పారిస్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా యంగ్ రెజ్లర్ అమన్ సెహ్రావత్.. కీలక మ్యాచ్‌లో ఓడినా పతకం రేస్‌లోనే ఉన్నాడు. గురువారం జరిగిన మెన్స్ 57 కేజీల ఫ్రీస్టయిల్ సెమీఫైనల్లో 0–10తో హిగుచి రీ (జపాన్) చేతిలో ఓడాడు. తొలి పీరియడ్‌లోనే జపాన్ రెజ్లర్ అద్భుతమైన పట్టుతో అమన్‌ను కట్టడి చేశాడు. మ్యాట్‌పై పడేసి కదలకుండా పట్టుకోవడంతో వరుసగా 4, 2, 2, 2గా పాయింట్లు వచ్చాయి.
ఈ రౌండ్‌లో అమన్ ఒక్క పాయింట్ కూడా గెలవకపోవడంతో టెక్నికల్ సుపీరియారిటీ కింద హిగుచిని విన్నర్‌గా ప్రకటించారు. కేవలం 134 సెకన్లలోనే బౌట్ ముగియడం విశేషం. అంతకుముందు జరిగిన క్వార్టర్‌ఫైనల్లో అమన్ 12–0తో మాజీ వరల్డ్ చాంపియన్ జెలిమఖాన్ అబకరోవ్ (అల్బేనియా)పై గెలిచాడు. బౌట్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఇండియన్ రెజ్లర్.. ప్రత్యర్థి ఎడమ కాలిని హోల్డ్ చేసి 3–0 లీడ్‌లో నిలిచాడు.
రెండో రౌండ్ స్టార్టింగ్‌లో అబకరోవ్‌ను రెండు కాళ్లతో లాక్ చేసి అటు ఇటు తిప్పుతూ వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గాడు. ఈ దాడి నుంచి తప్పించుకోవడానికి అబకరోవ్ చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. ప్రిక్వార్టర్స్‌లో అమన్ 10–0తో వ్లాడిమిర్ ఎగోరోవ్ (మెక్‌డోనియా)ను ఓడించాడు. శుక్రవారం జరిగే బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో అమన్.. డారియన్ టోయ్ క్రుజ్ (ప్యూర్టోరికా)తో తలపడతాడు.
విమెన్స్ 57 కేజీ ప్రిక్వార్టర్స్‌లో అన్షు మాలిక్ 2–7తో హెలెన్ లూయిస్ మారోలిస్ (అమెరికా) చేతిలో ఓడింది. బౌట్ ఆరంభంలో మంచి కాన్ఫిడెన్స్‌తో ఆడిన అన్షు.. అమెరికన్ అనుభవం ముందు నిలవలేకపోయింది. హెలెన్ ఫైనల్‌కు చేరుకుంటే అన్షుకు రెపీఛేజ్ రౌండ్ ఆడే చాన్స్ దక్కుతుంది.