
ఫైనల్లో 1-0తో చైనాపై గెలుపు
హులన్‌బుయిర్ (చైనా): లీగ్ దశ నుంచి తిరుగులేని ఆధిపత్యాన్ని చూపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ ఇండియా హాకీ జట్టు.. ఐదోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఇండియా 1–0తో చైనాపై గెలిచింది. డిఫెండర్ జుగ్‌రాజ్ సింగ్ (51వ నిమిషం) ఇండియాకు ఏకైక ఫీల్డ్ గోల్ అందించాడు. 2011లో తొలిసారి విన్నర్‌గా నిలిచిన ఇండియా 2016, 2018, 2021, 2023లో టైటిల్‌ను సాధించింది. మొత్తం ఎనిమిది ఎడిషన్లలో 2012లో రన్నరప్‌గా, 2021లో మూడో ప్లేస్‌లో నిలిచింది. ఓవరాల్‌గా అత్యధిక టైటిల్స్ నెగ్గిన తొలి టీమ్‌గా ఇండియా రికార్డులకెక్కింది. తొలిసారి ఫైనల్ చేరిన చైనా.. ఇండియాకు గట్టి పోటీనిచ్చింది. బలమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నా చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
హోరాహోరీ..
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇండియా తొలి లీగ్ మ్యాచ్‌లో చైనాను 3–0తో ఓడించినా ఫైనల్ మాత్రం హోరాహోరీగా సాగింది. ఇరుజట్ల డిఫెండర్లు బాల్‌పై ఆధిపత్యం కోసం చిన్నపాటి యుద్ధమే చేశారు. ఎటాకింగ్‌లో ఇండియా పైచేయి సాధించినా ఎక్కువగా రిస్క్ తీసుకోలేదు. దీంతో తొలి క్వార్టర్‌లో రెండుసార్లు గోల్స్ చేసే అవకాశాలను వృథా చేసుకుంది. రాజ్ కుమార్ పాల్ కొట్టిన తొలి షాట్‌ను చైనా గోల్ కీపర్ వాంగ్ వీహావో నిలువరించాడు. పదో నిమిషంలో లభించిన పెనాల్టీని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వృథా చేశాడు. రెండు నిమిషాల తర్వాత నీలకంఠ కొట్టిన షాట్‌ను వాంగ్ అడ్డుకున్నాడు. రెండో క్వార్టర్‌లోనూ ఇండియా వరుస దాడులు చేసినా గోల్ చేయలేకపోయింది. 27వ నిమిషంలో సుఖ్‌జీత్ పెనాల్టీ రాబట్టినా హర్మన్ గోల్ పోస్ట్‌లోకి పంపలేకపోయాడు. ఎండ్స్ మారిన తర్వాత చైనా కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. అయితే, 38వ నిమిషంలో లభించిన పెనాల్టీని చైనా గోల్‌గా మల్చలేదు. 40వ నిమిషంలో ఆ జట్టుకు వరుసగా రెండు పెనాల్టీలు లభించినా.. ఇండియా కీపర్ క్రిషన్ సమర్థంగా అడ్డుకున్నాడు. గోల్ లేకుండానే మూడు క్వార్టర్స్ ముగిసిపోవడంతో ఇరుజట్లపై ఒత్తిడి నెలకొంది. ఈ దశలో ఇండియా యంగ్ ఫార్వర్డ్స్ ఓ పద్ధతి ప్రకారం బాల్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో చైనీస్ డిఫెన్స్ ఛేదించడంలో సక్సెస్ అయ్యారు.
చివరకు హర్మన్ అద్భుతమైన స్టిక్ వర్క్‌తో నిరీక్షణకు తెరదించాడు. చైనా సర్కిల్‌లో బాల్‌ను అటుఇటు తీసుకెళ్తూ స్లోగా డిఫెండర్ జుగ్‌రాజ్‌కు అందించాడు. ఈ పాస్‌ను జుగ్‌రాజ్ సక్సెస్‌ఫుల్‌గా చైనా గోల్‌పోస్ట్‌లోకి పంపి ఇండియాను 1–0 లీడ్‌లో నిలిపాడు. వెంటనే అప్రమత్తమైన చైనా చివరి నాలుగు నిమిషాల్లో తమ గోల్ కీపర్‌ను తప్పించి ఎక్స్‌ట్రా ఫీల్డ్ ప్లేయర్‌ను రంగంలోకి దించి ఎదురుదాడి మొదలుపెట్టింది. కానీ ఇండియా డిఫెన్స్ సమర్థంగా తిప్పికొట్టి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
చైనా జెండాలతో పాక్ ఆటగాళ్లు
సెమీఫైనల్లో ఓడిన పాకిస్తాన్ మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో 5–2తో కొరియాను ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత ఫైనల్‌కు వచ్చిన పాక్ ఆటగాళ్లు.. చైనాకు మద్దతు ఇచ్చారు. చైనా జెండాలు పట్టుకుని స్టేడియంలో కూర్చుకున్నారు. పాక్ సెమీస్‌లో చైనా చేతిలోనే ఓడటం గమనార్హం.
ఒక్కో ప్లేయర్‌కు 3 లక్షలు నజనారా
టైటిల్ గెలిచిన జట్టుకు హాకీ ఇండియా నజరానాను ప్రకటించింది. ఒక్కో ప్లేయర్‌కు రూ. 3 లక్షలు, సపోర్ట్ స్టాఫ్‌కు తలా లక్షన్నర చొప్పున అందిస్తామని తెలిపింది.