- తొలి వన్డేలో ఇండియా గ్రాండ్ విక్టరీ
- 143 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చిత్తు
- ఆశ శోభనకు నాలుగు వికెట్లు
బెంగళూరు : ఓపెనర్ స్మృతి మంధాన (127 బాల్స్‌లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 117) సూపర్ సెంచరీకి తోడు అరంగేట్రం బౌలర్ ఆశ శోభన (4/21) నాలుగు వికెట్లతో విజృంభించడంతో సౌతాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌ను ఇండియా అదిరిపోయే విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో 143 రన్స్ తేడాతో సఫారీలను చిత్తుగా ఓడించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా మంధాన మెరుపులతో నిర్ణీత 50 ఓవర్లలో 265/8 స్కోరు చేసింది. ఓవైపు స్మృతి తడాఖా చూపెడుతున్నా మరో ఎండ్‌లో షెఫాలీ (7), హేమలత (12), కెప్టెన్ హర్మన్ ప్రీత్ (10), జెమీమా రోడ్రిగ్స్ (17)
రిచా ఘోష్ (3) నిరాశ పరచడంతో ఓ దశలో ఇండియా 99/5తో కష్టాల్లో పడింది. అయినా వెనక్కుతగ్గని మంధాన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు దీప్తి శర్మ (37)తో ఆరో వికెట్‌కు 81 రన్స్, పూజా వస్త్రాకర్ (31)తో ఏడో వికెట్‌కు 58 రనస్ జోడించి జట్టుకు మంచి స్కోరు అందించింది. సఫారీ బౌలర్లలో అయబోగ ఖకా మూడు, మసబట క్లాస్ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 37.4 ఓవర్లలో 122 రన్స్‌కే కుప్పకూలి చిత్తుగా ఓడింది.
సున్ లూస్ (33), సినలో జఫ్టా (27), మరిజేన్ కాప్ (24) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. 33 ఏండ్ల లెగ్ స్పిన్నర్ ఆశా శోభన నాలుగు వికెట్లు పడగొట్టి తన అరంగేట్రం మ్యాచ్‌ను ఎప్పటికీ గుర్తుండేలా మార్చుకుంది. దీప్తి శర్మ రెండు వికెట్లతో రాణించింది. మంధానకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో వన్డే బుధవారం జరుగుతుంది.