతో టీమిండియా ఘన విజయం](https://static.v6velugu.com/uploads/2025/02/india-won-by-4-wickets-vs-england-in-2nd-odi_L5lnwGfxsA.jpg)
కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ మెరుపు సెంచరీ(90 బంతుల్లో 119: 12 ఫోర్లు, 7 సిక్సర్లు)తో ఇంగ్లాండ్ ను చిత్తు చేస్తూ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది.
రోహిత్ తుఫాన్ ఇన్నింగ్స్:
305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 100 బంతుల్లోనే 136 పరుగులు జోడించి సగం పని పూర్తి చేశారు. ఈ క్రమంలో గిల్, రోహిత్ శర్మ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గిల్ (60), కోహ్లీ (5) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరినా.. అయ్యర్ తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. మూడో వికెట్ కు అయ్యర్ తో కలిసి కీలకమైన 70 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 76 బంతుల్లో రోహిత్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో రోహిత్, అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్య ఔటైనా అక్షర్ పటేల్(41), జడేజా (11) మ్యాచ్ ను ఫినిష్ చేశారు.
ఇంగ్లాండ్ భారీ స్కోర్:
ఇంగ్లాండ్ బ్యాటర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ జో రూట్ 69 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి వన్డే మాదిరిగానే సాల్ట్(26), డకెట్(65) తొలి వికెట్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. బట్లర్ (34), బ్రూక్ (31) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య,హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ తలో వికెట్ పడగొట్టారు. సెంచరీ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
INDIA WIN the match and the ODI series 👏👏https://t.co/CfboFqBO4y | #INDVENG pic.twitter.com/RDKkPLb6KU
— ESPNcricinfo (@ESPNcricinfo) February 9, 2025
ALSO READ | IND vs ENG: రోహిత్ శర్మ మెరుపు సెంచరీ.. కటక్ వన్డేలో విజయం దిశగా టీమిండియా