కాన్పూర్ టెస్టులో అద్భుతం జరిగింది. బంగ్లాదేశ్ పై భారత్ విజయ ఢంకా మోగించింది. తొలి మూడు రోజుల తర్వాత డ్రా ఖాయమన్న దశలో చివరి రెండు రోజులు రోహిత్ సేన అసాధారణంగా పోరాడి గెలిచింది. చివరి రోజు బంగ్లాదేశ్ విధించిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (51), కోహ్లీ (29) జాగ్రత్తగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు. రోహిత్ (8), గిల్ (6) విఫలమయ్యారు. దీంతో భారత్ సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది.
2 వికెట్ల నష్టానికి 26 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ మోమినుల్ హక్ వికెట్ ను త్వరగానే కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ శాంటో, ఓపెనర్ షాదాబ్ ఇస్లాం భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. మూడో వికెట్ కు 55 పరుగులు జోడించిన తర్వాత ఈ జోడీని జడేజా విడదీశాడు. ఇక్కడ నుంచి బంగ్లా పతనం ప్రారంభమైంది. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. జడేజా, బుమ్రా విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా, అశ్విన్ తలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్ కు ఒక వికెట్ దక్కింది.
107/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆలౌటైంది. మమినుల్ హక్(107*) ఒక్కడు ఒంటరి పోరాటం చేశాడు. 194 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 107 పరుగులతో నౌటౌట్‌గా నిలిచాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ 34.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగుల ఆధిక్యం లభించింది. 51 బంతుల్లోనే 72 పరుగులు చేసి జైశ్వాల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాహుల్ 68 పరుగులు చేసి భారత్ కు వేగంగా ఆధిక్యాన్ని అందించాడు. కోహ్లీ (47), గిల్ (39) రాణించారు.
Historic Test victory for India at Kanpur!🔥🇮🇳 pic.twitter.com/d9EGDQEO11
— CricketGully (@thecricketgully) October 1, 2024