IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ మనదే.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ

IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ మనదే.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ పోటీ ఇచ్చినా భారత్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఇండియాకు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అంతకముందు 2013 లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. 

2002లో గంగూలీ కెప్టెన్సీలో  శ్రీలంకతో పాటు సంయుక్త విజేతగా నిలిచింది. ఈ మెగా ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. భారత విజయంలో రోహిత్ శర్మ (76: 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేసి అయ్యర్ రాణించాడు. 

ALSO READ | IND vs NZ Final: విలియంసన్ స్థానంలో చాప్ మన్.. ఫీల్డింగ్‌కు రాని కేన్ మామ

ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఇండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రోహిత్ శర్మ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో భారత్ పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా భారత్ నిలకడగా ఆడడంతో భారత విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే కివీస్ స్పిన్నర్లు విజృంభించడంతో 17 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. గిల్(31), రోహిత్ (76),కోహ్లీ (1) ఔటయ్యారు. ఈ దశలో ఒత్తిడిని అధిగమిస్తూ అక్షర్ పటేల్(29), శ్రేయాస్ అయ్యర్(48) అద్భుతంగా ఆడారు. కీలక భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును విజయానికి దగ్గరకు తీసుకెళ్లారు. వీరిద్దరూ వెంటనే ఔటైనా రాహుల్ (34) హార్దిక్ పాండ్య (18) మ్యాచ్ ను గెలిపించారు. చివర్లో జడేజా (9) ఫోర్ తో విన్నింగ్స్ రన్స్ కొట్టాడు.  

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ డారిల్ మిచెల్, బ్రేస్ వెల్ అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 101 బంతుల్లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్రేస్ వెల్ 51 పరుగులు చేసి చివర్లో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. జడేజా, షమీలకు ఒక వికెట్ దక్కింది.