
కల్గరీ (కెనడా): ఇండియా యంగ్ షట్లర్ ప్రియాన్షు రజావత్.. కెనడా ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్ 39వ ర్యాంకర్ ప్రియాన్షు 21–11, 17–21, 21–19తో టాప్‌సీడ్, వరల్డ్ నాలుగో ర్యాంకర్ అండెర్స్ ఆంటోన్‌సేన్ (డెన్మార్క్)పై నెగ్గి సెమీస్‌లోకి ప్రవేశించాడు. ఆంటోన్‌సేన్‌పై నెగ్గడం ఇండియన్ షట్లర్‌కు ఇదే తొలిసారి.
గంటా19 నిమిషాల మ్యాచ్‌లో ప్రియాన్షు సత్తా మేరకు రాణించాడు. చెరో గేమ్ నెగ్గిన తర్వాత మూడో గేమ్‌లో రజావత్‌కు గట్టి పోటీ ఎదురైంది. 12–12, 16–16తో సమమైంది. ఈ దశలో రజావత్ మూడు పాయింట్లు నెగ్గి 19–16తో నిలిచినా అంటోన్‌సేన్ స్కోరు 19–19తో సమం చేశాడు. చివర్లో రజావత్ రెండు స్మాష్‌లతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. విమెన్స్ డబుల్స్ క్వార్టర్స్‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 18–21, 21–19, 16–21తో సీహ్ పీ షెన్–హుంగ్ ఎన్ జు (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు.